సెయిల్‌ మాజీ ఛైర్మన్‌ వి.కృష్ణమూర్తి మృతి

ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, గ్యాస్‌ సంస్థ గెయిల్‌తో పాటు పాటు మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (ప్రస్తుతం మారుతీ సుజుకీ ఇండియా) ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ వెంకటరామన్‌ కృష్ణమూర్తి (97)

Published : 27 Jun 2022 03:24 IST

దిల్లీ: ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, గ్యాస్‌ సంస్థ గెయిల్‌తో పాటు పాటు మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (ప్రస్తుతం మారుతీ సుజుకీ ఇండియా) ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ వెంకటరామన్‌ కృష్ణమూర్తి (97) ఆదివారం చెన్నైలో మరణించారు. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత అయిన వి.కృష్ణమూర్తి తన నివాసంలోనే కాలం చేశారని, ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని, ఆయన సన్నిహితులు తెలిపారు. దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ, అత్యధిక లాభాలు ఆర్జించే సంస్థలుగా తీర్చిదిద్దిన కృష్ణమూర్తిని పబ్లిక్‌ సెక్టార్‌రంగ పితామహునిగా అభివర్ణిస్తారు.మారుతీ 800 కారుని భారత్‌లో ఆయనే ప్రవేశపెట్టారు. మాజీ సివిల్‌ సర్వెంట్‌ అయిన కృష్ణమూర్తి ఐఐఎం బెంగళూరు-అహ్మదాబాద్‌, ఐఐటీ దిల్లీ, భవనేశ్వర్‌లోని గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తమ సంస్థ మాజీ ఛైర్మన్‌ మృతిపై సెయిల్‌ తీవ్ర సంతాపం ప్రకటించింది. మారుతీ వ్యవస్థాపక ఛైర్మన్‌ అయిన కృష్ణమూర్తి ఎంతో ముందు చూపున్న దార్శనికులని, జపాన్‌ తరహా పనితీరును దేశీయంగా మారుతీ కంపెనీలో ఆయన ప్రవేశపెట్టారని.. ఆయన కారణంగానే తాను కూడా సివిల్‌ సర్వీసెస్‌ నుంచి పారిశ్రామిక రంగానికి వచ్చానని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు. తన వృత్తిజీవితం ప్రారంభం నుంచి ఇప్పటివరకు కృష్ణమూర్తి మెంటార్‌గా ఉంటూ, తమ కంపెనీ ఉన్నతికి ఎంతో సహకరించారని పేర్కొంటూ, ఆయన మృతికి టీవీఎస్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని