Updated : 27 May 2022 03:57 IST

వీఎమ్‌వేర్‌ను కొనుగోలు చేస్తున్న చిప్‌ సంస్థ బ్రాడ్‌కామ్‌

 విలువ రూ.4.70 లక్షల కోట్లు

శాన్‌జోస్‌: అమెరికాకు చెందిన క్లౌడ్‌ టెక్నాలజీ కంపెనీ వీఎమ్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు ఆ దేశానికి చెందిన కంప్యూటర్‌ చిప్‌ - సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ బ్రాడ్‌క్యామ్‌ 61 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4.70 లక్షల కోట్లు) వెచ్చించనుంది. 6 నెలల క్రితమే వీఎం వేర్‌లో తన నియంత్రణ వాటా (81 శాతం) ను డెల్‌ టెక్నాలజీస్‌ వదిలేసుకోవడం గమనార్హం. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విపణిలో స్థానం పదిలపరచుకోవాలన్నది బ్రాడ్‌కామ్‌ యత్నం. వీఎం వేర్‌ సాంకేతికత వల్ల పెద్ద సంస్థలు పబ్లిక్‌ క్లౌడ్‌ను, కంపెనీల్లోని అంతర్గత నెట్‌వర్క్‌లతో అనుసంధానించే వీలుంది. ఈ లావాదేవీ అనంతరం బ్రాడ్‌కామ్‌ సాఫ్ట్‌వేర్‌ గ్రూప్‌ పేరును వీఎంవేర్‌గా మార్చి, కార్యకలాపాలు సాగిస్తారు. నగదు, స్టాక్‌ ఒప్పందాల రూపంలో జరిగే ఈ లావాదేవీలో  వీఎం వేర్‌కు చెందిన నికర రుణం 8 బి.డా. (సుమారు రూ.61,600 కోట్లు) కూడా కలిసే ఉంటుంది. ఈ లావాదేవీ కోసం బ్యాంకుల నుంచి 32 బి.డా. రుణ సాయాన్ని బ్రాడ్‌కామ్‌ పొందుతుంది.

* తాజా ప్రతిపాదన ప్రకారం వీఎం వేర్‌ వాటాదార్లు తమ ప్రతి షేరుకు 142.50 డాలర్ల నగదు లేదా 0.2520 బ్రాడ్‌కామ్‌ షేరు పొందుతారు.

* వీఎం వేర్‌ ఛైర్మన్‌గా మైఖేల్‌ డెల్‌ కొనసాగుతారు. ఆయన వద్ద కంపెనీలో 40.2 శాతం వాటాకు సమానమైన షేర్లు ఉన్నాయి.  

* 40 రోజుల వ్యవధిలో మరింత మంచి ఆఫర్‌ను పరిశీలించే స్వేచ్ఛ వీఎం వేర్‌కు ఉంటుంది.

* బ్రాడ్‌కామ్‌ 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు. సంయుక్త సంస్థలో బ్రాడ్‌కామ్‌ వాటాదార్లకు 88 శాతం, వీఎం వేర్‌ వాటాదార్లకు 12 శాతం వాటాలుంటాయి.

* వీఎమ్‌వేర్‌కు భారత్‌లో 7,000 మందికి పైగా ఉద్యోగులున్నారు.  

బీపీసీఎల్‌ విక్రయం నిలిపివేత

బీపీసీఎల్‌లో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ఇంధన విపణిలో ప్రతికూల పరిస్థితుల కారణంగా, బీపీసీఎల్‌  ప్రైవేటీకరణ ప్రక్రియలో పాల్గొనేందుకు మెజారిటీ బిడ్డర్లు నిరాసక్తత చూపడమే ఇందుకు కారణం. ఈ సంస్థ కోసం  మూడు బిడ్లు వచ్చాయి. అయితే ఇంధన విక్రయ ధరలపై స్పష్టత లేకపోవడంతో ఇద్దరు బిడ్డర్లు తప్పుకోవడం, ఒక బిడ్డర్‌ మాత్రమే మిగలడంతో ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

ఓఎన్‌జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు

రాబోయే మూడేళ్లలో చమురు, సహజవాయువు అన్వేషణకు  రూ.31,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. 2019-22లో వ్యయం చేసిన రూ.20,670 కోట్లతో పోలిస్తే, ఇది 150% అధికం. ఈ ప్రక్రియలో విదేశీ భాగస్వాములతోనూ జట్టుకట్టాలని బోర్డు నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.  కేజీ బేసిన్‌లోని అత్యంత లోతైన, అధిక పీడన, ఉష్ణోగ్రతతో కూడిన ప్రదేశాల్లోని (దీన్‌ దయాల్‌ వెస్ట్‌ (డీడీడబ్ల్యూ) బ్లాక్‌, కేజీ-డీ5 ప్రాంతాల్లోని కస్టర్‌-3) ఇంధన నిక్షేపాల్లో వాటా కొనుగోలు చేయాలంటూ విదేశీ సంస్థలకు ఓఎన్‌జీసీ ఆఫర్‌ ఇచ్చింది. సంక్లిష్ట క్షేత్రాల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత కంపెనీలకు షెల్‌ రష్యా ఎల్‌ఎన్‌జీ ప్లాంటు!

రష్యాలోని ఒక ప్రధాన ఎల్‌ఎన్‌జీ ప్లాంటులో తన వాటాను భారత్‌కు చెందిన ఇంధన కంపెనీల కన్సార్షియానికి విక్రయించాలని బ్రిటన్‌కు చెందిన ఇంధన కంపెనీ షెల్‌ భావిస్తోంది. ఇందు కోసం చర్చలు జరుపుతున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’  పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, రష్యా కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు షెల్‌ గతంలోనే పేర్కొంది సఖాలిన్‌-2 ఎల్‌ఎన్‌జీ ప్లాంటులో తనకున్న 27.5 శాతం వాటాను అమ్మాలని భావించింది. ఓఎన్‌జీసీ విదేశ్‌, గెయిల్‌ వంటి భారత కంపెనీల బృందానికి ఈ వాటా అమ్మేందుకు షెల్‌ చర్చలు చేపట్టినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని