హిందుస్థాన్‌ జింక్‌లో ప్రభుత్వ వాటా విక్రయం!

హిందుస్థాన్‌ జింక్‌ (హెచ్‌జడ్‌ఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న 29.5 శాతం వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి 29.5

Published : 26 May 2022 03:14 IST

ఖజానాకు రూ.38,000 కోట్లు

దిల్లీ: హిందుస్థాన్‌ జింక్‌ (హెచ్‌జడ్‌ఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న 29.5 శాతం వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి 29.5 శాతం వాటాకు సమానమైన 124.96 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.38,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65000 కోట్లు సమీకరించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వానికి ఈ లావాదేవీ ఉపయోగపడనుంది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో, బుధవారం హిందుస్థాన్‌ జింక్‌ షేరు బీఎస్‌ఈలో 3.14 శాతం పెరిగి రూ. 305.05కు చేరింది.
2002 వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే హిందుస్థాన్‌ జింక్‌ ఉంది. 2002 ఏప్రిల్‌లో 26 శాతం వాటాను ప్రభుత్వం స్టెర్‌లైట్‌ ఆపర్చునిటీస్‌ అండ్‌ వెంచర్స్‌కు రూ.445 కోట్లకు విక్రయించింది. తదుపరి మార్కెట్‌ నుంచి 20 శాతం వాటాను, మరో 18.92 శాతం వాటాను ప్రభుత్వం నుంచి 2003 నవంబరులో వేదాంతా గ్రూప్‌ కొనుగోలు చేయడం ద్వారా తన మొత్తం వాటాను 64.92 శాతానికి పెంచుకుని, యాజమాన్య నియంత్రణాధికారం సాధించింది. హిందుస్థాన్‌ జింక్‌కు ప్రస్తుతం అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా లిమిటెడ్‌ ప్రమోటరుగా వ్యవహరిస్తోంది. హెచ్‌జడ్‌ఎల్‌లో మరో 5 శాతం వాటాను కొనుగోలు చేసే వీలుందని వేదాంతా ఇటీవల ప్రకటించింది కూడా.

భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ మూసివేత: భారత్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (బీజీఎంఎల్‌) మూసివేత ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ వెల్లడించింది. 2001 నుంచి బీజీఎంఎల్‌ కార్యకలాపాలు ఆపేసింది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఉన్న కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) బీజీఎంఎల్‌ చేతిలోనే ఉన్నాయి. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాలైన కేజీఎఫ్‌ చాప్టర్‌ 1, 2తో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని స్థలాల్లో ఎక్కువ భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సుమారు 250 ఎకరాలను కర్ణాటక ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని