విమాన గరిష్ఠ ఛార్జీ పరిమితి పెంచాలి

విమాన ఇంధన ధర భారీగా పెరిగిన నేపథ్యంలో, దేశీయ విమాన ఛార్జీల గరిష్ఠ పరిమితులను పెంచే అంశాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలించాలని ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా కోరారు. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం

Published : 02 Jun 2022 02:48 IST

ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా

దిల్లీ: విమాన ఇంధన ధర భారీగా పెరిగిన నేపథ్యంలో, దేశీయ విమాన ఛార్జీల గరిష్ఠ పరిమితులను పెంచే అంశాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలించాలని ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా కోరారు. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం 2020 మే 25న దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనపుడు ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను మంత్రిత్వ శాఖ విధించింది. ప్రయాణ సమయాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. 40 నిమిషాల్లోపు వ్యవధి ఉండే ప్రయాణాలకు రూ.2,900-8800  (జీఎస్‌టీ మినహాయించి) ఛార్జీ నిర్ణయించారు. అప్పట్లో ప్రయాణ ఆంక్షల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విమానయాన సంస్థలకు మద్దతు పలికేందుకు కనిష్ఠ పరిమితిని తీసుకొచ్చారు. అదే సమయంలో గిరాకీ ఎక్కువగా ఉన్న సమయంలో, ప్రయాణికులపై అధిక భారం పడకుండా టిక్కెట్‌కు గరిష్ఠ పరిమితిని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచీ ఇంధన ధరలు పెరుగుతుండటంతో, విమానయాన సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని దత్తా చెప్పారు.  

బిజినెస్‌ క్లాస్‌ ప్రారంభిస్తాం: 2024 చివరి కల్లా ఎయిర్‌బస్‌ అందించే ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాల్లో కొత్తగా బిజినెస్‌ క్లాస్‌ను జత చేయాలని భావిస్తున్నట్లు దత్తా పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో వీటిని వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం ఇండిగో ఉపయోగిస్తున్న 275 విమానాలూ ఏ320నియోస్‌, ఏ321 నియోస్‌ వంటి తక్కువ వెడల్పు ఉండేవే. వీటిలో ఎకానమీ తరగతి సీట్లు మాత్రమే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని