అపార అవకాశాల పీఎల్‌ఐ

ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాఫ్ట్‌బ్యాంక్‌ మసయోషి సన్‌, సుజుకీ మోటార్‌ కార్ప్‌ ఒసాము సుజుకీ సహా పలువురు అగ్రగామి జపాన్‌ పారిశ్రామికవేత్తలతో సోమవారం మోదీ

Published : 24 May 2022 02:54 IST

సద్వినియోగం చేసుకోండి

జపాన్‌ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ

టోక్యో: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాఫ్ట్‌బ్యాంక్‌ మసయోషి సన్‌, సుజుకీ మోటార్‌ కార్ప్‌ ఒసాము సుజుకీ సహా పలువురు అగ్రగామి జపాన్‌ పారిశ్రామికవేత్తలతో సోమవారం మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో జౌళి నుంచి వాహన రంగాలు, వర్థమాన టెక్నాలజీలు, అంకుర సంస్థల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. క్వాడ్‌ నేతల సదస్సులో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన కోసం మోదీ టోక్యో వచ్చారు. ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నొబుషిరో ఎండో, జపాన్‌ దుస్తుల బ్రాండ్‌ యునిక్లో సీఈఓ తడాషి యనాయ్‌లతో ప్రధాని భేటీ అయ్యారు. భారత టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఎన్‌ఈసీ పాత్రను మోదీ కొనియాడారు. చెన్నై-అండమాన్‌, కోచి- లక్షద్వీప్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడాన్ని వివరించి, పారిశ్రామిక అభివృద్ధి, పన్నులు- కార్మిక రంగాల్లో సంస్కరణలను ప్రస్తావించారు. భారత రిటైల్‌ పరిశ్రమ, ఉత్పత్తిల్లో పెట్టుబడులకు చూస్తున్నట్లు యునిక్లో అధిపతి యనాయ్‌ తెలిపారు. భారత అంకుర రంగంలో సాఫ్ట్‌బ్యాంక్‌ కార్పొరేషన్‌ పాత్రను మోదీ ప్రశంసించారు. టెక్నాలజీ, ఇంధన, ఫైనాన్స్‌ వంటి కీలక రంగాల్లో సాఫ్ట్‌బ్యాంక్‌ భాగస్వామ్యం చేపట్టాలని కోరారు.

* భారత వృద్ధి ప్రయాణంలో జపాన్‌ సహకారాన్ని గుర్తుచేసేందుకు ‘జపాన్‌ వీక్‌’ పేరిట వేడుకలు నిర్వహించాల్సిందిగా మోదీ ప్రతిపాదించారు. మోదీతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో 34 జపాన్‌ కంపెనీల సీఈఓ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. భారత్‌లో ఈ కంపెనీలకు పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని