5జీ చందాదార్లు 50 కోట్లకు!

భారత్‌లో 2027 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ అంచనా వేసింది. అప్పటికి మొత్తం మొబైల్‌ చందాదారుల్లో వీరి సంఖ్య 39 శాతం ఉంటుందని నివేదికలో పేర్కొంది.

Published : 22 Jun 2022 03:17 IST

2027కు చేరొచ్చు: టెలికాం పరికరాల సంస్థ ఎరిక్సన్‌ అంచనా

దిల్లీ: భారత్‌లో 2027 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌ అంచనా వేసింది. అప్పటికి మొత్తం మొబైల్‌ చందాదారుల్లో వీరి సంఖ్య 39 శాతం ఉంటుందని నివేదికలో పేర్కొంది. దేశంలో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ  వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ సరాసరి డేటా వినియోగం.. అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు పెరగడం, ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ సరాసరి డేటా వినియోగం అధికమవుతున్నందున 2021 నుంచి 2027 నాటికి మొత్తం మొబైల్‌ డేటా వినియోగం బాగా పెరుగుతుందని వివరించింది. 2021లో  ఒక స్మార్ట్‌ఫోన్‌ నుంచి నెలకు సగటున 20జీబీ వినియోగమవ్వగా, 2027 నాటికి 16% సంచిత వార్షిక వృద్ధి రేటుతో ఇది 50జీబీకి చేరొచ్చని తెలిపింది. వచ్చే 12 నెలల్లో 5జీ సేవలు వినియోగించాలనుకుంటున్నట్లు 52% భారతీయ సంస్థలు సర్వేలో వెల్లడించాయని, 2024కు మారతామని 31% కంపెనీలు పేర్కొన్నాయని తెలిపింది. 2027 నాటికి అంతర్జాతీయంగా మొబైల్‌ వినియోగదారుల్లో సగం మంది 5జీ సేవలకు మారిపోతారని అంచనా వేసింది. వచ్చే 5 ఏళ్లలో ఉత్తర అమెరికాలో ప్రతి 10 మంది మొబైల్‌ చందాదార్లలో 9 మంది 5జీకి మారతారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని