భారత వృద్ధి 7 నుంచి 7.8 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.8 శాతం మేర వృద్ధి చెందొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఏర్పడ్డా.. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, పుంజుకుంటున్న

Updated : 24 Jun 2022 04:11 IST

2022-23పై నిపుణుల అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.8 శాతం మేర వృద్ధి చెందొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఏర్పడ్డా.. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, పుంజుకుంటున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వల్ల భారత్‌ రాణించగలదని వారు అంటున్నారు.

ప్రముఖ ఆర్థికవేత్త, బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌(బేస్‌) వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి మాట్లాడుతూ ‘ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లలో అధికం అంతర్జాతీయ పరిస్థితులే. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లేకుంటే.. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు బలంగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా కొవిడ్‌ ఉద్దీపన చర్యలను భారత్‌ తీసుకుంద’ని తెలిపారు. అంతర్జాతీయంగా ఇంధనం, కమొడిటీల ధరల వల్ల ద్రవ్యోల్బణం ఉన్నట్లుండి పెరిగిందన్నారు. ఇంధనంపై సుంకాల రాయితీ వల్ల రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిరేటు లభించవచ్చని పేర్కొన్నారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎస్‌ఐడీ) డైరెక్టర్‌ నగేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘బలమైన వృద్ధి ధోరణి 2022-23లోనూ కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవ జీడీపీ వృద్ధి 7-7.8 శాతం మధ్య ఉండొచ్చ’ని అన్నారు. ‘ఇంధనం, ఎరువుల దిగుమతి వ్యయాల భారం భారత్‌పై ప్రభావం చూపొచ్చు. అయితే వ్యవసాయ దిగుబడుల ఉత్పత్తికి తోడు, ధాన్యాల ఎగుమతుల వల్ల భారం తగ్గొచ్చాన్నారు.

ఫ్రెంచి ఆర్థికవేత్త గై సొర్మన్‌ స్పందిస్తూ, ‘ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ఇబ్బంది పెడుతోంది. అయితే ప్రధాని మోదీ అవినీతిపై పోరాడటంతో పాటు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించారు. చాలా వరకు భారతీయులు ఎనిమిదేళ్ల కిందటి పోలిస్తే ఇపుడు మెరుగైన జీవితాన్ని గడుపుతున్నార’ని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని