రూ.1.47 లక్షల కోట్లకు పానీయాల మార్కెట్‌

ఆల్కహాల్‌ ఏతర పానీయాల కేంద్రంగా మారే సామర్థ్యం భారత్‌కు ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌(ఇక్రియార్‌) అంటోంది. 2030 కల్లా భారత్‌లో ఈ రంగ మార్కెట్‌ విపణి రూ.1.47 లక్షల కోట్లకు చేరొచ్చని తన నివేదికలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు..

Published : 29 May 2022 02:34 IST

2030 కల్లా : ఇక్రియార్‌ నివేదిక

దిల్లీ: ఆల్కహాల్‌ ఏతర పానీయాల కేంద్రంగా మారే సామర్థ్యం భారత్‌కు ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌(ఇక్రియార్‌) అంటోంది. 2030 కల్లా భారత్‌లో ఈ రంగ మార్కెట్‌ విపణి రూ.1.47 లక్షల కోట్లకు చేరొచ్చని తన నివేదికలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు..

* 2019లో భారత ఆల్కహాల్‌ ఏతర మార్కెట్‌ రూ.67,100 కోట్ల స్థాయిలో ఉందని అంచనా. ఇది 2030 కల్లా రూ.1,47,233 కోట్లకు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ముడి పదార్థాల లభ్యత, కార్మిక, విధాన మద్దతు వల్ల దేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం లభిస్తోంది.

* ఆల్కహాలేతర పానీయాల రంగంలో ఇప్పటికీ నీళ్ల సీసాలు, కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌లకే అధిక  వాటా ఉంది. జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు, టీ, పాలు, కాఫీ ఆధారిత పానీయాలు, ఆర్గానిక్‌ డ్రింక్స్‌ విభాగాలు పుంజుకుంటున్నాయి.

* ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో దేశీయ వినియోగం, ఎగుమతులు తక్కువే. కాబట్టి ఆల్కహాలేతర పానీయాల పరిశ్రమ వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* 2018లో తలసరి విక్రయ వార్షిక పరిమాణం 21.36 లీటర్లుగా ఉంది. 2020లో ఎగుమతులు 29.89 మి. డాలర్లు మాత్రమే. దేశీయ విక్రయ పరిమాణంతో పాటు ఎగుమతుల మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎంత అవకాశం ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

* భారత ఆర్థిక వ్యవస్థలకు విలువ జోడింపు, ఉద్యోగ సృష్టి విషయంలో ఈ రంగం విశేష పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో మొత్తం మీద 6.91 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. ప్రతి రూ.కోటి విలువైన పానీయాల ఉత్పత్తికి 8.9 అదనపు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలుస్తోంది.

* ఈ రంగంలో వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లభిస్తున్నప్పటికీ.. పరిశ్రమపై ఉన్న ప్రతికూల ధోరణి, అధిక పన్నుల కారణంగా విస్తరించలేకపోతోంది. అధిక రవాణా వ్యయాలు, సరఫరా వ్యవస్థలో లోపాలు కూడా అడ్డుగా ఉన్నాయి. తమ ఉత్పత్తుల వల్ల పర్యావరణంపై దుష్ఫలితాలు ఏర్పడకుండా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.

* నకిలీ ఉత్పత్తులతో పాటు అసంఘటిత రంగం నుంచి సహేతుకం కాని పోటీని ఈ విభాగం ఎదుర్కొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని