పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ (93) మంగళవారం తెల్లవారుఝామున దక్షిణ ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వెల్లడించింది. 100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన

Published : 29 Jun 2022 03:07 IST

ముంబయి: వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ (93) మంగళవారం తెల్లవారుఝామున దక్షిణ ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వెల్లడించింది. 100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన టాటా గ్రూప్‌లో 18.37 శాతం వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు. 

నిర్మాణరంగంలో అగ్రశ్రేణి సంస్థగా..

1865లో స్థాపితమైన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వారసుడైన పల్లోంజీ మిస్త్రీ 1929లో జన్మించారు. తండ్రి షాపూర్జీ మిస్త్రీ మరణంతో 18 ఏళ్ల వయసులోనే, 1947లో ఈయన కుటుంబ వ్యాపార బాధ్యతల్ని తీసుకున్నారు. ఎస్‌పీ గ్రూప్‌ను 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,000 కోట్ల) స్థాయికి పల్లోంజీ మిస్త్రీ తీసుకెళ్లారు. నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎస్‌పీ గ్రూప్‌ను తీర్చిదిద్ది, కార్యకలాపాలను పలు దేశాలకు విస్తరించారు. మస్కట్‌లో ఒమన్స్‌ రాయల్టీ ప్యాలెస్‌ వంటి చారిత్రక కట్టడాలను ఈ గ్రూపే నిర్మించింది. దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), హెచ్‌ఎస్‌బీసీ, తాజ్‌, ఒబెరాయ్‌ హోటల్‌ వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను ఈ సంస్థే చేపట్టింది. స్థిరాస్తి, టెక్స్‌టైల్స్‌, షిప్పింగ్‌, గృహోపకరణాల వ్యాపారాలనూ ఎస్‌పీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. వ్యాపార రంగానికి పల్లోంజీ మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో పద్మభూషణ్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 1930లో టాటా గ్రూప్‌లో షాపూర్జీ మిస్త్రీ తీసుకున్న వాటా, ఆయన మరణం తరవాత పల్లోంజీ మిస్త్రీకి బదిలీ అయ్యింది. రతన్‌ టాటాతో పల్లోంజీకి మంచి సంబంధాలున్నాయి.

ఛైర్మన్‌ పదవి నుంచి 2012లో వైదొలగి

పల్లోంజీ మిస్త్రీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సైరస్‌ మిస్త్రీ 2012లో రతన్‌ టాటా తర్వాత టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నా, తరవాత ఆ పదవిని వీడాల్సి వచ్చింది. 2012లో ఎస్‌పీ గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగిన పల్లోంజీ మిస్త్రీ, ఆ బాధ్యతను తన రెండో కుమారుడు షాపూర్‌కు అప్పగించారు. పల్లోంజీ కుమార్తె ఆలూ, రతన్‌ టాటా సోదరుడు నోయల్‌ టాటా భార్య. మరో కుమార్తె లీలా ఉన్నారు.

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల సంతాపం: ‘మౌలిక వసతులు, భవన నిర్మాణ పరిశ్రమకు దిక్సూచి లాంటి వారు పల్లోంజీ మిస్త్రీ. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమ’ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘ప్రపంచ వాణిజ్య, పరిశ్రమలకు పల్లోంజీ చేసిన సేవలు మరచిపోలేనివి. ఆయన లేని లోటు పూడ్చలేనిద’ని ప్రధాని మోదీ పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, మన్సుఖ్‌ మాండవీయ, హర్దీప్‌ సింగ్‌ పురి, పీయూష్‌ గోయల్‌, జ్యోతిరాదిత్య సింధియా, స్మృతి ఇరానీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ బొమ్మై తదితరులు పల్లోంజీ మృతికి సంతాపం ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పల్లోంజీ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని