హిందుస్థాన్‌ మోటార్స్‌ విద్యుత్తు వాహనాలు!

దేశంలోనే మొదటి (అంబాసిడర్‌) కార్ల తయారీ సంస్థ హిందుస్థాన్‌ మోటార్స్‌ (హెచ్‌ఎం) మళ్లీ విపణిలోకి పునరాగమనం చేయనుందని సమాచారం. ఈసారి విద్యుత్తు వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఐరోపాలోని విద్యుత్‌ వాహనాల తయారీ

Published : 25 May 2022 04:13 IST

ఐరోపా కంపెనీతో కలిసి జేవీకి సన్నాహాలు

దిల్లీ: దేశంలోనే మొదటి (అంబాసిడర్‌) కార్ల తయారీ సంస్థ హిందుస్థాన్‌ మోటార్స్‌ (హెచ్‌ఎం) మళ్లీ విపణిలోకి పునరాగమనం చేయనుందని సమాచారం. ఈసారి విద్యుత్తు వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఐరోపాలోని విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీతో కలిసి సంయుక్త సంస్థను 51:49 నిష్పత్తిలో ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. మెజారిటీ వాటా హెచ్‌ఎంకే ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అవగాహనా పూర్వక ఒప్పందాలు జరిగాయని హిందుస్థాన్‌ మోటార్స్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ తెలిపారు. ‘తొలుత బ్యాటరీపై నడిచే ద్విచక్ర వాహనాలు, ఆ తర్వాత నాలుగు చక్రాల వాహనాల తయారీపై దృష్టి పెడతామ’ని బోస్‌ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో హిందుస్థాన్‌ మోటార్స్‌కు చెందిన ఉత్తర్‌పరా ప్లాంటులో విద్యుత్తు వాహనాల తయారీ చేపట్టాలన్నది ప్రణాళిక. ఈ ప్లాంటు 2014 నుంచి ఖాళీగా ఉంది. ఒకప్పుడు మన రోడ్లపై దూసుకెళ్లిన అంబాసిడర్‌ కార్లు ఈ ప్లాంటులోనే తయారయ్యేవి.

1942లో సి.కె.బిర్లా తాత బి.ఎం.బిర్లా హిందుస్థాన్‌ మోటార్స్‌ను నెలకొల్పారు. కార్ల విపణిలో 1970లో ఈ సంస్థ 75 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉండేది. 1983లో మారుతీ 800 కార్లను మారుతీ సుజుకీ విడుదల చేశాక, అంబాసిడర్‌ మార్కెట్‌ వాటా తగ్గుతూ వచ్చింది. 1984- 1991 మధ్య ఈ కార్ల వాటా 20 శాతానికి పడిపోయింది. తదుపరి అంతర్జాతీయ వాహన కంపెనీలు దేశీయ విపణిలోకి అడుగుపెట్టడంతో అంబాసిడర్‌ మార్కెట్‌ వాటా పూర్తిగా క్షీణించడంతో, హెచ్‌ఎం సంస్థ కార్యకలాపాలు నిలిపేసింది. కొత్తగా ఏర్పాటయ్యే సంయుక్త సంస్థ ఉత్తర్‌పరా వద్ద ఉన్న 295 ఎకరాల స్థలాన్ని వినియోగించుకోనుంది. వాస్తవానికి ఉత్తర్‌పరా వద్ద హెచ్‌ఎంకు 700 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో 314 ఎకరాలను శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌కు 2007లో విక్రయించగా.. 100 ఎకరాలను హీరానందాని గ్రూపునకు అమ్మేందుకు గతేడాది హెచ్‌ఎం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హీరానందన్‌కు స్థలం విక్రయించడం ద్వారా వచ్చిన నిధులు, రుణాల చెల్లింపునకు సరిపోవడమే కాకుండా, విద్యుత్‌ వాహన, విడిభాగాల ప్రాజెక్టుకు నిధుల అవసరాలకు ఉపయోగ పడతాయని బోస్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని