Updated : 26 Jun 2022 06:59 IST

వర్షాకాలంలో ఏసీ ధరల ఉక్కబోత!

జులైలో ధరలు 7- 10%  పెరిగే అవకాశం

కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనల అమలు వల్లే

మీరు ఈ వేసవిలో ఏసీ కొన్నారా..? అది కూడా 5 స్టారా రేటింగా? అయితే వచ్చే నెల నుంచి దాని రేటింగ్‌ను 4 స్టార్‌ అనే అనుకోవాల్సి ఉంటుంది. కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు అమల్లోకి వస్తుండటమే ఇందుకు కారణం. దీని ప్రకారం.. ప్రస్తుతమున్న ఏసీల రేటింగ్‌ ఒక మెట్టు కిందకు దిగుతుంది. అంటే 5 స్టార్‌ నుంచి 4 స్టార్‌కు, 4 స్టార్‌ నుంచి 3 స్టార్‌కు రేటింగ్‌ తగ్గుతుందన్నమాట. ఇక 5 స్టార్‌ రేటింగ్‌ లభించాలంటే... మరింత ఇంధన సామర్థ్య ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దీనివల్ల ఏసీ తయారీ కంపెనీలకు తయారీ వ్యయం మరింత పెరగనుంది. ఆ భారాన్ని తిరిగి అవి వినియోగదారులకే బదిలీ చేస్తుండటంతో వచ్చే నెల నుంచి ఏసీల ధరలు 7-10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకారంగా చూస్తే ఏసీల ధరలు వినియోగదారులకు వర్షాకాలంలోనూ ఉక్కపోత పెట్టించనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఉన్న ఏసీ నిల్వలను వదిలించుకోవడానికి మరో ఆరు నెలల సమయం ఇవ్వాల్సిందిగా కంపెనీలు కోరాయి. దీంతో గడువును జులైకి ప్రభుత్వం పొడిగించింది.

ఇంధన సామర్థ్యం 20% పెరుగుతుంది..

ఏసీలకు విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే వీటి ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయని ఏసీల పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలతో ఏసీల ఇంధన సామర్థ్యం 20 శాతం మేర పెరుగుతుందని అంటున్నాయి. అదే సమయంలో ఈ నిబంధనలకు అనుగుణంగా ఏసీలను తయారు చేసేందుకు ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.2000- 2,500 ఖర్చు ఎక్కువగా అవుతుందని చెబుతున్నాయి. అయితే ధర పెరిగినప్పటికీ...అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో కూడిన ఏసీ వినియోగదారుడికి లభిస్తుందని పంజ్‌లాయిడ్‌ విక్రయాల విభాగ అధిపతి రాజేశ్‌ రాఠి అంటున్నారు. ఈ కొత్త నిబంధనలతో భారత ఇంధన నిబంధనలు ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలుస్తాయని తెలిపారు.

త్వరలో రిఫ్రిజరేటర్లకూ...

ఏసీల తర్వాత రిఫ్రిజరేట్లకూ కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలను వర్తింపచేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వీటికి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. అయితే రేటింగ్‌ నిబంధనల్లో మార్పు కారణంగా.. 4 స్టార్‌, 5 స్టార్‌ లాంటి అధిక ఇంధన రేటింగ్‌ రిఫ్రిజరేటర్ల తయారీ కష్టంగా మారుతుందని, ఖర్చు కూడా గణనీయంగా పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. కంపెనీలు వెలిబుచ్చిన ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? లేదంటే అనుకున్న ప్రకారమే నిబంధనల అమలుకు మొగ్గు చూపుతుందా? అనే విషయం తెలియాలంటే వచ్చే జనవరి వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఏసీలకు కూడా మళ్లీ 2025లో ఇంధన రేటింగ్‌ నిబంధనలు మారుతాయి. ఇక వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రేటింగ్‌ నిబంధనలతో పాత సాంకేతికత, ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ ఏసీల వాడటం బాగా తగ్గిపోతుందని తయారీదార్లు అభిప్రాయపడుతున్నారు. ఇన్వర్టర్‌ ఏసీల ధరలతో పోలిస్తే ఈ తరహా ఏసీల ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని