Published : 23 May 2022 01:52 IST

54600 ఎగువన రికవరీ!

సమీక్ష: దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో అయిదు వారాల వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, ఆర్థిక గణాంకాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మాత్రం కొనసాగాయి. చైనాలో కొవిడ్‌ ఆంక్షలు సడలించడం సానుకూల ప్రభావం చూపింది. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతానికి ఎగబాకింది. కార్పొరేట్‌ ఫలితాలు మిశ్రమంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్‌ను నిర్దేశించాయి. జీఎస్‌టీ మండలి సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రుతుపవనాలు ఈ నెల చివరకు ప్రారంభం కావొచ్చన్న ఐఎండీ నివేదిక ఉత్సాహం నింపింది. బ్యారెల్‌ ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 112.6 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 77.45 నుంచి 77.55కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. ద్రవ్యోల్బణ భయాలు, పలు దేశాల కేంద్ర బ్యాంక్‌ల రేట్ల పెంపులతో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. చైనా వడ్డీ రేట్లు తగ్గించడం కొంత కలిసొచ్చింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.9 శాతం లాభంతో 54,326 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 3.1 శాతం పెరిగి 16,266 పాయింట్ల దగ్గర స్థిరపడింది. లోహ, యంత్ర పరికరాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించాయి. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ స్క్రిప్‌లు మాత్రం డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.11,401 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.9,472 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుంచి రూ.35,137 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:1గా నమోదు కావడం..

దిగువ స్థాయుల్లో మదుపర్ల కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం 52,600 పాయింట్ల వద్ద మద్దతు తీసుకున్న మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో 54,600 పాయింట్ల ఎగువన ముగిస్తే.. 55600/56200 పాయింట్ల వరకు రాణించే అవకాశం ఉంది. మరోవైపు 53,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే ఇటీవలి కనిష్ఠాలను పరీక్షించొచ్చు. స్వల్పకాలంలో ఒడుదొడుకులు కొనసాగవచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలను దేశీయ సూచీలు అందిపుచ్చుకోవచ్చు. గురువారం మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. చైనా లాక్‌డౌన్‌ సడలింపు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, ద్రవ్యోల్బణ ఒత్తిడిలు, కేంద్ర బ్యాంకుల వైఖరికి సంబంధించిన పరిణామాలు కీలకం కానున్నాయి. నాలుగో త్రైమాసిక ఫలితాల సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ఈవారం దివీస్‌, బీఈఎల్‌, సెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఇండిగో, అపోలో, కోల్‌ ఇండియా, హిందాల్కో, ఎన్‌ఎమ్‌డీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోఎడ్జ్‌ వంటి కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. రుతుపవనాల పురోగతిపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్‌ గత సమావేశ నిర్ణయాలపై కన్నేయొచ్చు. జర్మనీ బిజినెస్‌ క్లైమేట్‌ ఇండెక్‌, యూరోగ్రూప్‌ సమావేశం, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ తయారీ, సేవల పీఎంఐ, అమెరికా వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు గణాంకాలు వెలువడనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, ముడిచమురు ధరలు నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ముడిచమురు ధరలు పెరిగితే మార్కెట్‌ లాభాలకు అడ్డుకట్ట పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 53,804, 53,403, 52,669
తక్షణ నిరోధ స్థాయులు: 54,786, 55,613, 56,200
సెన్సెక్స్‌ 54,600 ఎగువన ముగిస్తే ప్రస్తుత రికవరీ కొనసాగొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని