ఇల్లు కొనొచ్చా.. కొన్నాళ్లు ఆగాలా?

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్వల్ప వ్యవధిలోనే రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు (0.90%) పెంచింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా పేర్కొంది. దీంతో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ

Published : 15 Jun 2022 02:51 IST

రుణ రేట్ల పెంపుతో రుణగ్రహీతల సందిగ్ధత

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్వల్ప వ్యవధిలోనే రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు (0.90%) పెంచింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా పేర్కొంది. దీంతో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరగడం ప్రారంభించాయి. దీంతో గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది. ఇల్లు ఇప్పుడే కొనాలా? మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయా.. అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇటీవలి వరకు అత్యల్ప స్థాయిలో ఉన్న రుణ రేట్లు, మళ్లీ కొవిడ్‌-19 పూర్వ స్థితికి చేరుకునేందుకు వేగంగా కదులుతున్నాయి. దాదాపు అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లను సవరించాయి. మే ప్రారంభంలో 6-6.5 శాతంగా ఉన్న రుణరేట్లు ఇప్పుడు 7.40 -7.95 శాతానికి పెరిగాయి.

పాత రుణాలకు వ్యవధి పెరుగుతుంది

ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ)లో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది. గృహరుణం దీర్ఘకాలం అమలవుతుంది కనుక పలు దశల్లో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం లాంటివి వ్యవధిపై ప్రభావం చూపుతుంటాయి. కొత్తగా ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారికి, వడ్డీ రేట్లు పెరగడంతో రుణ అర్హత మొత్తం తగ్గిపోతోంది. కొత్త ఇల్లు కొనుగోలుకు రూ.30లక్షల రుణాన్ని 25 ఏళ్ల వ్యవధికి 6.5 శాతం వడ్డీతో తీసుకున్నప్పుడు ఈఎంఐ రూ.20,256 అవుతుంది. రుణరేటు 0.90 శాతం పెరిగితే, ఈఎంఐ రూ.21,975 అవుతుంది. వ్యక్తుల ఆదాయం, వయసు ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి బ్యాంకులు. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆ మేరకు రుణ అర్హత తగ్గుతుంది. పై ఉదాహరణలో చూసుకుంటే.. రూ.20,256 వాయిదా చెల్లించే వారికి రుణం రూ.30 లక్షలకు బదులు, రూ.27,65,000 మాత్రమే మంజూరవుతుంది.

ఆచితూచి మంజూరు

రుణ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు పలు రకాల ప్రోత్సాహకాలతో రుణాలు ఇచ్చేందుకు పోటీ పడ్డ బ్యాంకులు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గృహ, వ్యక్తిగత రుణ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించిన తీరును తెలియజేసే క్రెడిట్‌ స్కోరును ప్రాతిపదికగా చూస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులకు గృహ రుణాల మంజూరులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇప్పుడు తీసుకుంటేనే..

భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఇప్పుడున్న స్థాయి నుంచి మరో 75-90 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే రెపో రేటు ప్రస్తుత 4.90% నుంచి 5.65-5.80 శాతానికి చేరొచ్చు. ఇందువల్ల బ్యాంకుల రుణరేట్లు ఇంకా అధికమవుతాయి. ఇదే జరిగితే రుణ అర్హత మరింత తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఇల్లు కొనాలనుకునే వారు సత్వర నిర్ణయం తీసుకోవడం మేలని బ్యాంకింగ్‌ నిపుణలు సూచిస్తున్నారు. క్రెడిట్‌ స్కోరు 750 పాయింట్లకు మించి ఉన్న వారు.. అధిక రుణ రేటు ఉన్న బ్యాంకు నుంచి తక్కువ రుణరేటు ఉన్న బ్యాంకులకు తమ రుణాల్ని బదిలీ చేసుకునే వీలునూ పరిశీలించవచ్చు.  

ఎస్‌బీఐ డిపాజిట్‌, రుణ రేట్లు పెరిగాయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును పెంచడంతో, రుణ రేట్లతో పాటు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లనూ పెంచడం ప్రారంభించాయి.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎఫ్‌డీలపై వడ్డీని 0.20% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈనెల 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 211 రోజుల నుంచి ఏడాది వ్యవధి డిపాజిట్లపై వడ్డీ ఇప్పుడున్న 4.40 శాతం నుంచి 4.60కు చేరింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ 5.30 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ లభించనుంది. సీనియర్‌ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. దీంతోపాటు రూ.2 కోట్ల పైబడిన డిపాజిట్లపై వడ్డీని 0.75 శాతం మేరకు పెంచింది.

* రెపో ఆధారిత రుణాల రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 7.15 శాతానికి చేర్చినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను కూడా 0.20 శాతం పెంచుతున్నామని తెలిపింది. నేటి నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయి.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1-10 ఏళ్ల డిపాజిట్లపై 10-35 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంచింది.

* రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25% వరకు ఈనెల 15 నుంచి పెంచుతున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని