నెక్సాన్‌ ఈవీలో మంటలు

ముంబయిలో నెక్సాన్‌ విద్యుత్‌ మోడల్‌ కారులో మంటలు రేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ గురువారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో టాటా మోటార్స్‌ స్పందించింది.

Published : 24 Jun 2022 03:33 IST

భద్రతకు కట్టుబడి ఉన్నాం: టాటా మోటార్స్‌

దిల్లీ: ముంబయిలో నెక్సాన్‌ విద్యుత్‌ మోడల్‌ కారులో మంటలు రేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ గురువారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో టాటా మోటార్స్‌ స్పందించింది. ‘ప్రస్తుతం ఈ విషయంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అందులో నిజనిజాలను నిగ్గుతేలుస్తాం. పూర్తి దర్యాప్తు వివరాలను త్వరలోనే పంచుకుంటాం. మా వాహనాలు, మా వినియోగదార్ల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామ’ని సంస్థ పేర్కొంది. ‘గత నాలుగేళలో దాదాపు 30,000కు పైగా ఈవీలు మొత్తం 10 కోట్ల కి.మీ. మేర ప్రయాణించాయి. అయితే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదేన’ని కంపెనీ పేర్కొంది. విద్యుత్‌ ద్విచక్ర వాహనాల్లో మంటలు రేగిన పలు ఉదంతాలు చోటు చేసుకోగా, ఓలా ఎలక్ట్రిక్‌, ఒకినవ ఆటోటెక్‌, ప్యూర్‌ఈవీ సంస్థలు కొన్ని స్కూటర్లను రీకాల్‌ సైతం చేశాయి.

స్వతంత్ర దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు: నెక్సాన్‌ ఈవీ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు గురువారం పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ(సీఎఫ్‌ఈఈఎస్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ), నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్‌), విశాఖపట్నంలను కోరినట్లు ఆ అధికారి తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా, పరిష్కార చర్యలనూ వీరు సూచించాల్సి ఉంటుందన్నారు.
ఈ నెలలో కమిటీ నివేదిక: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల్లో మంటలు రేగిన ఉదంతాలపై రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన నివేదికను ఈ నెలలో సమర్పించవచ్చని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. ఓలా స్కూటర్‌ పుణెలో దగ్ధమైన నేపథ్యంలో బ్యాటరీ ప్రమాణాలు, ధ్రువీకరణపై ఏప్రిల్‌లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కంపెనీల నిర్లక్ష్యం వెల్లడైతే, వాటిపై అపరాధ రుసుములు విధిస్తామని ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హెచ్చరించారు కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని