Published : 28 Jun 2022 03:04 IST

సంక్షిప్త వార్తలు

రెనోవిస్‌ ల్యాబ్స్‌తో ఇన్‌కార్‌ గ్రూపు భాగస్వామ్యం

‘ఇన్‌కార్‌ రెనోవిస్‌’ అనే సంయుక్త సంస్థ ఏర్పాటు  

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య సేవల రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కార్‌ గ్రూపు, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జావేద్‌ ఇగ్బాల్‌కు చెందిన రెనోవిస్‌ ల్యాబ్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ‘ఇన్‌కార్‌ రెనోవిస్‌’ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు  చేస్తారు. ఈ కొత్త సంస్థ ఆరోగ్య సేవలు, జంతు వైద్యం, వ్యవసాయ రంగాలకు అనువైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ‘ఔషధ రంగంలో ముఖ్యంగా ముడిపదార్థాల విభాగంలో మనదేశం స్వయం సమృద్ధి సాధించాలని, ఇతర దేశాలపై ఆధారపడకూడదని భావిస్తున్నాం. ఆ దిశగా ఏపీఐ ఔషధాలు, కేఎస్‌ఎం (కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌) ఉత్పత్తి చేస్తామ’ని ప్రొఫెసర్‌ జావేద్‌ ఇగ్బాల్‌ పేర్కొన్నారు. ఇన్‌కార్‌ రెనోవిస్‌కు జావేద్‌ ఇగ్బాల్‌ సీఈఓగా వ్యవహరిస్తారు.


వృద్ధి రికవరీ సంకేతాలున్నాయ్‌

దిగ్గజ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబయి: అంతర్జాతీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిర వృద్ధి నమోదుచేసేలా రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని దిగ్గజ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 22వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదార్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ వినియోగం పెరుగుతున్నందున, దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని తెలిపారు. చమురేతర, పసిడియేతర దిగుమతుల్లో అధిక వృద్ధి, దేశీయ గిరాకీ, వినియోగదారు వ్యయాలు పెరగడాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచనాలతో గ్రామీణ వినియోగం ఆశాజనకంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, కమొడిటీ ధరలు దూసుకెళ్లడం, సరఫరా ఇబ్బందులు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ, అధిక ద్రవ్యోల్బణం, పలు దేశాల వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రభావాల నుంచి మనం నిలకడగా ఉన్నట్లు వివరించారు. కొవిడ్‌-19 సంక్షోభంలోనూ జీవిత బీమా కంపెనీ కొత్త వ్యాపార ప్రీమియం 2021-22లో 16 శాతం వృద్ధి చెందిందని గుర్తుచేశారు.


వేగన్‌ ఆహారాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు

దిల్లీ: నకిలీ వేగన్‌ ఆహారాల విక్రయాలను నిరోధించేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలు రూపొందించింది. ఇటువంటి ఆహార వస్తువుల తయారీ, విక్రయం, దిగుమతి చేసుకునేందుకు పలు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరులు ముసాయిదా నిబంధనలు విడుదల చేయగా, ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను పరిశీలించిన తర్వాత తాజాగా ఆహార భద్రత, ప్రమాణాలు (వేగన్‌ ఆహారాలు) నిబంధనలు 2022ను తీసుకొచ్చింది. జంతు సంబంధిత ముడిపదార్థాలను వినియోగించని ఆహారం, ఆహార పదార్థాలను వేగన్‌గా పరిగణిస్తారని, ఇవి తయారు చేసే ఏ దశలోనూ జంతు సంబంధ పదార్థాలు వినియోగించరాదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. వేగన్‌ ఫుడ్‌ ప్యాకెట్లపై తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువీకరించిన లోగో ఉండాలి. పదార్థాల తయారీ నుంచి వినియోగదారులకు చేరే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేగన్‌ ఏతర పదార్థాలు జతవ్వకూడదు.

* పళ్లు, కూరగాయలు, బఠానీల వంటివి, విత్తనాలు, బ్రెడ్‌, బియ్యం, పాస్తా, వంటనూనెలతో పాటు డెయిరీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా లభించే సోయా-కొబ్బరి-బాదం పాల వంటి వాటితో ఈ పదార్థాలు తయారు చేస్తారు.


ఎలక్ట్రానిక్స్‌ తయారీకి రూ.86,824 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ తయారీ కోసం రూ.86,824 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన 314 దరఖాస్తులను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సవరించిన ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పథకం(ఎమ్‌-ఎస్‌ఐపీఎస్‌) కింద 2022 మే 31 వరకు వీటికి అనుమతిచ్చినట్లు ఒక అధికారిక ఉత్తర్వు తెలిపింది. బాష్‌ ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి వచ్చిన రూ.596 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన కూడా మే నెలలో ఆమోదం పొందిన వాటిలో ఉంది. 2022 మే 31 నాటికి రూ.89,232 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 320 దరఖాస్తులు రాగా అందులో 314 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అదే సమయంలో రూ.1774.47 కోట్ల ప్రోత్సాహకాలను 114 దరఖాస్తుదార్లకు పంపిణీ చేసినట్లు వివరించింది. ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలకు ఊతమిచ్చేందుకు వచ్చిన తొలి పథకమే ఈ ఎమ్‌-ఎస్‌ఐపీఎస్‌. శాంసంగ్‌, ఎల్‌జీ, బాష్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌, టాటా పవర్‌ ఎస్‌ఈడీ, నిడెక్‌ ఇండియా, నిప్పన్‌ ఆడియోట్రానిక్స్‌, కాంటినెంటల్‌ ఆటోమోటివ్‌, జీజీ బీఈ, విప్రో జీఈ హెల్త్‌కేర్‌లు దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో ఉన్నాయి.


10 రోజుల్లోనే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల క్లెయిముల పరిష్కారం: ఐసీఐసీఐ లాంబార్డ్‌

దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు చెందిన రూ.5 లక్షల వరకు అర్హత ఉన్న క్లెయిములను, సర్వే పూర్తి చేసిన 10 రోజుల్లోనే పరిష్కరించనున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ దినోత్సవం (జూన్‌ 27) సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, అంకురాలకు వేగవంతమైన క్లెయిము పరిష్కారాన్ని తీసుకురావడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. 2022 మార్చి 31 నాటికి ఐసీఐసీఐ లాంబార్డ్‌ 15 లక్షల వరకు పాలసీలను ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు విక్రయించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని