Published : 29 Jun 2022 03:07 IST

ఆకాశ్‌కు జియోభిషేకం

బోర్డుకు ముకేశ్‌ అంబానీ రాజీనామా

కుమారుడికి టెలికాం సంస్థ ఛైర్మన్‌ బాధ్యతలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యాపార సామ్రాజ్యంలో మూడోతరం పాలనా పగ్గాలు చేపట్టే ప్రక్రియకు  ముందడుగు పడింది. 217 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్ల) విలువైన గ్రూప్‌లో, నాయకత్వ వారసత్వ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే దిశగా ముకేశ్‌ అంబానీ కీలక అడుగేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. ప్రస్తుతం రిలయన్స్‌ జియో బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఆకాశ్‌ ఉన్నారు. ‘రిలయన్స్‌ జియో డైరెక్టర్ల బోర్డుకు ఛైర్మన్‌గా ఆకాశ్‌ ఎం అంబానీని నియమించే ప్రతిపాదనకు ఈనెల 27న జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింద’ని ఎక్స్ఛేంజీలకు కంపెనీ మంగళవారం తెలిపింది. జూన్‌ 27 పని వేళల ముగింపు నుంచి వర్తించేలా, జియో బోర్డు డైరెక్టర్‌ పదవికి ముకేశ్‌ అంబానీ రాజీనామా సమర్పించాక, ఈ పరిణామం చోటుచేసుకుంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమైన స్వచ్ఛ ఇంధన వ్యాపారంపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దృష్టి కేంద్రీకరిస్తున్న తరుణంలో, నాయకత్వ వారసత్వ బదిలీ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.  

రిటైల్‌.. కుమార్తెకేనా

ముకేశ్‌ అంబానీ, నీతా దంపతులకు ఇద్దరు కుమారులు ఆకాశ్‌ (30), అనంత్‌ (26), ఒక కుమార్తె ఈశా (30) ఉన్నారు. సూపర్‌ మార్కెట్లు నిర్వహించే రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), టెలికాం సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) బోర్డుల్లో 2014 నుంచి డైరెక్టర్లుగా ఆకాశ్‌, ఈశా ఉన్నారు. అనంత్‌ను ఇటీవలే ఆర్‌ఆర్‌వీఎల్‌ బోర్డు డైరెక్టరుగా చేశారు. 2020 మే నుంచి జేపీఎల్‌ బోర్డులో డైరెక్లరుగా అనంత్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త తరం కంపెనీలైన రిటైల్‌, టెలికాం వ్యాపార విభాగాల్లో ఆకాశ్‌, ఈశా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్‌, చమురు, రసాయనాల విభాగాలను డైరెక్టరుగా అనంత్‌ పర్యవేక్షిస్తున్నారు.

* రిలయన్స్‌ జియో సారథ్య బాధ్యతలు ఆకాశ్‌కు అప్పగించడంతో.. ఈశా, అనంత్‌ల చేతికి ఏయే వ్యాపారాలు వెళ్తాయనే ఆసక్తి నెలకొంది. రిటైల్‌ వ్యాపారాన్ని ఈశాకు అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ఈమె ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకున్నారు. పిరమాల్‌ గ్రూపు అధినేత అజయ్‌, స్వాతి పిరమాల్‌ల కుమారుడే ఆనంద్‌.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా ముకేశ్‌ అంబానీ కొనసాగుతారు. ముకేశ్‌ భార్య నీతా కూడా రిలయన్స్‌ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు. జియో డిజిటల్‌ సేవల బ్రాండ్ల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గానూ ముకేశ్‌ కొనసాగనున్నారు.

సాఫీగా బాధ్యతల బదిలీ..

తండ్రి ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం ముకేశ్‌, అనిల్‌ అంబానీల మధ్య ఆస్తుల తగువు చోటుచేసుకుంది. తల్లి కోకిలా బెన్‌ సమక్షంలో అన్నదమ్ములు గ్రూప్‌ వ్యాపారాలను పంచుకున్నారు. తన పిల్లల మధ్య ఇలాంటి విభేదాలు రాకుండా ఉండాలని, వారసత్వ ప్రణాళికల విషయంలో ముకేశ్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ్రూపు కంపెనీల సారథ్య బాధ్యతల బదిలీ ప్రక్రియ సాఫీగా జరగాలనే కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు.

నాన్న జయంతి రోజున..

ధీరూభాయ్‌ అంబానీ జయంతి సందర్భంగా గతేడాది డిసెంబరు 28న జరిగిన రిలయన్స్‌ ఫ్యామిలీ డే కార్యక్రమంలో వారసత్వ ప్రణాళికలపై ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. నాయకత్వ బదిలీ ప్రక్రియ దిశగా రిలయన్స్‌ అడుగులు వేస్తోందని నాడు ముకేశ్‌ తెలిపారు. 2021 జూన్‌లో జరిగిన ఏజీఎంలోనూ ‘రిలయన్స్‌కు తదుపరి తరం నాయకులైన ఈశా, ఆకాశ్‌, అనంత్‌లు గ్రూపునకు మరింత వన్నె తెస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవ’ని ముకేశ్‌ అన్నారు.  

ఎండీగా పంకజ్‌ మోహన్‌

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా పంకజ్‌ మోహన్‌ పవార్‌ నియమితులయ్యారు. జూన్‌ 27 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రమిందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, మాజీ సీవీసీ (సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌) కేవీ చౌదరీని స్వత్రంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు వివరించింది. వీళ్లిద్దరూ ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో ఉన్నారు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురించి..

* రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌, రిటైల్‌, టెలికాంతో కూడిన డిజిటల్‌ సేవలుగా ప్రధాన వ్యాపారాలను గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఈ మూడింటి పరిమాణం ఇంచుమించు సమానమే. ఇందులో రిటైల్‌, డిజిటల్‌ సేవల వ్యాపారాలను పూర్తి అనుబంధ సంస్థల రూపేణా నిర్వహిస్తోంది.

* టెలికాం సేవల సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉంది. రిలయన్స్‌ రిటైల్‌.. ఎలక్ట్రానిక్స్‌, ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు విక్రయించే సూపర్‌ మార్కెట్లను నిర్వహిస్తోంది.

* చమురు నుంచి రసాయనాల వ్యాపారంతో పాటు కొత్త ఇంధన వ్యాపారం, మీడియా వ్యాపారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చేతిలో ఉన్నాయి.

* దేశంలోనే అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీసే. ముకేశ్‌ అంబానీ సంపద 109 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉంటుంది.

* 2019 మార్చిలో రిలయన్స్‌లో 47.27 శాతంగా ఉన్న అంబానీ కుటుంబ వాటా ప్రస్తుతం 50.6 శాతానికి చేరినట్లు తెలుస్తోంది.

డిజిబాక్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌ జట్టు

ఫైల్‌ స్టోరేజ్‌, షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థ డిజిబాక్స్‌తో  జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో వినియోగదారులకు అత్యుత్తమ స్టోరేజ్‌ సొల్యూషన్లు సృష్టించే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని ఇరు సంస్థలు కుదుర్చుకున్నాయి. జియోఫొటోస్‌ యాప్‌ను ఉపయోగించేటప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 20 జీబీ స్టోరేజ్‌ స్పేస్‌కు అదనంగా మరో 10జీబీ స్పేస్‌ను డిజిబాక్స్‌కు లాగిన్‌ అవ్వడం ద్వారా వినియోగదారులు పొందే అవకాశం ఉంటుంది. పలు రకాల ఫార్మాట్‌లలో ఫైల్స్‌ సేవ్‌ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసుకుని, వెంటనే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా షేరు చేసుకోవచ్చు. జియో సెట్‌-టాప్‌ బాక్స్‌ ద్వారా అంతరాయం లేకుండా జియో వినియోగదారులు వీటిని వీక్షించే వీలు కూడా ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని