రూ.27 లక్షల కోట్ల విక్రయాలు!

ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పెట్టుబడిదార్లు ప్రపంచవ్యాప్తంగా 350 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.27 లక్షల కోట్ల) విలువైన ఈక్విటీలను విక్రయించొచ్చని బార్‌క్లేస్‌

Published : 26 May 2022 03:14 IST

ఈక్విటీల్లో అంతర్జాతీయ ఎంఎఫ్‌లు చేపట్టొచ్చు: బార్‌క్లేస్‌ నివేదిక

ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పెట్టుబడిదార్లు ప్రపంచవ్యాప్తంగా 350 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.27 లక్షల కోట్ల) విలువైన ఈక్విటీలను విక్రయించొచ్చని బార్‌క్లేస్‌ అంచనా వేసింది. మాంద్యం భయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనిశ్చితి, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతుండటం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో, ఇప్పటికే ఈక్విటీల్లో అమ్మకాలకు మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నందున, కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు వడ్డీ రేట్లు పెంచాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన, కమొడిటీ ధరలు పరుగులు తీయడం, కంపెనీల ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడుదొడుకులు కూడా అనిశ్చితికి కారణమవుతున్నాయి.

* 2008-09లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఆ సమయంలో మ్యూచువల్‌ ఫండ్‌ల నిర్వహణలోని ఆస్తుల్లో (ఏయూఎం) సగటున 2.6 శాతం మేర ఈక్విటీ అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇది 0.3 శాతంగా ఉంది. అందువల్ల మరో 350 బిలియన్‌ డాలర్ల అమ్మకాలకు ఎంఎఫ్‌లు దిగొచ్చని అంచనా. మాంద్యం భయాలు సర్దుమణిగితే మాత్రం ఇది ఉండదు.

* ఈ ఏడాది ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్‌లు నికర విక్రేతలుగా నిలిచాయి. 2020 ఆగస్టు తర్వాత విక్రేతలుగా మారడం ఇదే మొదటిసారి. 2020 నుంచి చూస్తే 1.3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఈక్విటీల్లోకి వచ్చాయి.  
నీ అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడుగా వెళ్తే ఇప్పట్లో వినియోగదారు సెంటిమెంట్‌ మెరుగుపడే అవకాశం లేదని బార్‌క్లేస్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని