సంక్షిప్త వార్తలు

జూన్‌ నుంచి దశలవారీగా బస్తా సిమెంటు ధరను రూ.55 మేర పెంచాలని ద ఇండియా సిమెంట్స్‌ ప్రణాళికలు రచిస్తోంది. ‘బస్తా ధరను జూన్‌ 1న రూ.20; జూన్‌ 15న రూ.15; జులై 1న రూ.20 చొప్పున పెంచనున్న’ట్లు ఇండియా సిమెంట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ తెలిపారు.

Published : 28 May 2022 05:03 IST

సిమెంటు ధర మరో రూ.55 పెంచుతాం

 జూన్‌ నుంచి దశల వారీగా

 ఇండియా సిమెంట్స్‌  

చెన్నై: జూన్‌ నుంచి దశలవారీగా బస్తా సిమెంటు ధరను రూ.55 మేర పెంచాలని ద ఇండియా సిమెంట్స్‌ ప్రణాళికలు రచిస్తోంది. ‘బస్తా ధరను జూన్‌ 1న రూ.20; జూన్‌ 15న రూ.15; జులై 1న రూ.20 చొప్పున పెంచనున్న’ట్లు ఇండియా సిమెంట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ తెలిపారు. తద్వారా కంపెనీ లాభ, నష్టాల ఖాతాలు మెరుగ్గా కనిపించగలవని భావిస్తున్నట్లు తెలిపారు. ‘నేను ఒక సిమెంట్‌ కంపెనీకి బాధ్యత వహిస్తున్నాను. అన్ని వ్యయాలు పెరిగినందున మరిన్ని డబ్బులు నష్టపోకుండా చూసుకుంటా’ అని ఆయన అన్నారు. ‘ధరల పెంపు వల్ల విక్రయాలకు ఇబ్బంది ఉండదు. ఇండియా సిమెంట్స్‌ అనేది చాలా మంచి బ్రాండ్‌’ అని వివరించారు.


గెయిల్‌ లాభంలో 40% వృద్ధి

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ రూ.2,683.11 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.1,907.67 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. సహజ వాయువు అమ్మకాలు పెరగడంతో, మార్జిన్లు మెరుగవ్వడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.15,549.07 కోట్ల నుంచి రూ.26,968.21 కోట్లకు పెరిగింది. సహజవాయువు మార్కెటింగ్‌ ఆదాయం రూ.280.89 కోట్ల నుంచి రూ.1,725.93 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ రికార్డు స్థాయిలో రూ.10,363.97 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020-21లో కంపెనీ లాభం రూ.4,890.18 కోట్లుగా నమోదైంది.


గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.423 కోట్లు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.422.82 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.92.17 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.2,610.69 కోట్ల నుంచి రూ.4,444.87 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.2,813.8 కోట్ల నుంచి రూ.4,202.23 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ రూ.992.43 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020-21లో కంపెనీ లాభం రూ.391.05 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.9,333.51 కోట్ల నుంచి రూ.14,130.15 కోట్లకు చేరింది. 2023 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి వరకు మూడేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్‌, ఎండీగా నాదిర్‌ గోద్రేజ్‌ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది.


రుచిసోయా 250% డివిడెండ్‌

దిల్లీ: మార్చి త్రైమాసికంలో రుచి సోయా స్టాండలోన్‌ పద్ధతిలో రూ.234.33 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.314.33 కోట్లతో పోలిస్తే ఈసారి 25 శాతం తగ్గింది. మొత్తం ఆదాయం రూ.4,859.50 కోట్ల నుంచి రూ.6,676.19 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2021-22) రుచి సోయా నికర లాభం రూ.806.30 కోట్లుగా నమోదైంది. 2020-21లో నికర లాభం రూ.680.77 కోట్లు. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.16,382.97 కోట్ల నుంచి  రూ.24,284.38 కోట్లకు పెరిగింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.5 (250%) డివిడెండును కంపెనీ ప్రకటించింది.


జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌

లాభంలో 20% క్షీణత

దిల్లీ: జనవరి- మార్చిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.3,343 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే సమయ లాభం రూ.4,191 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.27,095 కోట్ల నుంచి రూ.47,128 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.20,752 కోట్ల నుంచి రూ.41,282 కోట్లకు పెరిగాయి.


బీడీఎల్‌కు రూ.264 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.264 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.1,381 కోట్లుగా నమోదయ్యింది. 2020-21 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,137 కోట్లు, నికర లాభం రూ.260 కోట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ.2,817 కోట్లు, నికర లాభం రూ.500 కోట్లుగా నమోదయ్యాయి. 2020-21 లాభం రూ.258 కోట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 94 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి రూ.10170 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవన్నీ రానున్న 2-3 ఏళ్లలో పూర్తి కానున్నట్లు పేర్కొంది. ఆకాశ్‌ క్షిపణిని మిత్ర దేశాలు కోరుతున్నాయని, ఒకటి రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.


ఆయిల్‌ ఇండియా లాభం రూ.1630 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా రికార్డు స్థాయిలో అత్యధిక త్రైమాసిక నికర లాభాన్ని నమోదు చేసింది. ఒక్కో బారెల్‌ ఉత్పత్తి, విక్రయంపై సుమారుగా 100 డాలర్లను పొందడంతో 2021-22 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం దాదాపు రెట్టింపై రూ.1,630.01 కోట్లకు చేరుకుందని ఆయిల్‌ ఇండియా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) హరీశ్‌ మాధవ్‌ పేర్కొన్నారు. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.847.56 కోట్లు మాత్రమే. త్రైమాసిక టర్నోవరు 55 శాతం వృద్ధితో రూ.16,427.65 కోట్లకు చేరుకుంది. 2021-22 మొత్తానికి అత్యధిక నికర లాభమైన రూ.3,887.31 కోట్లు లేదా ఒక్కో షేరుపై రూ.35.85 వరకు పొందింది.2020-21లో రూ.1,741.59 కోట్ల లాభం (ఒక్కో షేరుకు రూ.16.06) ఆర్జించింది.


  రెస్టారెంట్ల సేవా ఛార్జీ చట్టవ్యతిరేకం కాదు

ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వివరణ

దిల్లీ: రెస్టారెంట్లు సేవా ఛార్జీలను విధించడం చట్టవ్యతిరేకం కాదని ఆతిథ్య పరిశ్రమ సంఘం ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ పేర్కొంది. అటువంటి రెస్టారెంట్లను ఆదరించాలా వద్దా అన్నది వినియోగదార్ల ఇష్టమని అభిప్రాయపడింది. సేవా రుసుములను బలవంతంగా వసూలు చేస్తున్నారంటూ వినియోగదార్ల నుంచి ఫిర్యాదులు పెరుగుతుండడంతో దీనిపై చర్చించడానికి జూన్‌ 2న రావాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ)ను వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ‘సేవా రుసుము విధిస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లాలా వద్దా అన్నది వినియోగదారుడి ఇష్టమే. సేవా రుసుము వసూలు అనేది చట్ట ఉల్లంఘన ఏమీ కాదు. భారత్‌లో, ఇతర దేశాల్లో ఇది అందరూ పాటిస్తున్నదే. సేవా ఛార్జీలను ‘టిప్స్‌’గా పిలుస్తుంటారు. రెస్టారెంట్లు తమ మెనూ కార్డుల్లో సేవా ఛార్జీని పేర్కొంటున్నాయి. వినియోగదార్లకు సమాచారం అందిస్తున్నారు. ఒక వేళ ఏ అతిథి అయినా దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే దానిని తీసేస్తున్నార’ని ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ వైస్‌ ప్రెసిడెంట్‌ గురుబక్షి సింగ్‌ కోహ్లి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాధారణంగా ఇతర సర్వీసు ప్రొవైడర్లు ‘కన్వీనియన్స్‌ ఫీజు’ కింద తమ సేవలపై వినియోగదార్ల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. వెబ్‌సైట్లు, పోర్టళ్ల ద్వారా రైళ్లు, విమాన టికెట్ల బుకింగ్‌లపై; ఆహార ఆర్డర్లపై లేదా సినిమా టికెట్లపై ఈ తరహా ఫీజు తీసుకుంటున్నారు. ఇతర ఏ రంగంలోనూ కన్వీనియన్స్‌ ఫీజు రిఫండ్‌ లేదా రద్దు లేదు. మొత్తం రద్దుపై సమాచారం ఇస్తున్నా కూడా, ఆతిథ్య రంగాన్నే లక్ష్యంగా చేసుకున్నార’ని ఆయన విమర్శించారు.


కీవే విద్యుత్‌ వాహనాల ఆవిష్కరణ

ధర రూ.2,99,000

హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌), న్యూస్‌టుడే: హంగేరీ దేశానికి చెందిన కీవే భారత విపణి కోసం విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు సిక్ట్సీస్‌ 300ఐ, వియెస్టె 300 మ్యాక్సీ, కె-లైట్‌ 250లను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000గా ప్రకటించింది. త్వరలోనే ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా కీవే ఈ వాహనాలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌లోని బెనెల్లీ అసెంబ్లీ ప్లాంటు నుంచి ఈ వాహనాల ఉత్పత్తి జరుగుతుందని కీవే ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ జబక్‌ తెలిపారు. ఈ ఏడాది చివరికి 4 విభాగాల్లో 8 మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.


డిజిటల్‌ కరెన్సీపై తీక్షణ సమాలోచన

 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ముంబయి: దేశంలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశ పెట్టేందుకు, అందుకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం పేర్కొంది. డిజిటల్‌ కరెన్సీ ఆవిష్కరణకు నియంత్రణతో కూడిన విధానాన్ని అవలంబిస్తామని పేర్కొంది. సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ)ని  ఆర్‌బీఐ తీసుకొస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2022-23లో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘దేశంలో డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించే పనిలో ఆర్‌బీఐ ఉంది. పరపతి విధాన లక్ష్యాలకు అనుగుణంగా; ఆర్థిక స్థిరత్వానికి వీలుగా; కరెన్సీ, చెల్లింపుల వ్యవస్థల్లో సమర్థవంగా కార్యకలాపాలు ఉండేలా సీబీడీసీని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంద’ని పేర్కొంది. ‘ఆలోచన కార్యాచరణకు వీలవుతుందా, లేదా అన్నదానిపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత పైలట్‌ నమూనాలో చూడాలి. చివరగా ఆవిష్కరించాలి. ఇలా దశల వారీగా సీబీడీసీని ఆవిష్కరించాల’ని తెలిపింది.


రిటైల్‌ ధరలపైనా ఒత్తిడి

టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) బాగా పెరిగినందున, రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఏర్పడొచ్చని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. ‘పారిశ్రామిక ముడి వస్తువుల ధరలు, రవాణా వ్యయాలు అధికం కావడానికి తోడు, అంతర్జాతీయ రవాణా, సరఫరా వైపు సమస్యలతో టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో తయారీ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ముడి పదార్థాల వ్యయాల ఒత్తిళ్లు కాస్త ఆలస్యంగానైనా రిటైల్‌ ధరలపై ప్రభావం చూపవచ్చ’ని తన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. ధరలను అదుపులో ఉంచేందు కోసం కేంద్రం ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో పాటు; ఉక్కు, ప్లాస్టిక్‌ పరిశ్రమలో వినియోగించే కొన్ని ముడిపదార్థాలపై దిగుమతి సుంకానికి మినహాయింపునిచ్చింది. ముడి ఇనుము, ఐరన్‌ పెలెట్ల ఎగుమతి సుంకాన్ని థపెంచింది.


బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

దీపావళి కల్లా : గోయల్‌

లండన్‌: భారత్‌, బ్రిటన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దీపావళి కల్లా సిద్ధమయ్యే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంప్రదింపుల్లో జరుగుతున్న పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తోందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల నుంచి  గోయల్‌ లండన్‌కు చేరుకున్నారు. జూన్‌ 13న నాలుగో విడత ఎఫ్‌టీఏ సంప్రదింపులు జరగనున్న నేపథ్యంలో, వివిధ వర్గాల ప్రతినిధులు, వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ యూఏఈ, ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వేగంగా పూర్తవడాన్ని గోయల్‌ ప్రస్తావించారు. ‘కెనడాతో తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రిటన్‌తో కూడా ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకున్నాం. అయితే చర్చల్లో మరింత పురోగతి ఉండటంతో దీపావళి నాటికి పూర్తి ఎఫ్‌టీఏ కుదురుతుందని భావిస్తున్నామ’ని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని