అంతర్జాతీయ ప్రతికూలతలే పడేశాయ్‌

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. ఆర్థిక రికవరీ నెమ్మదిస్తుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్‌పై

Updated : 25 May 2022 08:04 IST

సమీక్ష

రుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. ఆర్థిక రికవరీ నెమ్మదిస్తుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 77.57 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు బలహీనంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 54,307.56 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఒడుదొడుకుల మధ్యే కొనసాగిన ట్రేడింగ్‌లో 54,524.37 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో 53,886.28 పాయింట్లకు పడిపోయింది. చివరకు 236 పాయింట్ల నష్టంతో 54,052.61 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89.55 పాయింట్లు కోల్పోయి 16,125.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,078.60- 16,262.80 పాయింట్ల మధ్య కదలాడింది.

డెలివరీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో శుభారంభం చేశాయి. ఇష్యూ ధర రూ.487తో పోలిస్తే బీఎస్‌ఈలో 1.23% లాభంతో రూ.493 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16.81% దూసుకెళ్లి రూ.568.90 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 10.31% లాభంతో రూ.537.25 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.38,923.93 కోట్లుగా నమోదైంది.

వీనస్‌ పైప్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ షేరు ఇష్యూ ధర రూ.326తో పోలిస్తే బీఎస్‌ఈలో 2.76% లాభంతో రూ.335 వద్ద ప్రారంభమైంది. చివరకు 7.89% పెరిగి రూ.351.75 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 డీలాపడ్డాయి. టెక్‌ మహీంద్రా 3.92%, హెచ్‌యూఎల్‌ 2.98%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.76%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.57%, ఎన్‌టీపీసీ 2.10%, ఇన్ఫోసిస్‌ 1.87%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.70%, టాటా స్టీల్‌ 1.70% మేర నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 1.80%, హెచ్‌డీఎఫ్‌సీ 1.63%, కోటక్‌ బ్యాంక్‌ 1.35%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.23%, నెస్లే 1.17%, పవర్‌గ్రిడ్‌ 1.09% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 1.75%, యుటిలిటీస్‌ 1.70%, టెక్‌ 1.64%, విద్యుత్‌ 1.64% పడ్డాయి. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ స్వల్పంగా రాణించాయి. బీఎస్‌ఈలో 2328 షేర్లు నష్టాల్లో ముగియగా, 992 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 110 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను ఈ నెల 30న ప్రకటించనుంది. డివిడెండ్‌ చెల్లింపు ప్రతిపాదననూ పరిశీలిస్తుందని భావిస్తున్నారు.

సింగపూర్‌ సార్వభౌమ సంపద నిధి జీఐసీ నుంచి రూ.2,195 కోట్లు సమీకరించనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ వెల్లడించింది.

ఎగుమతులపై ఆంక్షలతో చక్కెర కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. మగధ్‌ షుగర్‌ 9.05%, దాల్మియా షుగర్‌  7.99%, శ్రీరేణుకా 6.66%, పొన్ని షుగర్స్‌ 5.69%, బలరాంపూర్‌ చీనీ 5.68%, అవధ్‌ షుగర్‌ 5.63%, ద్వారికేశ్‌ షుగర్‌ 5.39%, ఆంధ్రా షుగర్స్‌ 5.05%, ధంపూర్‌ షుగర్‌ 4.99%, ఈఐడీ ప్యారీ 1.67% చొప్పున నష్టాలు చవిచూశాయి.

ఇముద్రా ఐపీఓ రెండో రోజున 2.72 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,13,64,784 షేర్లను ఆఫర్‌ చేయగా, 3,09,02,516 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూబీఐ విభాగంలో 4.05 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 2.61 రెట్లు, సంస్థాగతేర మదుపర్ల విభాగంలో 1.28 రెట్ల స్పందన నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని