Published : 27 Jun 2022 03:24 IST

53400 54400 శ్రేణిలో నిరోధం!

సమీక్ష: దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, కమొడిటీ ధరలు చల్లబడటం మార్కెట్లకు ఉపశమనాన్ని ఇచ్చాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి రికార్డు కనిష్ఠానికి చేరడం మాత్రం కలవరపెట్టాయి. జులై 6 కల్లా రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 2021-22 నాలుగో త్రైమాసికంలో కరెంటు ఖాతాలోటు 13.4 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. నికర ఎఫ్‌డీఐలు 13.8 బి.డాలర్లకు పెరిగాయి. 2022-23లో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.3.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర కాస్త తగ్గి 113 డాలర్లకు చేరింది. అమెరికా మాంద్యం భయాలు, సరఫరా సమస్యలు ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 78.39 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకి, 78.22 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. ద్రవ్యోల్బణం నియంత్రణకు అవసరమైతే వడ్డీ రేట్ల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తామని అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేశారు. బ్రిటన్‌ ద్రవ్యోల్బణం మేలో 40 ఏళ్ల గరిష్ఠమైన 9.1 శాతానికి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత వారం సెన్సెక్స్‌ 2.7 శాతం లాభంతో 52,728 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.7 శాతం పెరిగి 15,699 పాయింట్ల దగ్గర స్థిరపడింది. వాహన, మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించాయి. లోహ, యంత్ర పరికరాలు, చమురు-గ్యాస్‌ స్క్రిప్‌లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.11,512 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.11,671 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుంచి రూ.45,841 కోట్లు వెనక్కి తీసుకున్నారు. 2022లో ఎఫ్‌పీఐ అమ్మకాలు మొత్తంగా రూ.2.13 లక్షల కోట్లకు చేరాయి.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:2గా నమోదు కావడం..
దిగువ స్థాయుల్లో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్‌ 50,900 పాయింట్ల వద్ద మద్దతు తీసుకుని లాభాల్లో ముగిసింది. ప్రస్తుత రికవరీకి 53,400-54,400 పాయింట్ల శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు. మరోవైపు సూచీకి 51,600 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది.

ప్రభావిత అంశాలు: జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనుండటంతో సూచీలు ఒడుదొడుకుల మధ్య కదలాడే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఆయా రంగాల కంపెనీలపై ప్రభావం చూపొచ్చు. రుతుపవనాల పురోగతి కీలకం కానుంది. వర్షపాతం ఆశాజనకంగా ఉంటే సెంటిమెంట్‌ మెరుగుపడుతుంది. మే ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. జూన్‌ టోకు సరఫరాల వివరాలు ప్రకటించనుండటంతో వాహన షేర్లు వెలుగులోకి రావొచ్చు. కార్పొరేట్‌ వార్తల ఆధారంగా షేరు/రంగం ఆధారిత కదిలికలుంటాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపైనా కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామిక లాభాలు, జూన్‌ యూరోజోన్‌ ఎకనామిక్‌ సెంటిమెంట్‌, ఎస్‌ అండ్‌ పీ తయారీ పీఎంఐ, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌ గణాంకాలు విడుదల కానున్నాయి.

తక్షణ మద్దతు స్థాయులు: 52,260, 51,632, 50,800
తక్షణ నిరోధ స్థాయులు: 53,207, 53,750, 54,303
సెన్సెక్స్‌కు 53,400- 54,400 శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని