భారత సార్వభౌమ రేటింగ్‌ ‘స్థిరం’

దాదాపు రెండేళ్ల తర్వాత భారత సార్వభౌమ రేటింగ్‌ భవిష్యత్తు అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ‘ప్రతికూలం’ రేటింగ్‌ను ‘స్థిరం’గా మార్చింది. మధ్యకాల వ్యవధిలో వృద్ధికి ఆటంకాలు తగ్గుతున్నందున,  భారత ఆర్థిక రికవరీ వేగం

Published : 11 Jun 2022 02:15 IST

ప్రతికూలం నుంచి మెరుగు పరచిన ఫిచ్‌

2022-23లో వృద్ధి 7.8 శాతం

దిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత భారత సార్వభౌమ రేటింగ్‌ భవిష్యత్తు అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ‘ప్రతికూలం’ రేటింగ్‌ను ‘స్థిరం’గా మార్చింది. మధ్యకాల వ్యవధిలో వృద్ధికి ఆటంకాలు తగ్గుతున్నందున,  భారత ఆర్థిక రికవరీ వేగం పుంజుకోవచ్చని అభిప్రాయపడింది. అయితే రేటింగ్‌ను ‘బీబీబీ-’ వద్ద యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ కమొడిటీ ధరల పెరుగుదల రూపంలో స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ఆర్థిక రంగ బలహీనతలు తగ్గడం కలిసిరావొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వృద్ధి అంచనాలను 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కోత విధించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇందుకు కారణమని తెలిపింది. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోవడం కొనసాగుతుందని అంచనా వేసింది. 2021-22లో జీడీపీ వృద్ధి 8.7 శాతం కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా నమోదు కావచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేయడం గమనార్హం. ఫిచ్‌ నివేదిక ప్రకారం..

* ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్‌ కోత విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.8 శాతానికి చేరే అవకాశం ఉందని ఫిచ్‌ పేర్కొంది. బడ్జెట్‌లో లక్ష్యాన్ని 6.4 శాతంగా విధించుకున్నారు.

* మధ్యకాల వ్యవధిలో భారత వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ బలమైన వృద్ధి రేటింగ్‌ మెరుగుదలకు కారణమైంది. 2024-25 నుంచి 2027-28 మధ్య భారత వృద్ధి దాదాపు 7 శాతంగా ఉండొచ్చు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతుండటం, సంస్కరణలు, ఆర్థిక రంగంలో ఒత్తిడిలు తగ్గడం ఇందుకు కలిసిరావొచ్చు.

* కరోనా పరిణామాల నేపథ్యంలో 2020 జూన్‌లో భారత రేటింగ్‌ అంచనాలను ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలాని’కి ఫిచ్‌ మార్చింది. 2006 ఆగస్టు నుంచి భారత రేటింగ్‌ ‘బీబీబీ-’గా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని