Published : 24 May 2022 02:55 IST

యోనో యాప్‌ ద్వారా వ్యక్తిగత రుణాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ఉద్యోగులకు కోరిన వెంటనే వ్యక్తిగత రుణాలను అందించనుంది. యోనో యాప్‌ ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ పేరుతో తక్షణమే ఈ రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఎలాంటి కాగితాలూ అవసరం లేకుండా దాదాపు రూ.35 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉందని పేర్కొంది.


అమ్మకానికి విశాఖపట్నం  గేట్‌వే హోటల్‌ !

దిల్లీ: అప్రధాన ఆస్తులను విక్రయించనున్నట్లు ది ఇండియన్‌ హోటల్స్‌ వెల్లడించింది. విశాఖపట్నం బీచ్‌ రోడ్‌లోని గేట్‌వే హోటల్‌, గురుగ్రామ్‌లో భూమి, ఇతర ఆస్తులను విక్రయించాలని భావిస్తున్నట్లు సీఈఓ పునీత్‌ చట్వాల్‌ పేర్కొన్నారు. 300 హోటళ్లతో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం, ఆహ్వాన్‌ 2020లో భాగంగా క్యూమిన్‌, 7రివర్స్‌, అమా స్టేస్‌ అండ్‌ ట్రయల్స్‌ సహా కొత్త వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టామని తెలిపారు.


ఈవీ బ్యాటరీల తయారీలోకి మిక్‌ ఎలక్ట్రానిక్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మిక్‌ (ఎంఐసీ) ఎలక్ట్రానిక్స్‌ విద్యుత్తు వాహనాల (ఈవీ) బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. బ్యాటరీస్‌ డివిజన్‌ ద్వారా లిథియమ్‌ ఆయాన్‌ సహా అన్ని రకాల విద్యుత్తు వాహన బ్యాటరీలు తయారు చేస్తామంది. దీంతో పాటు ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డుల వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వివరించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.45-60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ పేర్కొంది. మల్టీ-బ్రాండ్‌ విద్యుత్తు వాహనాల (ఈవీ) డీలర్‌షిప్‌ వ్యాపారంలో ఉన్న ఒక కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు సంస్థ ఎండీ కౌశిక్‌ యలమంచిలి తెలిపారు. కొంతకాలం క్రితం ఖాయిలా పడిన మిక్‌ ఎలక్ట్రానిక్స్‌ను కొత్త యాజమాన్యం చేపట్టి గత ఏడాది జూన్‌ నుంచి వ్యాపార కార్యకలాపాలు పునరుద్ధరించింది. ఓఎన్‌జీసీ నుంచి లభించిన 5,000 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్ల సరఫరా కాంట్రాక్టును విజయవంతంగా పూర్తిచేసినట్లు కౌశిక్‌ తెలిపారు.


ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ను స్వాధీనం చేసుకున్న యాక్టిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీవశాస్త్ర పరిశోధన సంస్థలకు అవసరమైన స్థిరాస్తి సేవలను అందించే హైదరాబాదీ సంస్థ ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ యాక్టిస్‌ స్వాధీనం చేసుకుంది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని కంపెనీల ప్రాజెక్టులకు డిజైనింగ్‌, అభివృద్ధి సేవలను అందిస్తూ, హైదరాబాద్‌, బెంగళూరుల్లో పలు ప్రాజెక్టులను ఆర్‌ఎక్స్‌ చేపట్టింది. దాదాపు 30లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని అభివృద్ధి చేసింది. తొలి దశలో యాక్టిస్‌ దాదాపు రూ.1500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనుంది.  


నాట్కో ఫార్మాపై అమెరికా కంపెనీ దావా

దిల్లీ: అమెరికాకు చెందిన ఎఫ్‌ఎమ్‌సీ కార్పొరేషన్‌ తమపై దిల్లీ హైకోర్టులో ఒక పేటెంట్‌ దావా వేసినట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. ‘ప్రాసెస్‌ పేటెంట్‌ ఐఎన్‌ 298645 కు సంబంధించి ఎఫ్‌ఎమ్‌సీ కార్పొరేషన్‌  దావా వేసింద’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో నాట్కో తెలిపింది. పేటెంట్‌ ఐఎన్‌ 298645 అనేది క్లోరాంట్రానిలిప్రోల్‌ అనే ఇన్‌సెక్టిసైడ్‌ను సిద్ధం చేసే ప్రక్రియ. దీనికి 2025 డిసెంబరు 6న గడువు తీరనుంది. ‘ఐఎన్‌ 298645కు ఉల్లంఘన కాని రీతిలో సీటీపీఆర్‌ ప్రక్రియ ఉందని కోర్టుకు దాఖలు చేశాం. సీటీపీఆర్‌ ప్రోడక్ట్‌ పేటెంట్‌ గడువు తీరే 2022 ఆగస్టు 12 తర్వాతే సీటీపీఆర్‌ ప్రోడక్ట్‌ను ఆవిష్కరించనున్న’ట్లు నాట్కో ఫార్మా తెలిపింది. ఈ దావాపై తదుపరి విచారణ 2022 జులై 18న జరగనుందని వివరించింది.


చిప్‌ల తయారీ విస్తరణకు ఇబ్బందులు

* ఇంటెల్‌ సీఈఓ పాట్‌ గెల్సింగర్‌

దావోస్‌: సెమీ కండక్టర్లను తయారు చేయడానికి అవసరమైన అధునాతన పరికరాల కొరత వల్ల, చిప్‌ తయారీని మరింత విస్తరించే ప్రణాళికలను అవరోధం ఏర్పడుతోందని చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ సీఈఓ పాట్‌ గెల్సింగర్‌ వెల్లడించారు. ‘ఫ్యాబ్స్‌’ అని పిలుచుకునే కొత్త చిప్‌ ఫ్యాక్టరీలను అమెరికా, ఐరోపాల్లో నిర్మించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు దావోస్‌లో తెలిపారు. గత ఏడాది సెమీ కండక్టర్ల కొరతతో వాహన రంగం నుంచి వంటగతి ఉపకరణాల పరిశ్రమల వరకు అన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. ఐరోపాలో కొత్త చిప్‌ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఇంటెల్‌ ప్రకటించింది. జర్మనీలో కొత్త ఫ్యాబ్‌ మెగా సైట్‌ నిర్మాణంతో పాటు ఐర్లాండ్‌లో విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అమెరికాలో ఓహియోలో ప్లాంట్‌ నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్ల ప్రణాళికను గత జనవరిలో ప్రకటించింది. జాతీయ సెమీ కండక్టర్‌ తయారీని ప్రోత్సహించి, వేగవంతం చేసేందుకు వీలుగా వారి సొంత ‘చిప్స్‌ యాక్ట్‌’ను అమెరికా, ఐరోపా దేశాలు ప్రారంభించాలని ఆయా దేశాల అధికారులను పాట్‌ అభ్యర్థించారు.


రాబోయే 2-3 ఏళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి: టీమ్‌లీజ్‌

దిల్లీ: మానవ వనరుల కంపెనీ టీమ్‌లీజ్‌ రాబోయే 2-3 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. వ్యాపారాన్ని పెంచుకునేందుకు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు, సేవల విస్తరణకు ఈ నిధులు ఉపయోగించనుంది. ప్రస్తుతం స్టాఫింగ్‌, స్పెషలైజ్‌డ్‌/ ఐటీ స్టాఫింగ్‌, హెచ్‌ఆర్‌ సొల్యూషన్లు, కాంప్లియెన్స్‌ పేరోల్‌ అవుట్‌సోర్సింగ్‌, అప్రెంటిస్‌షిప్‌, కార్పొరేట్‌ ట్రైనింగ్‌, డిగ్రీ అప్రెంటెస్‌షిప్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ లాంటి సేవలను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. అర్హులైన వారికి సరైన ఉద్యోగావకాశాలను కల్పించడంపై దృష్టి పెట్టడంతో పాటు ఉద్యోగకల్పన లేదా నైపుణ్యలేమిపై నెలకొన్న పలు ఆందోళనలు తొలగించామని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ రెడ్డి తెలిపారు.


క్యూ4లో వృద్ధి 3.5 శాతమే!

* ఇక్రా రేటింగ్స్‌ అంచనా
ముంబయి: 2021-22 నాలుగో త్రైమాసికం(క్యూ4)లో ఆర్థిక వృద్ధి 3.5 శాతానికి పరిమితం కావొచ్చని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేస్తోంది. డిసెంబరు త్రైమాసికంలో నమోదైన 5.4 శాతంతో వృద్ధిరేటుతో పోలిస్తే ఇది తక్కువే. అధిక కమొడిటీ ధరలు, తగ్గిన గోధుమ దిగుబడి ఇందుకు కారణంగా నిలవవచ్చని తాజా నివేదికలో పేర్కొంది. మూడో దశ కరోనా వల్ల భౌతికంగా అందించాల్సిన సేవల్లో రికవరీకి ఇబ్బందులు తలెత్తాయి. ఇది కూడా నాలుగో త్రైమాసిక వృద్ధిపై ప్రభావం చూపిందని వివరించింది. స్థూల విలువ జోడింపు(జీవీఏ) కూడా మూడో త్రైమాసికం నాటి 4.7 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. ఈనెల 31న జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది.  


పి-నోట్‌ పెట్టుబడులు రూ.90,580 కోట్లకు పెరిగాయ్‌

దిల్లీ: ఏప్రిల్‌ చివరి నాటికి పార్టిసిపేటరీ నోట్‌ల (పి- నోట్‌లు) ద్వారా భారత కేపిటల్‌ మార్కెట్లలోకి పెట్టుబడులు స్వల్పంగా పెరిగి రూ.90,580 కోట్లకు చేరాయి. చైనాలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో విదేశీ మదుపర్లు అక్కడి నుంచి పెట్టుబడులను భారత్‌కు బదిలీ చేస్తుండటమే ఇందుకు కారణం.  మార్చి చివరి నాటికి ఈ విలువ రూ.87,979 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి చివరినాటికి పి-నోట్‌ల పెట్టుబడుల విలువ రూ.87,989 కోట్లు కాగా.. ఫిబ్రవరి చివరినాటికి రూ.89,143 కోట్లు. ఏప్రిల్‌ చివరి వరకు నమోదైన మొత్తం పి-నోట్‌ల పెట్టుబడుల్లో.. ఈక్విటీల్లో పెట్టినవి రూ.81,571 కోట్లు కాగా, డెట్‌లో రూ.8,889 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీస్‌లో రూ.120 కోట్లుగా ఉన్నాయి. విదేశాల్లోని మదుపర్లలో ఎవరైతే నేరుగా నమోదు కాకుండానే భారత స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారో వారికి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) పి-నోట్‌లను జారీ చేస్తుంటారు.


వీఎమ్‌వేర్‌ కొనుగోలుకు చిప్‌ సంస్థ బ్రాడ్‌కామ్‌ యత్నాలు

* విలువ రూ.3 లక్షల కోట్లపైమాటే
అమెరికాకు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ వీఎమ్‌వేర్‌ ఇంక్‌.ను కొనుగోలు చేసేందుకు ఆ దేశానికి చెందిన చిప్‌ తయారీ సంస్థ బ్రాడ్‌క్యామ్‌ ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే ఒక చిప్‌తయారీ కంపెనీ, అత్యంత ప్రత్యేకత గల సాఫ్ట్‌వేర్‌ విభాగంలోకి అడుగుపెట్టినట్లు అవుతుంది. వీఎమ్‌వేర్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ 40 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3 లక్షల కోట్లు)గా ఉంది. ఒప్పంద విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చిప్‌ కంపెనీయే అయినప్పటికీ.. పలు రంగాల్లోకి బ్రాడ్‌కామ్‌ను ఆ సంస్థ సీఈఓ హాక్‌టాన్‌ నడిపించారు. 2018లో సీఏ టెక్నాలజీస్‌ను; 2019లో సిమాంటెక్‌ కార్ప్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వీఎమ్‌వేర్‌ విషయానికొస్తే.. ఇది 1998లో ఏర్పడింది. ఇప్పటికే పలు మార్లు చేతులు మారింది. వర్చువలైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను కనిపెట్టిన ఈ కంపెనీ.. క్లౌడ్‌ విభాగంలో మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది వీఎమ్‌వేర్‌కు భారత్‌లో 7,000 మందికి పైగా ఉద్యోగులున్నారు.


టీడీఎస్‌ బకాయిలు చెల్లించలేదని దివాలా ప్రక్రియ ప్రారంభించొద్దు: ఎన్‌సీఎల్‌ఏటీ

దిల్లీ: టీడీఎస్‌ బకాయిలు చెల్లించలేదన్న కారణం చూపి ఏ కంపెనీపైనా దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి వీల్లేదంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) వెల్లడించింది. ఎన్‌సీఎల్‌టీ కోల్‌కతా బెంచ్‌ ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తుది తీర్పు వెల్లడించింది. టీడీఎస్‌ బకాయిలు రికవరీ చేసేందుకు కంపెనీకి చెందిన ఆపరేషనల్‌ రుణదాతలు దివాలా స్మృతిని (ఐబీసీ) వినియోగించుకోవడానికి వీల్లేదని తెలిపింది. టీడీఎస్‌ బకాయిలు చెల్లించకపోతే ఆదాయపు పన్ను చట్టం 1961 కింద పన్ను అధికారులు తగిన చర్యలు తీసుకునేందుకు అధికారాలు పుష్కలంగా ఉంటాయని ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ వివరించింది. టీడీఎస్‌ బకాయిలు చెల్లించని కారణంగా కంపెనీని డిఫాల్ట్‌గా వ్యవహరించి ఐబీసీ కింద దివాలా ప్రక్రియకు ఆమోదించాలని ఆపరేషనల్‌ రుణదాత దాఖలు చేసిన దరఖాస్తును కోల్‌కతా ఎన్‌సీఎల్‌టీ ఆమోదించడం తీవ్ర లోపాన్ని సూచిస్తోందని ఎన్‌సీఎల్‌ఏటీ పేర్కొంది. టీమ్‌ టారస్‌ రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ రూ.66,884, రూ.1,10,820 విలువైన రెండు టీడీఎస్‌ మొత్తాల్ని చెల్లించని కారణంగా ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియకు ఆదేశించింది. దీన్ని తప్పుబట్టిన ఎన్‌సీఎల్‌ఏటీ, ఐబీసీ ప్రక్రియను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించినందుకు, ఆపరేషనల్‌ రుణదాతకు రూ.లక్ష జరిమానాను విధించి సదరు కంపెనీకి నెల రోజుల్లో చెల్లించమని ఆదేశించింది.


జొమాటో నష్టం రూ.360 కోట్లు

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో జొమాటో ఏకీకృత ప్రాతిపదికన రూ.359.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో నమోదైన రూ.134.20 కోట్లతో పోలిస్తే నష్టం భారీగా పెరిగింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.692.40 కోట్ల నుంచి గణనీయంగా పెరిగి రూ.1,211.80 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.885 కోట్ల నుంచి రూ.1,701.70 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) జొమాటో ఏకీకృత నష్టం రూ.1222.50 కోట్లుగా ఉంది. 2020-21లో నమోదైన రూ.816.40 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,993.80 కోట్ల నుంచి రెట్టింపునకు మించి రూ.4,192.40 కోట్లకు చేరింది. నష్టాలను తగ్గించుకుంటూ.. వృద్ధిని వేగవంతం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపేందర్‌ గోయల్‌ తెలిపారు. బ్లింకిట్‌ (ఇంతకుమునుపు గ్రోఫర్స్‌)ను కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ సంస్థకు స్వల్పకాలిక మూలధన అవసరాల కోసం స్వల్పకాలిక రుణం కింద 15 కోట్ల ఇవ్వాలని మేం అనుకుంటున్నాం. అంతకుమించి ప్రస్తుతం ఎలాంటి వివరాలను వెల్లడించలేమ’ని తెలిపారు. గత ఆరు నెలల్లో బ్లింకిట్‌ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తోందని, నష్టాలనూ గణనీయంగా తగ్గించుకుందని పేర్కొన్నారు.


పెట్రోలుపై రూ.13 నష్టం వస్తోంది

* డీజిల్‌పై రూ.24 కోల్పోతున్నాం
* ప్రభుత్వానికి రిలయన్స్‌-బీపీ లేఖ!

దిల్లీ: దేశీయంగా ప్రైవేటు రంగంలో ఇంధన రిటైలింగ్‌ పరిస్థితి అస్థిరంగా మారిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీల సంయుక్త సంస్థ ఆర్‌బీఎమ్‌ఎల్‌ ప్రభుత్వానికి తెలిపింది. మార్కెట్‌ను శాసించే ప్రభుత్వ రంగ సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ ధరల్లో మార్పులు చేయకుండా ఉండడం; వ్యయం కంటే తక్కువకు రేట్లు నిర్ణయించడమే ఇందుకు కారణమని  పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముడి చమురు ధరలు పెరిగినా.. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 137 రోజుల పాటు పెట్రో ధరల్లో ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు మార్పులు చేయలేదు. ఇటీవల 47 రోజుల పాటు అలానే చేశాయి. ఇందువల్ల ప్రతి నెలా రూ.700 కోట్ల నష్టాలు ఏర్పడుతున్నందున, వీటిని తగ్గించుకునేందుకు తన రిటైల్‌ కార్యకలాపాలను ఆర్‌బీఎమ్‌ఎల్‌ తగ్గిస్తూ వస్తోంది. నష్టాలు తగ్గించుకునేందుకు రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ మద్దతు ఉన్న నయారా ఎనర్జీ ప్రభుత్వ రంగ సంస్థల రేట్ల కంటే లీటరుకు రూ.3 మేర పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచింది. గత వారాంతంలో లీటరు పెట్రోలుపై రూ.8; డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలపై మరింత ఒత్తిడి పడనుంది. ఈనెల 16 నాటికి పెట్రోలుపై రూ.13.08; డీజిల్‌పై రూ.24.09 మేర నికరంగా పరిశ్రమ నష్టపోతోందని ప్రైవేటు సంస్థలు తెలిపాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని