ఎన్‌సీఎల్‌టీ సభ్యుల పదవీ కాలంపై సీజేఐ కమిటీ పరిశీలన

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి చెందిన 23 మంది సభ్యుల పదవీ కాలానికి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలన

Published : 26 May 2022 05:42 IST

దిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి చెందిన 23 మంది సభ్యుల పదవీ కాలానికి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలన జరుపుతోందని సుప్రీం కోర్టుకు కేంద్రం బుధవారం తెలిపింది. ఏప్రిల్‌ 20న ఒక సమావేశం కూడా జరిగిందని, తదుపరి సమావేశం మరో 10 రోజుల్లో జరగొచ్చని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ బేలా ఎమ్‌ త్రివేదిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌కు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ విషయాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత్‌, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉన్న కమిటీ తదుపరి సమావేశం వారం లేదా 10 రోజుల్లో జరగవచ్చని ఆయన కోర్టుకు తెలిపారు. ఎన్‌సీఎల్‌టీ సభ్యుల బాధ్యతలు చాలా సునిశితమైనవన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, 23 మంది సభ్యుల పదవీ కాల పొడిగింపునకు సంబంధించి అన్ని విషయాలను కమిటీ పరిశీలించిందని అత్యున్నత న్యాయస్థానానికి మెహాతా తెలిపారు. ‘తదుపరి సమావేశాన్నీ దృష్టిలో పెట్టుకుని, ఈ అంశంపై జూన్‌ 15న విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ని పేర్కొన్నారు. జూన్‌ 20న ఎన్‌సీఎల్‌టీ సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు. ట్రైబ్యునల్‌ సభ్యుల పదవీ కాలంపై ఆందోళనలు లేవనెత్తుతూ వచ్చిన విజ్ఞప్తిపై సుప్రీం విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను 2022 జూన్‌ 15కు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఆలోగా ఏవైనా పరిణామాలు జరిగితే కోర్టుకు తెలపాలని సొలిసిటర్‌ జనరల్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని