Published : 25 May 2022 04:08 IST

హైదరాబాద్‌కు హిల్టన్‌

ముంబయి: అంతర్జాతీయ ఆతిథ్య సంస్థ హిల్టన్‌, హైదరాబాద్‌లో రిసార్ట్‌ - స్పా ప్రారంభించేందుకు సీకేఆర్‌ రిసార్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ రిసార్ట్‌లో 115 గదులు, 13 విల్లాలుంటాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో శామీర్‌పేట్‌ జీనోమ్‌ వ్యాలీకి దగ్గర్లో ఇది ఉందని తెలిపింది. ‘మా బ్రాండ్‌లను దేశ వ్యాప్తంగా విస్తరించడానికి వ్యూహాత్మక అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తున్నాం. ఈ ఒప్పందం దక్షిణ భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేస్తుంది. హైదరాబాద్‌లో మా అతిథులకు ప్రపంచ స్థాయి హిల్టన్‌ ఆతిథ్యాన్ని అందించనున్నందుకు ఆనందంగా ఉంద’ని హిల్టన్‌ కంట్రీ హెడ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవ్‌జిత్‌ అహ్లువాలియా వెల్లడించారు. హిల్టన్‌ దేశీయంగా 24 హోటళ్లను నిర్వహిస్తోంది. ఇందులో 7 హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఆస్తులే.


మంచినీటి సంక్షోభం అదుపునకు  ‘ఔత్సాహికు’లకు నిధులు
అప్‌లింక్‌తో హెచ్‌సీఎల్‌ భాగస్వామ్యం

దావోస్‌: 2030 కల్లా మంచి నీటి సరఫరా కంటే గిరాకీ 40 శాతం మేర పెరగవచ్చన్న అంచనాలున్న నేపథ్యంలో, మంచినీటి సంక్షోభాన్ని పరిష్కరించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 15 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.116 కోట్లు) నిధులు ఇవ్వడానికి దావోస్‌లో ఒక భాగస్వామ్యం కుదిరింది. మంచినీటి సంరక్షణ, నిర్వహణ నిమిత్తం ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌)కు చెందిన ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫాం అయిన ‘అప్‌లింక్‌’తో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ అంశంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే అంకురాలకు అప్‌లింక్‌ నిధులను సమకూరుస్తుంటుంది. అప్‌లింక్‌ ద్వారా ప్రపంచ మంచినీటి రంగంలో ఒక వినూత్న వ్యవస్థను సృష్టించేందుకు వచ్చే అయిదేళ్లలో హెచ్‌సీఎల్‌ 15 మి.డాలర్ల(రూ.116 కోట్లు) పెట్టుబడులు పెడుతుంది.  


విస్తరణ దిశగా ఇండియన్‌ టెరైన్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ పరిణామాల అనంతరం పురుషుల దుస్తుల విక్రయాల్లో దాదాపు 10-12 శాతం వృద్ధి కనిపిస్తోందని ఇండియన్‌ టెరైన్‌ ఫ్యాషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చరత్‌ నరసింహన్‌ అన్నారు. అదే సమయంలో తమ సంస్థ 20 శాతం మేరకు వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తమ వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 15 శాతం మేరకు ఉందని, ఇక్కడ మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి 28 స్టోర్లు ఉండగా, రెండేళ్లలో ఈ సంఖ్య 50కి చేరుతుందని వెల్లడించారు. వినియోగదారులు రిటైల్‌ దుకాణాలకు నేరుగా వచ్చి, కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి అభిరుచికి తగ్గట్టుగా విక్రయ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.


తెలుగులో రానున్న రిసోర్సియో

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ అంశాలపై ఆడియో, పీపీటీ, పీడీఎఫ్‌ సహాయంతో విషయ పరిజ్ఞానాన్ని అందించే ఎడ్యుటెక్‌ సంస్థ రిసోర్సియో తెలుగు భాషలోనూ సమాచారాన్ని అందించనుంది. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ పెట్టుబడులు సమకూర్చిన ఈ వెబ్‌సైట్‌కు 25లక్షల మందికి పైగా వీక్షకులు ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 18 శాతం ఉన్నారు. ఆంగ్లం, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఇది కంటెంట్‌ను అందిస్తుంది. మూడు వేల మందికి పైగా కంటెంట్‌ క్రియేటర్లున్నారని సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ గీతికా సుదీప్‌ వివరించారు. ప్రధానంగా 18-35 ఏళ్ల వయసు వారిని దృష్టిలో పెట్టుకుని, పలు విషయాల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


28% తగ్గిన  సెయిల్‌ లాభం
ఒక్కో షేరుకు రూ.2.25 డివిడెండ్‌

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో సెయిల్‌ రూ.2,478.82 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.3,469.88 కోట్లతో పోలిస్తే ఇది 28 శాతం తక్కువ. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.23,533.19 కోట్ల నుంచి రూ.31,175.25 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.18,829.26 కోట్ల నుంచి రూ.28,005.28 కోట్లకు చేరాయి. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2.25 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


ట్రయంఫ్‌ టైగర్‌ 1200 అడ్వెంచర్‌ బైక్‌
ప్రారంభ ధర రూ.19.19 లక్షలు

ముంబయి: బ్రిటిష్‌ ప్రీమియం మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ సరికొత్త టైగర్‌ 1200 అడ్వెంచర్‌ బైక్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.19.19 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. టైగర్‌ 1200 అడ్వెంచర్‌ ప్రో వేరియంట్లు (జీటీ ప్రో, ర్యాలీ ప్రో), లాంగ్‌- రేంజ్‌ వేరియంట్ల (జీటీ ఎక్స్‌ప్లోరెర్‌, ర్యాలీ ఎక్స్‌ప్లోరెర్‌)లో లభించనుంది.


సెప్టెంబరు తర్వాత ఓయో ఐపీఓ

దిల్లీ: ఆతిథ్య, ప్రయాణ-టెక్‌ సంస్థ ఓయో సెప్టెంబరు తర్వాత తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) వచ్చేందుకు సిద్ధమవుతోంది. రూ.8,430 కోట్ల ఐపీఓకు అనుమతి కోరుతూ ఓయో సెబీ వద్ద గత ఏడాది అక్టోబరులో ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇప్పుడు నవీకరించిన ఏకీకృత ఆర్థిక సమాచారంతో మరోసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేసేందుకు అనుమతించాలని ఓయో అభ్యర్థించింది. తొలుత 1100 కోట్ల డాలర్ల (సుమారు రూ.85,000 కోట్ల) విలువతో లెక్కగట్టి పత్రాలు దాఖలు చేయగా, ఇప్పుడు దాన్ని 700-800 కోట్ల డాలర్లకు (సుమారు రూ.54,000-62,000 కోట్లు) తగ్గించి పత్రాలు దాఖలు చేయాలనుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.


అమెరికాలో 2,39,000 కార్లు వెనక్కి: హ్యుందాయ్‌

వాషింగ్టన్‌: సీటు బెల్టులో సమస్య కారణంగా అమెరికాలో 2,39,000 కార్లను హ్యుందాయ్‌ వెనక్కి (రీకాల్‌) రప్పిస్తోంది. సీటు బెల్టులో నెలకొన్న సమస్యతో ఇప్పటికే మూడు ప్రమాదాలు (రెండు అమెరికాలో, ఒకటి సింగపూర్‌లో) చోటుచేసుకున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలో కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు నియంత్రణ సంస్థలకు హ్యుందాయ్‌ తెలియజేసింది. కార్ల యాజమానులు రీకాల్‌ చేసిన కార్లను డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లి.. ఉచితంగా సీట్‌ బెల్టు సమస్యను పరిష్కరించుకోవచ్చని కంపెనీ తెలిపింది.  


ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల  ఫలితాలు ఆలస్యం

దిల్లీ: మార్చి త్రైమాసికంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఆమోదించేందుకు మే 30లోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం సాధ్యపడదని కిశోర్‌ బియానీ నేతృత్వంలోని నాలుగు ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థలు ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపాయి. ఆయా బోర్డుల్లో పదవులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం. రిలయన్స్‌ రిటైల్‌తో రూ.24,713 కోట్ల లావాదేవీ రద్దయిన తర్వాత ఫ్యూచర్‌ రిటైల్‌లో పలువురు కీలక పదవుల నుంచి వైదొలిగారు. కంపెనీ సీఎఫ్‌ఓ సీపీ తోష్నివాల్‌, కంపెనీ సెక్రటరీ వీరేంద్ర సమానీ రాజీనామా చేయగా, ఎండీ రాకేశ్‌ బియానీ తప్పుకున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని