ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ వేతనం రూ.80 కోట్లు

దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ నిలిచారు. ఆయన వార్షిక వేతనం ఏడాది క్రితం నాటి రూ.42.50 కోట్ల నుంచి 88 శాతం పెరిగి రూ.79.75 కోట్లకు చేరింది. కంపెనీ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

Updated : 27 May 2022 06:16 IST

 గతేడాదితో పోలిస్తే 88 శాతం అధికం

దిల్లీ: దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ నిలిచారు. ఆయన వార్షిక వేతనం ఏడాది క్రితం నాటి రూ.42.50 కోట్ల నుంచి 88 శాతం పెరిగి రూ.79.75 కోట్లకు చేరింది. కంపెనీ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 1 నుంచి మరో అయిదేళ్ల కాలానికి పరేఖ్‌ను సీఈఓ, ఎండీగా పునర్నియమిస్తున్నట్లు ఇటీవల కంపెనీ చేసిన ప్రకటనలో భాగంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఇతర ఐటీ కంపెనీల సీఈఓలతో పోలిస్తే సలీల్‌కు ప్రతిపాదించిన పారితోషికం మధ్యస్థంగానే ఉంద’ని సలీల్‌కిచ్చిన భారీ పారితోషికంపై కంపెనీ పేర్కొంది. అసెంచర్‌ పీఎల్‌సీ, కాగ్నిజంట్‌, డీఎక్స్‌సీ టెక్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐబీఎమ్‌ వంటి వాటిని కంపెనీ పరిగణనలోకి తీసుకుంది. టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ గోపీనాథ్‌ వార్షిక వేతనం రూ.25.76 కోట్లుగా ఉండగా.. విప్రో సీఈఓ రూ.64.34 కోట్లు; హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓకు రూ.32.21 కోట్లు; టెక్‌ మహీంద్రా సీఈఓ రూ.22 కోట్లు చొప్పున అందుకున్నారు.
సీఈఓ, ఉద్యోగుల మధ్య భారీ అంతరం: 2022-23లో సలీల్‌ 2.21 లక్షల షేర్లు(రూ.34.75 కోట్లు) పొందుతారు. ఇది ఆయన నియామకం జరిగిన తొలి ఏడాదిలో పొందిన 2.17 లక్షల షేర్లతో పోలిస్తే దాదాపు సమానం. తాజా పెంపుతో సీఈఓ వేతనానికి, ఇన్ఫోసిస్‌ సగటు ఉద్యోగి వేతనానికి మధ్య అంతరం పెరిగింది. ప్రస్తుతం సీఈఓ, ఉద్యోగుల సగటు పారితోషిక(షేర్లు మినహాయిస్తే) నిష్పత్తి 229; షేర్లు కలిపితే 872గా ఉంది. గతంలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి సీఈఓలకు భారీ వేతనాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 20-25 మధ్య సీఈఓ-ఉద్యోగుల పారితోషిక నిష్పత్తి ఉండాలని అప్పట్లో సూచించారు. కాగా, ‘సలీల్‌ హయాంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,77,000 కోట్లకు చేరింది. ఆదాయం 2017-18లో రూ.70,522 కోట్లుగా ఉండగా.. 2021-22 నాటికి రూ.1,21,641 కోట్లకు చేరుకుంది. లాభాలు రూ.16,029 కోట్ల నుంచి రూ.22,110 కోట్లకు వెళ్లాయి. సలీల్‌ ఆధ్వర్యంలో ‘నేవిగేషన్‌ యువర్‌ నెక్స్ట్‌’ వ్యూహం కారణంగా ఈ ఫలితాలు వచ్చాయి’ అని కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది.

అత్యధిక వేతన సీఈఓలు వీరే

న్యూయార్క్‌: ప్రపంచంలో అత్యధిక వేతనం ఆర్జిస్తున్న సీఈఓలుగా ఎక్స్‌పీడియా గ్రూప్‌ సీఈఓ పీటర్‌ కెర్న్‌, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ సీఈఓ లీసా సూ నిలిచారు. ది అసోసియేటెడ్‌ ప్రెస్‌, ఎగ్జిక్యూటివ్‌ డేటా సంస్థ ఈక్విలార్‌లు 2021 సంవత్సరానికి ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలోని కంపెనీల సీఈఓలతో ఈ జాబితా వెలువరించింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎస్‌ అండ్‌ పీ 500 కంపెనీల్లో పనిచేస్తున్న 340 మంది ఎగ్జిక్యూటివ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. సీఈఓలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న కొన్ని కంపెనీలు ఈ నిబంధనను అందుకోలేదు. గతేడాది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల సగటు వేతనం 14.5 మి.డాలర్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు