Published : 25 Jun 2022 03:16 IST

2 రోజుల్లో రూ.5 లక్షల కోట్ల లాభం

సమీక్ష

వరుసగా రెండో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వాహన, బ్యాంకింగ్‌, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు దక్కింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 1 పైసా తగ్గి తాజా కనిష్ఠమైన 78.33 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.11 శాతం పెరిగి 111.27 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

* మార్కెట్ల రికవరీ నేపథ్యంలో గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.5.06 లక్షల కోట్లు పెరిగి రూ.242.27 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌ ఉదయం 52,654.24 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 52,909.87 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 462.26 పాయింట్ల లాభంతో 52,727.98 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 142.60 పాయింట్లు పెరిగి 15,699.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,619.45- 15,749.25 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 1367 పాయింట్లు, నిఫ్టీ 405.75 పాయింట్ల చొప్పున లాభాలు నమోదుచేశాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 రాణించాయి. ఎం అండ్‌ ఎం 4.28%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.58%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.49%, హెచ్‌యూఎల్‌ 2.30%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.02%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.67%, రిలయన్స్‌ 1.47%, టాటా స్టీల్‌ 1.42%, నెస్లే 1.35%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.27% లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో 1.03% వరకు నష్టపోయాయి.  

* ఇన్‌స్టాల్‌ చేసిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2 గిగావాట్ల మైలురాయిని అధిగమించిందని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ ప్రకటించింది. కేరళలోని కాయంకుళంలో 92 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సౌరశక్తి కేంద్రం ప్రారంభంతో ఇది సాధ్యపడిందని తెలిపింది.

డిష్‌టీవీ ఎండీ రాజీనామా: డిష్‌ టీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జవహర్‌ గోయల్‌ పదవి నుంచి వైదొలిగారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం)లో గోయల్‌ పునర్నియామక ప్రతిపాదనను వాటాదార్లు తిరస్కరించడమే ఇందుకు కారణం. కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా గోయల్‌ కొనసాగనున్నారు.


ఒడుదొడుకుల నుంచి రూపాయిని రక్షిస్తాం: మైఖేల్‌ పాత్రా

రూపాయిని ఒడుదొడుకుల నుంచి కాపాడతామని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్రా పేర్కొన్నారు. రూపాయి మారకపు విలువను నిర్దేశిత స్థాయిలో ఉంచాలని భావించడం లేదని, అయితే భారీ హెచ్చుతగ్గులకు లోనవ్వకుండా, స్థిరంగా ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లలో రూపాయి క్షీణత తక్కువగానే ఉందని వెల్లడించారు. దేశ ఫారెక్స్‌ నిల్వలు 600 బిలియన్‌ డాలర్లకు చేరడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఇటీవలి పరిణామాల ఫలితంగా ఇప్పుడు 590 బిలియన్‌ డాలర్ల మేర ఫారెక్స్‌ నిల్వలున్నాయని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని