Published : 24 Jun 2022 03:30 IST

అంచనాల కంటే తక్కువగానే ఆదాయం

జూన్‌- ఆగస్టుపై యాక్సెంచర్‌

డాలరు బలపడటం వల్లే

దిల్లీ:  జూన్‌- ఆగస్టు త్రైమాసికంలో తమ ఆదాయం అంచనాల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌ అంచనా వేసింది. ఆగస్టు 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి (2021-22) లాభం అంచనాల్లోనూ మార్పులు చేసింది. యాక్సెంచర్‌ సెప్టెంబరు- ఆగస్టును ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుంది. నాలుగో త్రైమాసికంలో ఆదాయం 15 బి.డాలర్ల నుంచి 15.5 బిలియన్‌ డాలర్ల శ్రేణిలో నమోదుకావచ్చని కంపెనీ అంచనా వేసింది. విశ్లేషకుల అంచనా వేసిన 15.70 డాలర్ల కంటే ఇది తక్కువ. మే 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 16.16 బి.డాలర్లుగా నమోదైంది. అలాగే పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఒక్కో షేరుపై ఆర్జన 10.61 - 10.70 డాలర్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు 10.61- 10.81 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం, డాలరు బలపడటం వల్ల తమ విదేశీ వ్యాపారాల ఆదాయాలపై ప్రభావం పడుతుందని సంస్థ అభిప్రాయపడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్లను పెంచడం, కఠిన విధాన వైఖరి వైపు మొగ్గు చూపడం, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ఇతర కరెన్సీలతో పోలిస్తే ఇటీవల డాలరు విలువ గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. డాలరు బలపడటం వల్ల అమెరికా బయట కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల లాభాలపై ప్రభావం పడుతోంది. యాక్సెంచర్‌కు వచ్చే మొత్తం ఆదాయంలో సగం వరకు అమెరికా బయట నుంచే ఉంటుంది. అందువల్ల 2021-22లో తమ ఆదాయంపై విదేశీ మారకం రూపంలో 4.5 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. అంతకుముందు 3 శాతమే ప్రభావం ఉండొచ్చని భావించింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts