జిందాల్‌ పవర్‌ చేతికి సింహపురి ఎనర్జీ?

మధుకాన్‌ గ్రూపునకు చెందిన సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ను ఎన్‌సీఎల్‌టీ చేపట్టిన లిక్విడేషన్‌ ప్రక్రియ ద్వారా జిందాల్‌ పవర్‌ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహపురి పవర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో 600 మెగావాట్ల థర్మల్‌

Published : 24 Jun 2022 03:32 IST

రూ.300 కోట్లకు దక్కించుకునే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: మధుకాన్‌ గ్రూపునకు చెందిన సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ను ఎన్‌సీఎల్‌టీ చేపట్టిన లిక్విడేషన్‌ ప్రక్రియ ద్వారా జిందాల్‌ పవర్‌ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహపురి పవర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో 600 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఉంది. సొంత నిధులతో పాటు ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు.. తదితర 19 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.2,500 కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఈ ప్రాజెక్టును సింహపురి ఎనర్జీ నిర్మించింది. దిగుమతి చేసుకునే బొగ్గు ఉపయోగించి, విద్యుదుత్పత్తి చేసే పద్ధతిలో ఈ విద్యుత్తు ప్రాజెక్టును రూపొందించారు. కానీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ప్లాంటు ఎంతోకాలంగా మూతపడి ఉండటంతో, తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిని కంపెనీ యాజమాన్యం ఎదుర్కొంది. దీంతో బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీ ద్వారా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాయి. ఎన్‌సీఎల్‌టీ నియమించిన రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ వద్ద ఆయా సంస్థలు దాఖలు చేసిన క్లెయిముల ప్రకారం బ్యాంకులు, ఇతర  రుణదాతలకు సింహపురి ఎనర్జీ రూ.4,000 కోట్లకు పైగా బకాయి పడింది. దివాలా పరిష్కార ప్రక్రియకు పెద్దగా స్పందన రాకపోవడంతో, తదుపరి చర్యగా ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రతిపాదించింది. దీనికి జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన జిందాల్‌ పవర్‌ ముందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విద్యుత్తు ప్లాంటును లిక్విడేషన్‌ ప్రక్రియలో రూ.300 కోట్లకు కొనుగోలు చేయడానికి జిందాల్‌ పవర్‌ ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించేందుకు ఇతర సంస్థలు ముందుకు రాని పక్షంలో ఈ ప్రాజెక్టు జిందాల్‌ పవర్‌ సొంతం అయ్యే అవకాశం ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని