Published : 24 May 2022 02:55 IST

ఈవీ వ్యాపారంపై 100 కోట్ల డాలర్ల పెట్టుబడి

అమరరాజా బ్యాటరీస్‌ సన్నాహాలు
బ్యాటరీల పేలుడు సమస్యను పరిష్కరించొచ్చు
లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల ఉత్పత్తి పెంచుతాం
సీఎండీ జయదేవ్‌ గల్లా  

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా బ్యాటరీస్‌ వచ్చే కొన్నేళ్లలో విద్యుత్తు వాహనాల బ్యాటరీల ఉత్పత్తి కార్యకలాపాలపై 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,700 కోట్లు) పెట్టుబడిగా పెట్టనుంది. విద్యుత్తు వాహన బ్యాటరీలను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి వీలుగా 6 నెలల్లో పైలెట్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అమరరాజా బ్యాటరీస్‌ ఛైర్మన్‌ జయదేవ్‌ గల్లా దావోస్‌లో వెల్లడించారు. అనువైన డిజైన్లు ఆవిష్కరించాక వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలకు సంబంధించి ఇప్పటికే ఐరోపాలో ఒక అంకుర సంస్థను ఎంపిక చేసి, అందులో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.

మనదేశంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని, ఇప్పటికే ద్విచక్ర- త్రిచక్ర వాహనాల విభాగంలో ఒక స్థాయిని అందుకున్నట్లు ఆయన తెలిపారు. కార్లు, బస్సుల విభాగాల్లో ఇబ్బందులను పరిశ్రమ త్వరలో అధిగమిస్తుందని అన్నారు. టాటా నెక్సాన్‌- ఈవీ దేశీయంగా విశేష ఆదరణ సొంతం చేసుకోవడాన్ని ఆయన ఉదహరించారు. ప్రస్తుతం పెట్రోలు- డీజిల్‌ కారు కంటే విద్యుత్తు కారు ఖరీదు ఎక్కువగా ఉండటం ప్రధాన అవరోధమని పేర్కొన్నారు. కొన్ని ద్విచక్ర వాహనాల బ్యాటరీలు మండిపోవడంపై స్పందిస్తూ, ఇది పరిష్కరించలేని సమస్య కాదన్నారు. బ్యాటరీలు ఉత్పత్తి చేసే సంస్థలు, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, బ్యాటరీ ఛార్జింగ్‌ సిస్టమ్స్‌ సంస్థల ప్రతినిధులు కూర్చొని సమస్యను విశ్లేషిస్తే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఇతర దేశాల్లో విద్యుత్తు వాహనాలు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనా, తర్వాత  పరిష్కారం అయినట్లు వివరించారు.

విదేశాలకు లెడ్‌యాసిడ్‌ బ్యాటరీలు: లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల నుంచి తాము దృష్టి మళ్లించడం లేదని, ఈ విభాగంలో ఇంకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విదేశాలకు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలు సరఫరా చేయాలనుకుంటున్నామని అన్నారు. ఇటీవల దేశీయంగా విద్యుత్తు కోతలు విధిస్తున్నందున, మళ్లీ ఇన్వర్టర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు. కొన్ని నిబంధనలు అనుకూలంగా లేనందునే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ పథకం కింద తాము దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. తమ భవిష్యత్తు వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా, సత్వర వృద్ధికి వీలుకల్పించే ఇతర కంపెనీలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని