కార్లకు మన స్టార్‌ రేటింగ్‌

కొత్త కారు కొనేటపుడు ఎంత భద్రమైనదనే విషయాన్ని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. క్రాష్‌ టెస్ట్‌ ఆధారంగా ఆ వాహనాలకు వచ్చే స్టార్‌ రేటింగ్‌, ఈ విషయాన్ని వెల్లడిస్తాయి. ఇప్పటి వరకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, యూరో ఎన్‌క్యాప్‌ ప్రమాణాలే ఇందుకోసం ఉన్నాయి.

Published : 25 Jun 2022 03:16 IST

కొత్త భద్రతా ప్రమాణాల ప్రతిపాదన

‘భారత్‌ ఎన్‌క్యాప్‌’ ముసాయిదాకు ఆమోదం

దిల్లీ: కొత్త కారు కొనేటపుడు ఎంత భద్రమైనదనే విషయాన్ని ప్రతి ఒక్కరు చూసుకోవాలి. క్రాష్‌ టెస్ట్‌ ఆధారంగా ఆ వాహనాలకు వచ్చే స్టార్‌ రేటింగ్‌, ఈ విషయాన్ని వెల్లడిస్తాయి. ఇప్పటి వరకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, యూరో ఎన్‌క్యాప్‌ ప్రమాణాలే ఇందుకోసం ఉన్నాయి. తాజాగా ‘సరికొత్త కారు మదింపు పథకం’ అయిన ‘భారత్‌ ఎన్‌క్యాప్‌’ రేటింగ్‌ను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు. దీనిపై శుక్రవారం పలు ట్వీట్లు చేశారు. ‘భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(భారత్‌ ఎన్‌క్యాప్‌)ను వినియోగదార్ల కోసం తీసుకొస్తున్నాం. దీని వల్ల భారత్‌లో భద్రమైన వాహనాల తయారీ నిమిత్తం ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌(ఓఈఎమ్స్‌) మధ్య ఆరోగ్యకర పోటీ పెరుగుతుంద’ని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌ ఎన్‌క్యాప్‌ను ప్రవేశపెట్టడానికి ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపాను. క్రాష్‌ పరీక్షల్లో ఆయా కార్ల పనితీరు ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంద’ని ఆయన తెలిపారు.

ఎగుమతులు పెంచడానికీ..

క్రాష్‌ పరీక్షల ఆధారంగా ఇచ్చే ఈ స్టార్‌ రేటింగ్‌ వల్ల కార్లలోని ప్రయాణికుల భద్రతకు హామీనివ్వడమే కాకుండా.. భారత వాహనాల ఎగుమతి విలువనూ పెంచగలమని గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ క్రాష్‌ టెస్ట్‌ నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చిన భారత్‌ ఎన్‌క్యాప్‌ ప్రమాణాలను కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. భారత్‌లోని సొంత పరీక్షా కేంద్రాల్లో, కంపెనీలు తమ వాహనాలను పరీక్షించాల్సి ఉంటుందని గడ్కరీ అన్నారు. భారత్‌ ఎన్‌క్యాప్‌ మన వాహన పరిశ్రమలో ఆత్మనిర్భరతను తీసుకురావడమే కాకుండా.. ప్రపంచంలో భారత్‌ను అగ్రగామి వాహన కేంద్రంగా నిలబెట్టగలదని ఆయన అన్నారు. వాహనాలకు 1-5 వరకు స్టార్‌రేటింగ్‌ ఇస్తారు. 2020లో మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 1,31,714 మరణాలు సంభవించాయి. 2024 కల్లా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను 50 శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇటీవలే గడ్కరీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని