Published : 07 Jun 2022 01:27 IST

ఇలాగైతే కొనుగోలు ఒప్పందం రద్దు

ట్విటర్‌కు మస్క్‌ హెచ్చరిక

డెట్రాయిట్‌: నకిలీ/ స్పామ్‌ ఖాతాల సంఖ్య వివరాలను ఇవ్వనందున, ట్విటర్‌ కొనుగోలు కోసం కుదుర్చుకున్న 44 బి.డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్ల) ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. ఆయన తరపు న్యాయవాదులు ట్విటర్‌కు పంపిన లేఖలో ఈవిధమైన హెచ్చరిక చేశారు. ట్విటర్‌ వద్ద ఉన్న 22.9 కోట్ల ఖాతాల్లో ఎన్ని నకిలీవో తెలియజేయాలంటూ.. ఆ సంస్థ కొనుగోలుకు ఆఫర్‌ ప్రకటించిన సుమారు నెల రోజుల తర్వాత అంటే మే 9 నుంచి పలుమార్లు మస్క్‌ అడిగారని ఆ లేఖలో ఉంది. ట్విటర్‌ నుంచి స్పందన కోరుతూ సోమవారం తాజా లేఖను పంపారు. ‘ట్విటర్‌ కేవలం ఖాతాల టెస్టింగ్‌ విధానాల వివరాలనే చెబుతానని అంటోంది. కానీ మస్క్‌ అడిగిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తోంది. ట్విటర్‌ ఖాతాల విషయంలో మస్క్‌ సొంతంగా పరిశీలించి తెలుసుకోవాలని అనుకుంటున్నార’ని న్యాయవాదులు తెలిపారు. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న ఒప్పందం కింద ఏర్పడిన సమాచార హక్కుల ఉల్లంఘనకు ట్విటర్‌ పాల్పడుతోందని, తాజాగా ఆ సంస్థ స్పందించిన తీరు ఆధారంగా మస్క్‌ భావిస్తున్నారని న్యాయవాదులు చెబుతున్నారు. అందువల్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లకూడదనే హక్కుతో పాటు విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం మస్క్‌కు ఉందని అందులో పేర్కొన్నారు. 


ట్విటర్‌- ఎలాన్‌ మస్క్‌ మధ్య చోటుచేసుకున్న పరిణామాల క్రమం ఇలా..

మార్చి 26: ట్విటర్‌కు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాన్ని తీసుకొస్తామని ఎలాన్‌ మస్క్‌ ప్రకటన.

ఏప్రిల్‌ 4: ట్విటర్‌లో 9 శాతం వాటా (7.35 కోట్ల షేర్ల)ను 3 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు. తద్వారా ఆ సంస్థలో అతిపెద్ద వాటాదారుగా మస్క్‌ అవతరణ.

ఏప్రిల్‌ 5: ట్విటర్‌ బోర్డులో సీటు కావాలని మస్క్‌ అడిగారు. ఆయన రాకతో బోర్డుకు మరింత విలువ చేకూరుతుందని ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ప్రకటన

ఏప్రిల్‌ 11: ట్విటర్‌ బోర్డులో మస్క్‌ చేరడం లేదని పరాగ్‌ అగర్వాల్‌ వెల్లడి

ఏప్రిల్‌ 14: కంపెనీ మొత్తాన్ని 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఆఫర్‌ ఇచ్చారని ఎక్స్ఛేంజీలకు ట్విటర్‌ సమాచారం.

ఏప్రిల్‌ 15: మస్క్‌ కొనుగోలు ఆఫర్‌ను వ్యతిరేకించే విషయంలో ట్విటర్‌ బోర్డు వైఫల్యం

ఏప్రిల్‌ 21: ట్విటర్‌ కొనుగోలు కోసం 46.5 బిలియన్‌ డాలర్ల రుణ సమీకరణలో మస్క్‌.

ఏప్రిల్‌ 25: ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం పూర్తి

ఏప్రిల్‌ 29: ట్విటర్‌ కొనుగోలుకు అవసరమయ్యే నిధుల కోసం టెస్లాలో మస్క్‌ 8.5 బి.డాలర్ల విలువైన షేర్ల విక్రయం

మే 5: వివిధ మదుపర్ల దగ్గర నుంచి 7 బిలియన్‌ డాలర్లకు పైగా నిధుల సమీకరణకు హామీ పొందిన మస్క్‌.

మే 10: ట్విటర్‌ను ఎలా మార్చబోతున్నానో సంకేతాలిచ్చిన మస్క్‌.

మే 13: ట్విటర్‌ కొనుగోలు ప్రణాళిక తాత్కాలికంగా వాయిదా వేసేందుకు మస్క్‌ నిర్ణయం

జూన్‌ 6: నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. ఇలాగైతే కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటామని ట్విటర్‌కు మస్క్‌ హెచ్చరిక

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని