Published : 26 May 2022 06:04 IST

ఉద్యోగమే కాదు.. ఉన్నత చదువూ చదివిస్తాం..

‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌’ కు పెరుగుతున్న ప్రాధాన్యం

ఐటీ, ఫార్మాస్యూటికల్‌ కంపెనీల కొత్త ధోరణి

పెద్దఎత్తున నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిపుణుల కొరతను అధిగమించేందుకు ఐటీ, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో పెద్దఎత్తున ఎంపికలు చేపట్టి, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ ఉత్తీర్ణులను నియమించుకుంటున్నా.. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల కొరత ప్రధాన సమస్యగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఏటా ఐటీ రంగ సంస్థలే 3 - 4 లక్షల మంది ఉన్నత విద్యావంతులను ప్రాంగణ, ప్రాంగణేతర పద్ధతుల్లో ఎంపిక చేసుకుంటున్నాయి. వీరిలో అధికులు చదువు పరంగా బాగున్నా, ఉద్యోగానికి కావాల్సిన విధంగా అప్పటికి సన్నద్ధం కావడం లేదు. దీనికి పరిష్కారంగా విద్యార్థులను ఇంటర్‌, డిగ్రీ చదువుతున్నప్పుడే ఎంపిక చేసుకుని, తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య, ఉద్యోగానుభవం కల్పించి సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు వివిధ రంగాల కంపెనీలు ‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ లను చేపడుతున్నాయి. ఈ ప్రక్రియలో ఐటీ కంపెనీలు క్రియాశీలకంగా ఉండగా, కొన్ని ఫార్మా కంపెనీలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి.

‘టెక్‌ బీ’ కార్యక్రమం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ‘టెక్‌ బీ’ పేరుతో తనకు తాను అంతర్గతంగా ‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ నిర్వహిస్తోంది. దీని కోసం కొన్ని యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌  కాలేజీలతో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంటర్‌ లేదా ప్లస్‌ 2 చదివిన విద్యార్థులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేస్తారు. వారికి ఒక ఏడాది పాటు ఐటీ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తారు. అదే సమయంలో వారిని తమకు ఒప్పందం ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీ/ యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థులుగా చేర్పిస్తారు. మూడు-నాలుగేళ్లు గడిచే సరికి చేతిలో డిగ్రీ పట్టాతో పాటు, అప్పటికే ఐటీ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం సంపాదిస్తున్నారు. ఇటువంటి అభ్యర్థుల నుంచి ఫలితాలూ మెరుగ్గా ఉంటున్నందున ‘టెక్‌ బీ’ కార్యక్రమానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎంతో ప్రాధాన్యమిస్తోంది. అయిదేళ్ల క్రితం ఈ విధానాన్ని ప్రారంభించిన సంస్థ, తన వార్షిక ఉద్యోగ నియామకాల్లో 9 శాతం మందిని ఈ కార్యక్రమం ద్వారానే నియమించుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ దాదాపు 40,000 మందికి ఉద్యోగావకాశం ఇచ్చింది. ఇందులో 23,000 మంది తాజా ఉత్తీర్ణులైతే.. అందులో 15 శాతం టెక్‌ బీ కార్యక్రమం కింద ఎంపికైన వారున్నారు. 

 విప్రో కూడా

మరొక అగ్రగామి ఐటీ సంస్థ విప్రో ఎంతోకాలంగా ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా చిన్న నగరాల నుంచి బీసీఏ, బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) విద్యార్థులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసుకుంటోంది. వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ఈ సంస్థ ఏటా నియామకాలు చేపడుతోంది. ఈ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థులను పేరున్న యూనివర్సిటీల్లో ఎంసీఏ, ఎంఎస్సీ కోర్సుల్లో చేర్చడంతో పాటు, ఐటీ ప్రాజెక్టులపై పని చేయిస్తూ నైపుణ్యాలను పెంపొందిస్తోంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇతర పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఈ కార్యక్రమం కోసం విప్రో ఎంపిక చేస్తోంది. ఇలా ఎంపికైన విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నట్లు, కెరీర్‌లో బాగా ఎదుగుతున్నట్లు చెబుతున్నారు.

ఫార్మా కంపెనీలు సైతం

ఇటీవల కాలంలో కొన్ని ఫార్మా కంపెనీలు సైతం ఇదే బాట పట్టాయి. బీఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి, వారిని తమ ఉత్పత్తి, పరిశోధనా కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తూ, మరోపక్క ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో చదివిస్తున్నాయి. ఉదాహరణకు బిట్స్‌- పిలానీ కేంపస్‌లోని ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, శశి ఫైటోకెమికల్‌ ఇండస్ట్రీస్‌... తదితర సంస్థలు ‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఎంఎస్సీ టెక్‌ (ఫార్మా కెమిస్ట్రీ), ఎంఎస్‌ (ఫార్మాస్యూటికల్‌ ఆపరేషన్స్‌), ఎంఫార్మ్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) తదితర కోర్సుల్లో చేరి పట్టాలు అందుకునే అవకాశం ఆయా సంస్థలు ఎంపిక చేసిన విద్యార్థులకు లభిస్తోంది. కొన్ని ప్రముఖ వైద్య సేవల సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమిస్తున్నాయి. శంకర్‌ నేత్రాలయ, బాంబే హాస్పిటల్స్‌, సీఎంసీ- వెల్లూరు, మరికొన్ని సంస్థలు బిట్స్‌- పిలానీ అందిస్తున్న ‘వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’లో భాగస్వామిగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని