Published : 23 May 2022 02:24 IST

ఆ నిర్ణయం పెట్టుబడిదార్లకు ప్రతికూలమే

 ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి సుంకం పెంపుపై ఐఎస్‌ఏ

దిల్లీ: ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలు పెంచడం పెట్టుబడిదార్లకు ప్రతికూల సంకేతాలు పంపుతుందని, దీంతో పీఎల్‌ఐ పథకం కింద సామర్థ్య విస్తరణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉక్కు పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఉక్కు తయారీ సంస్థల పరిశ్రమ సమాఖ్య ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ) వెల్లడించింది. ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్‌ కోల్‌, ఫెర్రోనికెల్‌, పీసీఐ కోల్‌, కోక్‌, సెమీ కోక్‌ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు, వీటి ఎగుమతిపై సుంకాన్ని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. మరికొన్ని స్టీల్‌ ఇంటర్‌మీడియరీస్‌పై 15 శాతం పెంచారు.

* ఎగుమతి సుంకం పెంచడంతో అంతర్జాతీయ విపణిలో భారత వాటా తగ్గి ఇతర దేశాల వాటా పెరుగుతుందని ఐఎస్‌ఏ తెలిపింది. ఒకవేళ ఇది జరిగితే దాన్ని మళ్లీ పునర్నిర్మించడానికి చాలా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా చైన్‌కు అంతరాయం కలిగితే నమ్మకమైన ఎగుమతిదారుగా ఉన్న భారత్‌కు మంచిది కాదని పేర్కొంది.

  3 నెలలు సమయం కోరిన ఫిక్కీ

ఆర్డర్లు పూర్తి చేసుకోవడానికి దేశీయ ఉక్కు పరిశ్రమకు 3 నెలల సమయం ఇవ్వాలని పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫిక్కీ స్టీల్‌ కమిటీ కో-చెయిర్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీఆర్‌ శర్మ మాట్లాడుతూ 2 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఆర్డర్లు ఉన్నాయని, విక్రయ ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. సుంకం పెంచడంతో.. చేసుకున్న ఒప్పందం ప్రకారం, వారికి అందిస్తామన్న ధరకు సరఫరా చేయడం సంస్థలకు కష్టమవుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్డర్లు పూర్తి చేసేందుకు 3 నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.


స్పెషాల్టీ స్టీల్‌ పీఎల్‌ఐ పథకానికి 10 దరఖాస్తులు
మరోసారి గడువు పొడిగింపు!

దిల్లీ: ప్రభుత్వం స్పెషాల్టీ స్టీల్‌ ఉత్పత్తి పెంపు కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇప్పటికే దరఖాస్తుల గడువును రెండు సార్లు పెంచిన ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం కనిపిస్తోందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పథకం కింద దరఖాస్తులు సమర్పించేందుకు తొలిసారి మార్చి 29ని గడువు తేదీగా నిర్ణయించగా, దాన్ని ఏప్రిల్‌ 30, మే 31 వరకు రెండు సార్లు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖ పీఎల్‌ఐ పథకాన్ని మార్చి తీసుకొచ్చిన తర్వాత గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంంటుందన్నారు. కొంతమంది ఉక్కు ఉత్పత్తిదార్లు స్పెషాల్టీ స్టీల్‌ పీఎల్‌ఐ పథకానికి మార్పులు కోరగా, ప్రభుత్వం కొన్ని మార్పులు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. గత ఏడాది జులై 22న రూ.6,322 కోట్ల పీఎల్‌ఐ పథకానికి  కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని