Updated : 28 May 2022 06:00 IST

రూ.3,000 కోట్లతో విస్తరణ

 అవకాశాలు కలిసి వస్తే మరిన్ని పెట్టుబడులు

 పేటెంట్‌ గడువు తీరే 20 బి. డాలర్ల ఔషధాలపై గురి

 దివీస్‌ సీఎండీ మురళి కె.దివి

ఈనాడు - హైదరాబాద్‌

దివీస్‌ లేబొరేటరీస్‌ మలిదశ విస్తరణపై దృష్టి సారించింది. ఈ సంస్థ కొన్నేళ్లుగా హైదరాబాద్‌, విశాఖపట్నం సమీపంలోని తన యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. కాకినాడలో కొత్త యూనిట్‌ నిర్మించే సన్నాహాల్లో ఉంది. ఇంతటితో సరిపెట్టుకోకుండా, ఇంకా అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. వృద్ధి బాటలో కొనసాగాలంటే విస్తరణ తప్పదని, దీని కోసం రెండు- మూడేళ్లలో రూ.3,000 కోట్ల వరకు మూలధన పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు దివీస్‌ లేబొరేటరీస్‌ సీఎండీ మురళి కె.దివి వెల్లడించారు. తమకు మంచి అవకాశాలు లభిస్తే ఇంకా అధిక పెట్టుబడికి సుముఖంగా ఉన్నామని, రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం తమకు ఉందని తాజాగా ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘టెలీకాన్పెరెన్స్‌ కాల్‌’ లో ఆయన స్పష్టం చేశారు.

‘కంపెనీకి అప్పు లేదు.. పైగా  రూ.3,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కాబట్టి విస్తరణకు నిధుల సమస్య ఎదురు కాదు’ అన్నారాయన. 2023 నుంచి 2025 మధ్య దాదాపు 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.54 లక్షల కోట్ల) విలువైన ఔషధాలకు పేటెంట్‌ గడువు తీరనుందని, ఈ ఔషధాలను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్‌కు అందించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఒర్లిస్టాట్‌, బ్రిలింటా, లాకోసమైడ్‌.. తదితర ఔషధాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో కంపెనీకి మెరుగైన ఆదాయాలు తెచ్చిపెట్టే రెండు కస్టమ్‌ సింథసిస్‌ ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టినట్లు, ఈ ఔషధాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద సరఫరా చేస్తున్నట్లు మురళి కే. దివి తెలిపారు. ఒకటి- రెండేళ్ల వ్యవధిలో ఈ ఔషధాలు వాణిజ్య ఉత్పత్తి దశకు చేరుకుంటాయని వెల్లడించారు.

44 శాతం ఎబిటా మార్జిన్‌

దేశీయ ఫార్మా కంపెనీల్లో అత్యధిక ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపులకు ముందు లాభం) మార్జిన్‌ ఉన్న సంస్థగా దివీస్‌ లేబొరేటరీస్‌ కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం ఎబిటా మార్జిన్‌ను ఈ సంస్థ నమోదు చేసింది. వార్షికాదాయం రూ.9,074 కోట్లు ఉండగా, దీనిపై రూ.2,960 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21తో పోల్చితే ఆదాయంలో 29 శాతం, నికరలాభాల్లో 49 శాతం వృద్ధి సాధించినట్లు అవుతోంది. 2022 మార్చి 31 నాటికి దివీస్‌ లేబొరేటరీస్‌ చేతిలో రూ.2,804 కోట్ల నగదు నిల్వలున్నాయి. అదే సమయంలో రిసీవబుల్స్‌ రూ.2,570 కోట్లు, ఇన్వెంటరీ రూ.2,644 కోట్లు ఉండటం గమనార్హం. తాజాగా సంస్థ నికర విలువ రూ.11,691 కోట్లకు పెరిగింది.

రూ.1 లక్ష కోట్ల దిగువకు మార్కెట్‌ విలువ

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి, 2021-22 పూర్తికాలానికి మెరుగైన ఫలితాలు ప్రకటించినప్పటికీ దివీస్‌ లేబొరేటరీస్‌ షేరు ధర స్టాక్‌మార్కెట్లో అనూహ్యంగా పతనమైంది. ఇటీవల వరకు రూ.4,400 దరిదాపుల్లో ఉన్న షేరు ధర, ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత రూ.3,400 కు పతనం అయింది. దీంతో ఈ సంస్థ మార్కెట్‌ విలువ (కేపిటలైజేషన్‌) రూ.1 లక్ష కోట్ల కంటే దిగువకు వచ్చింది. ఇటీవల వరకు దేశీయ ఫార్మా కంపెనీల్లో రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలు రెండు మాత్రమే. ఒకటి సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ అయితే రెండోది దివీస్‌ లేబొరేటరీస్‌. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అరుదైన ఘనత సాధించిన తొలి కంపెనీగా దివీస్‌ చరిత్ర సృష్టించింది. కానీ షేరు ధర పతనం కావటంతో దివీస్‌ మార్కెట్‌ విలువ ఇప్పుడు రూ.93,000 కోట్ల స్థాయికి దిగివచ్చింది. దీంతో ఇప్పుడు సన్‌ ఫార్మా ఒక్కటే రూ.1 లక్ష కోట్లకు మించిన మార్కెట్‌ మార్కెట్‌ విలువ గల దేశీయ ఫార్మా కంపెనీగా కనిపిస్తోంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని