Updated : 25 May 2022 07:50 IST

డేటా కేంద్రాలకు పెట్టుబడుల వరద

పోటీ పడుతున్న దేశ, విదేశీ సంస్థలు
హైదరాబాద్‌కు మరిన్ని కొత్త కేంద్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ కంప్యూటింగ్‌, ఐఓటీ.. త్వరలో ప్రారంభం కానున్న 5జీ సేవల  నేపథ్యంలో డేటా కేంద్రాలకు గిరాకీ పెరుగుతోంది. దీన్ని గమనించి పలు దేశీయ - విదేశీ సంస్థలు డేటా కేంద్రాల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోడానికి, పెట్టుబడులు పెడుతున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలోకి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని రేటింగ్‌ సేవల సంస్థ ‘ఇక్రా’  ఒక నివేదికలో పేర్కొంది. దిల్లీ ఎన్‌సీఆర్‌, పుణె, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇప్పటికే ఉన్న డేటా కేంద్రాల సంస్థలు తమ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని సంస్థలు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయని సమాచారం. హైదరాబాద్‌లో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌తో పాటు మరొక సంస్థ డేటా కేంద్రాలు స్థాపించనున్నాయి. స్థానిక కంపెనీ కంట్రోల్‌ ఎస్‌, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. అదానీ గ్రూపు, హీరనందాని గ్రూపు, విదేశీ సంస్థలైన ఎడ్జ్‌కోనెక్స్‌, కేపిటల్యాండ్‌ కూడా ఈ విభాగంలోకి విస్తరిస్తున్నాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం, ఉబెర్‌, డ్రాప్‌బాక్స్‌..తదితర సంస్థల నుంచి లభిస్తున్న డిమాండ్‌తో డేటా నిల్వ, ప్రాసెసింగ్‌ అవసరాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయని పరిశ్రమ వర్గాల విశ్లేషణ. దాదాపు 4,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని వివిధ సంస్థలు అందుబాటులోకి తీసుకువస్తాయని, అందుకు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అంచనా. డేటా కేంద్రాల సంస్థలు రెండేళ్ల పాటు ఏటా 19్థ వరకు వృద్ధి నమోదు చేస్తాయని అంచనా. డేటా వినియోగం పెరిగే కొద్దీ ఈ సంస్థలకు నిర్వహణ వ్యయాలు తగ్గి, అధిక లాభాలు ఆర్జించగలుగుతాయి. డేటా కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల హోదా కల్పించినందున, తక్కువ వడ్డీరేటుకు దీర్ఘకాలిక రుణాలు సమీకరించ గలుతుతాయి. ఈసీబీ (విదేశీ వాణిజ్య రుణాలు) మార్గంలో విదేశీ అప్పులు తీసుకోవచ్చు.


50 లక్షల చదరపు అడుగుల డేటా కేంద్రాల స్థాపన లక్ష్యం

- శ్రీధర్‌ పిన్నపురెడ్డి, సీఈఓ, కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌

‘ముంబయి, నోయిడా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోని కంట్రోల్‌ ఎస్‌ డేటా కేంద్రాలను వేగంగా విస్తరిస్తున్నాం. ఇప్పుడు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. కొన్నేళ్లలో 50 లక్షల చ.అ. విస్తీర్ణానికి విస్తరించాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టబోతున్నాం. డిజిటలీకరణ, స్మార్ట్‌ఫోన్లు-సామాజిక మాధ్యమాల వినియోగం అధికం కావడం, డిజిటల్‌ లావాదేవీల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో డేటా వినియోగం అంచనాలకు మించి పెరిగిపోతోంది. సమీప భవిష్యత్తులో మనదేశం డేటా కేంద్రాల అతిపెద్ద కేంద్రంగా మారుతుంది.’

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని