రూ.8,837 కోట్ల ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు నాలుగేళ్లు వాయిదా

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్‌) సంబంధించి రూ.8,837 కోట్ల అదనపు బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని వొడాఫోన్‌ ఐడియా నిర్ణయించింది. 2016-17 తర్వాతి రెండు ఆర్థిక

Published : 24 Jun 2022 03:33 IST

ఆ తర్వాత 6 సమాన వార్షిక వాయిదాల్లో కడతాం

వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్‌) సంబంధించి రూ.8,837 కోట్ల అదనపు బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని వొడాఫోన్‌ ఐడియా నిర్ణయించింది. 2016-17 తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను ఏజీఆర్‌ బకాయిల కింద రూ.8837 కోట్లు  చెల్లించాల్సిందిగా టెలికాం విభాగం (డీఓటీ) నోటీసులు పంపినట్లు ఎక్స్ఛేంజీలకు వొడాఫోన్‌ ఐడియా తెలియజేసింది. ఈ బకాయిలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తించవని పేర్కొంది. అయితే వీటి చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసే అవకాశాన్ని వాడుకునే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వివరించింది. ‘2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్‌ బకాయిలన్నింటికీ నాలుగేళ్ల మారటోరియం అవకాశాన్ని టెలికాం విభాగం మాకు కల్పించింది. టెలికాం విభాగం లేఖ తేదీ నుంచి 90 రోజుల్లోగా ఈ బకాయిలపై వడ్డీని ఈక్విటీ రూపంలో మార్చుకునేందుకు కూడా వీలు కల్పించింద’ని వొడాఫోన్‌ ఐడియా వివరించింది. డీఓటీ పంపిన లేఖలో ఏజీఆర్‌ బకాయిలు రూ.8,837 కోట్లుగా చెప్పారని.. వివిధ సంప్రదింపులు, కాగ్‌, ప్రత్యేక ఆడిట్‌, ఇతర కోర్టు ఆదేశాలు లాంటి పరిణామాలు ఏమైనా చోటుచేసుకుంటే ఈ బకాయిల విలువలో మార్పులకు అవకాశం ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. తుది మొత్తాన్ని మారటోరియం సమయం పూర్తయ్యాక అంటే 2026 మార్చి 31 తర్వాత నుంచి ఆరు సమాన వార్షిక వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొంది. గత ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి కట్టాల్సిన రూ.16,000 కోట్ల వడ్డీని.. కంపెనీలో 33 శాతం వాటా రూపంలోకి మార్చేందుకు ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని