చక్కెర ధరలకు ఇబ్బంది లేదు

ఈ చక్కెర సీజనులో భారత్‌ రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేయనుంది. అయితే ధరలపై మాత్రం దీని ప్రభావం పడదని పరిశ్రమ అంటోంది. మిల్లు ధర కిలోకు రూ.32 దరిదాపుల్లో స్థిరంగానే ఉంటుందని జాతీయ చక్కెర సహకార మిల్లుల సమాఖ్య(ఎన్‌ఎప్‌సీఎస్‌ఎఫ్‌) మేనేజింగ్‌

Updated : 26 Jun 2022 06:57 IST

రికార్డు ఉత్పత్తి ప్రభావం ఉండదు

కిలో రూ.31 కంటే తగ్గదు

గిరాకీ తగ్గకపోవచ్చు

ఎథనాల్‌ బ్లెండింగ్‌ లక్ష్యం సాధ్యమే

ఇంటర్వ్యూ

ఈ చక్కెర సీజనులో భారత్‌ రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేయనుంది. అయితే ధరలపై మాత్రం దీని ప్రభావం పడదని పరిశ్రమ అంటోంది. మిల్లు ధర కిలోకు రూ.32 దరిదాపుల్లో స్థిరంగానే ఉంటుందని జాతీయ చక్కెర సహకార మిల్లుల సమాఖ్య(ఎన్‌ఎప్‌సీఎస్‌ఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) ప్రకాశ్‌ నైక్నావరే పేర్కొన్నారు. ఎగుమతులకు గిరాకీ ఉండడం, ఎథనాల్‌ తయారీ వైపు చెరకు మళ్లడం వంటి కారణాల వల్ల ధర పడిపోదని వార్తా సంస్థ ఇన్ఫామిస్ట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. దేశీయ చక్కెర ధరలు, గిరాకీ, ఉత్పత్తి, ఎగుమతులు, కొత్త వంగడాలు, ఎథనాల్‌ బ్లెండింగ్‌ తదితరాలపైనా ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు..


 

సమీప భవిష్యత్‌లో దేశీయ చక్కెర ధరలు ఎలా ఉంటాయంటారు.

జ: చక్కెర ఉత్పత్తి పాత రికార్డులన్నీ తుడిచేసింది. అయితే దేశీయ ధరలు మాత్రం పడిపోలేదు. 9.8 మిలియన్‌ టన్నుల ఎగుమతి కాంట్రాక్టులు; ఎథనాల్‌కు చెరకు మళ్లింపు ఇందుకు ప్రధాన కారణాలు. నిల్వల నుంచి 13.5 మిలియన్‌ టన్నులను బయటకు తీస్తే పరిశ్రమకు మంచి ఉపయోగం ఉటుంది. నిల్వ స్థాయి తగ్గినపుడు నగదు ప్రవాహం మెరుగుపడుతుంది. తద్వారా చెరకు బకాయి చెల్లింపులు సమయానికి జరుగుతాయి. రాబోయే రోజుల్లో దేశీయ ధరలు కిలోకు రూ.32 దరిదాపుల్లోనే ఉండనున్నాయి. కనీస విక్రయ ధర రూ.31 కంటే దిగువకు రాదు. పండుగ సీజను కూడా రాబోతుండడం ఇందుకు ఉపకరిస్తుంది.

కొన్నేళ్లపాటు వినియోగం స్తబ్దుగా ఉంది. ఈ సీజనులో మాత్రం 27 మి. టన్నులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. గిరాకీకి ఏవి ఉపకరించవచ్చు.

ఏ ఏడాదికాఏడాది వినియోగ వృద్ధిలో భారత్‌ ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. కరోనా సమయంలో వృద్ధి 4 శాతం నుంచి 0.5 శాతానికి పడిపోయింది. కొన్ని సార్లు మైనస్‌కూ వెళ్లేలా కనిపించింది. అయితే ఆంక్షల ఎత్తివేత మొదలైన తర్వాత పరిశ్రమ, ప్రధాన కొనుగోలుదార్లు చక్కెర కొనుగోలుకు ముందుకొచ్చారు. కార్మికులు ఇళ్లకు వెళ్లడంతో పరిశ్రమల మూతపడిన సమయంలో వారు చక్కెరను కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది 27.8 మిలియన్‌ టన్నులను అధిగమించింది. రాబోయే ఏళ్లలోనూ 27 మి. టన్నులకు పైగానే ఉండొచ్చు.

క్రషింగ్‌ సీజను పూర్తవుతోంది. 2022-23 చక్కెర ఉత్పత్తిపై మీ అభిప్రాయం ఏమిటి.

వచ్చే ఉత్పత్తి సీజనులో 33 మిలియన్‌ టన్నుల చెరకు పండించొచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో ఉత్పత్తి మారకపోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఉత్పత్తి తగ్గవచ్చు. అక్కడే పదేళ్లుగా ఒకటే వంగడం(సీఓ 0238) పండిస్తుండడం ఇందుకు కారణం. ఇపుడు అందరూ మేలుకున్నారు. చాలా వంగడాల వైపు దృష్టి సారిస్తున్నారు.

ఇపుడు రైతులు ఏ కొత్త వంగడాల వైపు చూస్తున్నారు.

మహారాష్ట్రలో సీఓ 86032 వంగడం గత 24 ఏళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది. వసంతదాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2-3 వంగడాలను సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌ తరహా పరిస్థితులు తలెత్తుతాయని అనుకోను. అయితే ఏమీ చెప్పలేం. ఒక్క పురుగుదాడి జరిగితే మొత్తం నాశనమే.

చక్కెర ఎగుమతులపై విధించిన షరతులపై మీ అభిప్రాయం ఏమిటి. మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉండొచ్చు.

మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం ఉండబోదు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్‌ కాస్త ముందుకు వెళ్లేందుకు ఇది సహాయపడింది. దేశీయ ధరలపై మాత్రం ఎటువంటి ప్రభావం లేదు. ఉత్పత్తి పెరుగుతుండడంతో అదనంగా 1 మిలియన్‌ టన్నుల ఎగుమతి ఆర్డర్ల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సమయంలో ఉన్న ఉత్పత్తి కంటే ఇపుడు ఎక్కువగా ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఎథనాల్‌ బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌ను అయిదేళ్లపాటు ప్రభుత్వం పొడిగించింది. లక్ష్యం సాధించడం సాధ్యమేనా.

కొన్ని ఇబ్బందులున్నా.. కష్టసాధ్యమైతే కాదు. పొడిగించడం చాలా మంచి నిర్ణయం. ఇది ప్రతి ఒక్కరిపైనా ఒత్తిడి పెంచగలదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంది. వచ్చే సీజనుకు కొంత ధర సవరణను అంచనా వేస్తున్నాం. అదే జరిగితే ఎథనాల్‌ ధరలూ పెరుగుతాయి. కాబట్టి ఇది సాధ్యమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని