Published : 28 Jun 2022 03:05 IST

రెండు వారాల గరిష్ఠానికి సూచీలు

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో మూడో ట్రేడింగ్‌ రోజూ సూచీలు పరుగులు తీశాయి. యంత్ర పరికరాలు, ఐటీ సహా అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 2 వారాల గరిష్ఠానికి చేరాయి. గత 3 ట్రేడింగ్‌ రోజుల్లో కలిపి సెన్సెక్స్‌ 1378 పాయింట్లు, నిఫ్టీ 418 పాయింట్లు రాణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి తాజా కనిష్ఠమైన 78.37 వద్ద ముగిసింది.  
సెన్సెక్స్‌ ఉదయం 53,468.89 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగిన సూచీ.. ఒకదశలో 53,509.50 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 433.30 పాయింట్ల లాభంతో 53,161.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 132.80 పాయింట్లు పెరిగి 15,832.05 దగ్గర స్థిరపడింది. జూన్‌ 10 తర్వాత సెన్సెక్స్‌, నిఫ్టీలకు ఇదే గరిష్ఠ ముగింపు.

* బ్లింక్‌ కామర్స్‌ను రూ.4447.48 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో జొమాటో షేరు డీలాపడింది. ఇంట్రాడేలో 7.53% పడ్డ షేరు రూ.65.05 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 6.40% నష్టంతో రూ.65.85 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభపడ్డాయి. ఎల్‌ అండ్‌ టీ 2.69%, టెక్‌ మహీంద్రా 2.67%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.61%, ఇన్ఫోసిస్‌ 2.25%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.19%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌       2.08%, ఎయిర్‌టెల్‌ 2%, టాటా స్టీల్‌ 1.75%, అల్ట్రాటెక్‌ 1.65%, ఎస్‌బీఐ 1.51% చొప్పున రాణించాయి. కోటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ స్వల్పంగా తగ్గాయి.

* అల్ట్రాఫ్రెష్‌ మాడ్యులర్‌ సొల్యూషన్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్‌ తెలిపింది. మాడ్యులర్‌ కిచెన్‌ పరికరాల విభాగంలో కంపెనీ విస్తరించడానికి ఈ కొనుగోలు దోహదపడనుంది.

* జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగును బీఏ2 నుంచి బీఏ1కు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పెంచింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పెరియామా హోల్డింగ్స్‌ భవిష్యత్‌ అంచనాను ‘సానుకూలం’ నుంచి ‘స్థిరత్వం’కు మార్చింది.

* రాబోయే 12-18 నెలల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ బలమైన మార్కెట్‌ విలువను కొనసాగిస్తుందని, ఆస్తుల నాణ్యతా మెరుగవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఆ బ్యాంకుకు ‘స్థిర’ అంచనాతో ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగించింది.  

* సంస్థ ఆర్థిక మూలాలు బలంగా ఉంటాయనే ఆశాభావంతో, గెయిల్‌ ఇండియాకు ‘స్థిర’ అంచనాతో ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ వెల్లడించింది.  

బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల బైబ్యాక్‌: రూ.2,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌కు వాహన సంస్థ బజాజ్‌ ఆటో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.4,600కు మించకుండా వాటాదార్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నామని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. కంపెనీ మొత్తం పెయిడప్‌ షేరు క్యాపిటల్‌లో ఇది 9.61 శాతానికి సమానం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని