బంగారు కొండ.. ఆర్‌బీఐ

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, అనిశ్చితులను-ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) బంగారాన్ని నమ్ముకుంటోంది. 2020 జూన్‌ - 2021 మార్చి మధ్య కాలంలో

Published : 28 May 2022 05:03 IST

రూ.3.22 లక్షల కోట్ల విలువైన నిల్వలు

ముంబయి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, అనిశ్చితులను-ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) బంగారాన్ని నమ్ముకుంటోంది. 2020 జూన్‌ - 2021 మార్చి మధ్య కాలంలో ఆర్‌బీఐ 33.9 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. అక్కడ నుంచి 2022 మార్చి ఆఖరులోపు మరో 65 టన్నుల బంగారాన్ని జత చేసుకుంది. అంటే రెండేళ్లలోనే 100 టన్నులకు పైగా బంగారాన్ని తన నిల్వలకు జత చేసుకుంది. 2022 మార్చి ఆఖరుకు ఆర్‌బీఐ వద్ద 760.42 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఆర్‌బీఐ దగ్గర ఉన్న పసిడి నిల్వల విలువ రూ3.22 లక్షల కోట్లుగా వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ దశలను పరిశీలించాక, అమెరికా డాలరు మారకపు విలువలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తి బంగారానికి ఉందని గుర్తించామని, దీన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నట్లు ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న బంగారం నిల్వలను పెంచుకుంటోంది. ఇందులో గోల్డ్‌ డిపాజిట్లు 11.08 టన్నుల మేరకు ఉన్నాయి. మొత్తం బంగారంలో 453.52 టన్నులను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర భద్రపర్చగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) దగ్గర 295.82 టన్నులు ఉంది. ఆర్‌బీఐ విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో బంగారం విలువ 2021 సెప్టెంబరులో 5.88 శాతం ఉండగా, 2022 మార్చి నాటికి 7.01 శాతానికి చేరుకుంది. బంగారం ధర పెరగడం, రూపాయి విలువ క్షీణించడం తదితర కారణాలతో విలువ పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

రిటైల్‌ ధరలపైనా ఒత్తిడి

టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) బాగా పెరిగినందున, రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఏర్పడొచ్చని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. ‘పారిశ్రామిక ముడి వస్తువుల ధరలు, రవాణా వ్యయాలు అధికం కావడానికి తోడు, అంతర్జాతీయ రవాణా, సరఫరా వైపు సమస్యలతో టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో తయారీ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ముడి పదార్థాల వ్యయాల ఒత్తిళ్లు కాస్త ఆలస్యంగానైనా రిటైల్‌ ధరలపై ప్రభావం చూపవచ్చ’ని తన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. ధరలను అదుపులో ఉంచేందు కోసం కేంద్రం ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో పాటు; ఉక్కు, ప్లాస్టిక్‌ పరిశ్రమలో వినియోగించే కొన్ని ముడిపదార్థాలపై దిగుమతి సుంకానికి మినహాయింపునిచ్చింది. ముడి ఇనుము, ఐరన్‌ పెలెట్లపై ఎగుమతి సుంకాన్ని పెంచింది.

బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి

బ్యాంకులు వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని.. కరోనా సమయంలో రుణ పునర్నిర్మాణాలను చేపట్టిన కంపెనీల ధోరణులను గమనించాలని ఆర్‌బీఐ సూచించింది. కరోనా పరిణామాలు, లాక్‌డౌన్‌ల ప్రభావం నుంచి బయటపడేందుకు కంపెనీల రుణ చెల్లింపులపై మారటోరియాన్ని బ్యాంకులు పొడిగించిన సంగతి తెలిసిందే. మహమ్మారి నేపథ్యంలోనూ బ్యాంకింగ్‌ రంగం ఆర్థిక పరామితులను మెరుగుపరచుకుందని శుక్రవారం నాటి వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. కరోనా పరిణామాలకు ఎక్కువగా ప్రభావితం అయిన కంపెనీల రుణ ధోరణులను జాగ్రత్తగా గమనించాలని బ్యాంకులకు సూచించింది. ‘రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, రుణ గిరాకీ పెరిగితే బ్యాంకులు రుణ వృద్దికి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించాలి. కొత్తగా మొండి బకాయిలు రాకుండా చూసుకోవాల’ని తెలిపింది.

డిజిటల్‌ కరెన్సీపై తీక్షణ సమాలోచన

దేశంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశ పెట్టేందుకు, అందుకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ  పేర్కొంది. సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ)ని  ఆర్‌బీఐ తీసుకొస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2022-23లో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పరపతి విధాన లక్ష్యాలకు అనుగుణంగా; ఆర్థిక స్థిరత్వానికి వీలుగా; కరెన్సీ, చెల్లింపుల వ్యవస్థల్లో సమర్థవంగా కార్యకలాపాలు ఉండేలా సీబీడీసీని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంద’ని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు