Published : 24 Jun 2022 03:33 IST

ఎగుమతులకు దీర్ఘకాలిక లక్ష్యాలు

వాణిజ్య భవన్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని

దిల్లీ: ఎగుమతులకు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఎగుమతిదార్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గురువారం ఇక్కడ కొత్త వాణిజ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని ప్రసంగించారు. ‘దేశాన్ని అభివృద్ధి చెందుతున్న స్థాయి, నుంచి అభివృద్ధి చెందిన స్థాయికి తీసుకెళ్లడంలో ఎగుమతులదే కీలక పాత్ర’ అని ప్రధాని అన్నారు. అంతర్జాతీయంగా అవరోధాలు ఎదురైనప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు (వస్తువులు, సేవలు కలిపి) 670 బిలియన్‌ డాలర్లుగా (రూ.50 లక్షల కోట్లు) నమోదయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. వాణిజ్య ఎగుమతులు లక్ష్యమైన 400 బిలియన్‌ డాలర్లను అధిగమించి 418 మిలియన్‌ డాలర్ల (రూ.31 లక్షల కోట్ల)కు చేరాయని అన్నారు. ‘గత సంవత్సరాల్లో సాధించిన విజయాల ప్రోత్సాహంతో ఎగుమతి లక్ష్యాలను రెట్టింపు చేసుకున్నాం. వాటిని సాధించే ప్రయత్నాలనూ రెట్టింపు చేశాం’ అని వివరించారు. వాణిజ్యం, వ్యాపారం, ఎంఎస్‌ఎమ్‌ఈ రంగాలతో సంబంధమున్న ప్రతి ఒక్కరికి వాణిజ్య భవన్‌ వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

నిర్యాట్‌ పోర్టల్‌ ఆవిష్కరణ: నిర్యాట్‌ (నేషనల్‌ ఇంపోర్ట్‌- ఎక్స్‌పోర్ట్‌ రికార్డ్‌ ఫర్‌ ఇయర్లీ అనాలసిస్‌ ఆఫ్‌ ట్రేడ్‌) పోర్టల్‌ను ప్రధాని ప్రారంభించారు. భారత విదేశీ వాణిజ్యానికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ‘దేశంలో కొత్త ప్రాంతాల నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. పత్తి, చేనేత  ఎగుమతులు 55 శాతం వృద్ధి చెందాయ’ని ఆయన తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఆస్ట్రేలియాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల తరహాలో మరిన్ని దేశాలతోనూ కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు చెప్పారు. దేశంలో మొబైల్‌ తయారీ యూనిట్‌ల సంఖ్య 200కి చేరిందని, ఫిన్‌టెక్‌ అంకురాలు  నాలుగేళ్లలో 500 నుంచి 2,300 చేరాయని వివరించారు. ‘ఏటా 8,000 అంకురాలను భారత్‌ గుర్తించేది. ఇప్పుడు ఆ సంఖ్య 15,000 కంటే ఎక్కువగానే ఉంటోంద’ని ప్రధాని తెలిపారు.

ఫాక్స్‌కాన్‌ విస్తరణ ప్రణాళికను స్వాగతిస్తున్నాం..: భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచాలన్న ఫాక్స్‌కాన్‌ ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. గురువారం ఆ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియుతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ‘సెమీ కండక్టర్లు సహా భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలన్న ఫాక్స్‌కాన్‌ ప్రణాళికను స్వాగతిస్తున్నామ’ని మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే యోచనలో ఫాక్స్‌కాన్‌ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని