డాలరు రూ.80కి చేరొచ్చు

రూపాయిపై ఒత్తిడి కొనసాగనుంది. ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు అధికంగా ఉండటం, దిగుమతుల కోసం డాలర్‌ రూపేణ వెచ్చించాల్సి రావడం ఇందుకు కారణం. అందువల్ల సమీప కాలంలో డాలరు విలువ రూ.79-80 కి వెళ్లొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 28 Jun 2022 03:04 IST

విశ్లేషకుల అంచనా

ముడి చమురు, ఇతర కమొడిటీల వల్లే

దిల్లీ

రూపాయిపై ఒత్తిడి కొనసాగనుంది. ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు అధికంగా ఉండటం, దిగుమతుల కోసం డాలర్‌ రూపేణ వెచ్చించాల్సి రావడం ఇందుకు కారణం. అందువల్ల సమీప కాలంలో డాలరు విలువ రూ.79-80 కి వెళ్లొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్‌ పెసో, థాయ్‌ బాత్‌ తర్వాత రూపాయే ఇటీవలి కాలంలో అత్యంత అధ్వాన పనితీరు కనబరచినట్లయ్యింది.

ఈ ఏడాది 5% క్షీణత: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దశాబ్దకాల గరిష్ఠాలకు చేరాయి. ఫలితంగా ఈ ఏడాది రూపాయి విలువ 5 శాతం క్షీణించి, తాజాగా డాలర్‌తో పోలిస్తే 78.34 స్థాయికి చేరింది.

ఇవీ కారణాలు..

* ముడి చమురు అవసరాల్లో 85 శాతం, గ్యాస్‌ అవసరాల్లో 50 శాతం దిగుమతులే తీరుస్తున్నాయ్‌.   మేలో మన చమురు దిగుమతి బిల్లు రెట్టింపునకు పైగా పెరిగి 19.19 బిలియన్‌ డాలర్లకు చేరింది.  

* విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు మరింత అధ్వానంగా మారితే ఎఫ్‌పీఐల ఉపసంహరణ జీడీపీలో 3.2 శాతం లేదా 100 బి. డాలర్ల మేర ఏటా ఉడొచ్చని ఆర్‌బీఐ తాజా బులిటెన్‌ చెబుతోంది. మరిన్ని అనిశ్చితులు తలెత్తితే జీడీపీలో అవి 7.7 శాతానికి చేరినా ఆశ్చర్యం లేదని అంచనా వేస్తోంది.

* 2022లోనే ఎఫ్‌పీఐలు నికరంగా 28.48 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు ఉపసంహరించారు.  

ఎందాకా పతనం అంటే..: ‘భారత దిగుమతుల విలువ పెరుగుతుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్‌ఐఐలు) బయటకు వెళుతుండడంతో డాలరుకు గిరాకీ పెరుగుతోంది. రూపాయి మారకపు రేటు డాలరుతో పోలిస్తే 77.5-79.5 మధ్య చలించొచ్చని.. చమురు, ఇతర కమొడిటీల ధరల చలనాలను బట్టి ఇది మారొచ్చ’ని పీడబ్ల్యూసీ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘కేంద్ర బ్యాంకుల కఠిన వైఖరి వల్ల గిరాకీ తగ్గొచ్చు. రష్యా నుంచి చౌక చమురు వచ్చినా ధరలు తగ్గే అవకాశం ఉంద’ని అన్నారు. ‘యూఎస్‌ ఫెడ్‌ పరపతి విధానాన్ని కఠినతం చేరడం వల్ల డాలరు మరింత బలపడొచ్చు. ఇది రూపాయి క్షీణతకు కారణం కావొచ్చు. ద్వితీయార్థం(2022-23)లో డాలర్‌ విలువ రూ. 77-80 మధ్య కదలాడవచ్చ’ని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ సైతం రూపాయి 79.50 వద్ద స్థిరీకరణకు గురికావొచ్చని విశ్వసిస్తున్నామన్నారు. ద్రవ్యోల్బణం ఇలానే కొనసాగితే, వచ్చే కొద్ది త్రైమాసికాల్లో రూపాయి విలువ 80 స్థాయికి బలహీనపడొచ్చని భావిస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌సర్వీసెస్‌ ఫారెక్స్‌, బులియన్‌ విశ్లేషకులు గౌరంగ్‌ సోమయ్యా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని