సంక్షిప్త వార్తలు

ఫెడరల్‌ రిజర్వ్‌ తదుపరి సమీక్షలో కీలక రేట్లను 50 లేదా 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాలి అన్నదానిపై చర్చించనున్నారని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ విలియమ్స్‌ పేర్కొన్నారు.ఈ ఏడాది కీలక రేట్లను 3-3.5% శ్రేణికి తీసుకురావడానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.

Published : 29 Jun 2022 03:06 IST

ఫెడ్‌ రేట్లు 0.5-0.75% పెరగొచ్చు

న్యూయార్క్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ప్రెసిడెంట్‌

న్యూయార్క్‌: ఫెడరల్‌ రిజర్వ్‌ తదుపరి సమీక్షలో కీలక రేట్లను 50 లేదా 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాలి అన్నదానిపై చర్చించనున్నారని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ విలియమ్స్‌ పేర్కొన్నారు.ఈ ఏడాది కీలక రేట్లను 3-3.5% శ్రేణికి తీసుకురావడానికి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.. ‘2023లో ఏం చేయాలన్నది అప్పటి గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాదికి రేటు ్ల3.5-4 శాతం మేర  చేరొచ్చ’ని ఆయన అంచనా వేశారు.  ఈ నెల మొదట్లో ఫెడ్‌ కీలకరేటును 75 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 1994 తర్వాత ఇదే అత్యధిక పెంపు కావడం గమనార్హం. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక విధాన సదస్సులో ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.


మరో వెయ్యికి పైగా స్టోర్లు

రూ.300 కోట్ల పెట్టుబడి

మెడ్‌ప్లస్‌ సీఈఓ మధుకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మెడ్‌ప్లస్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000కి పైగా స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ సీఈఓ మధుకర్‌ గంగిడి తెలిపారు. దీనికోసం రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. మెడ్‌ప్లస్‌కు ప్రస్తుతం 2,750 స్టోర్లు ఉన్నాయని, వీటి సంఖ్యను 4,000 దరిదాపుల్లోకి చేరుస్తామని వివరించారు. రోగ నిర్థారణ పరీక్షల కోసం అధునాతన డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో రెండు ఏర్పాటు చేయగా, కూకట్‌పల్లి- కొంపల్లి ప్రాంతాల్లో కొత్తగా మరో రెండింటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఒక్కో కేంద్రంపై రూ.12 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. వార్షిక సభ్యత్వ చందా చెల్లించిన వారికి, రోగ నిర్థారణ పరీక్షల రుసుములో 75% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.


ప్రైవేటు నెట్‌వర్క్‌ లైసెన్సులకు డాట్‌ నిబంధనల జారీ

దిల్లీ: దిగ్గజ టెక్నాలజీ సంస్థలు సొంతంగా నాన్‌ పబ్లిక్‌ నెట్‌వర్క్‌(సీఎన్‌పీఎన్‌)లను ఏర్పాటు చేసేందుకు టెలికాం విభాగం(డాట్‌) మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి నేరుగా స్పెక్ట్రమ్‌ పొందడానికి కనీసం రూ.100 కోట్ల నికర విలువ ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు కచ్చితంగా కంపెనీస్‌ యాక్ట్‌ కింద నమోదై ఉండాలి.

* సీఎన్‌పీఎన్‌ లైసెన్సు కావాల్సిన వారు ఎటువంటి ఎంట్రీ / లైసెన్సు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ ప్రాంగణంలోనే సొంత ప్రభుత్వేతర నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలి. లైసెన్సు పొందిన ప్రాంతాల్లోనే సొంత వినియోగానికి ఆ నెట్‌వర్క్‌ను వాడుకోవాలి. నీ సీఎన్‌పీఎన్‌ లైసెన్స్‌ను వాణిజ్య టెలికాం సేవలకు వినియోగించరాదు. నీ వన్‌టైం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ప్రాసెస్‌ ఫీజు రూ.50,000ను చెల్లించాలి. టెలికాం సామగ్రిని విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించే విషయంలో నెట్‌వర్క్‌ భద్రతా నిబంధనలను పాటించాలి.


డీప్‌ ఫ్రీజర్‌లపై ఈ వివరాలు తప్పనిసరి

ముసాయిదా నిబంధనలు విడుదల

ఈనాడు, దిల్లీ డీప్‌ ఫ్రీజర్‌లపై ఇక నుంచి తప్పనిసరిగా 11 వివరాలు పొందుపరచాలన్న నిబంధనను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను మంగళవారం జారీచేసింది. దీని ప్రకారం ప్రతి డీప్‌ ఫ్రీజర్‌పై 1. స్టార్‌ రేటింగ్‌, 2. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ లోగో, 3. సదరు పరికరం పేరు, 4. తయారీదారు, దిగుమతిదారు, బ్రాండ్‌ పేరు, 5. మోడల్‌, తయారీ లేదా దిగుమతి చేసుకున్న సంవత్సరం, 6. డీప్‌ ఫ్రీజర్‌  రకం (హార్డ్‌ టాప్‌, గ్లాస్‌టాప్‌ చెస్ట్‌ ఫ్రీజర్‌), 7. స్టోరేజీ సామర్థ్యం, 8. విద్యుత్తు వినియోగం (సంవత్సరానికి ఎన్ని కిలోవాట్లు), 9. దాని విశిష్ట క్రమ సంఖ్య , 10. లేబుల్‌ పీరియడ్‌, 11. ఏ దేశంనుంచి వచ్చింది అన్న వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన నాటినుంచి ఆరునెలల్లోపు ఈ వివరాలను ప్రతి డీప్‌ ఫ్రీజర్‌పై పొందుపరచాల్సి ఉంటుందని తెలిపింది.  


ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మరో 4 బోయింగ్‌ 737 విమానాలు

ముంబయి: అంతర్జాతీయ ప్రయాణాలకు పెరుగుతున్న గిరాకీని అందుకునేందుకు బోయింగ్‌ 737 విమానాలు మరో నాలుగు తీసుకోనున్నట్లు టాటా గ్రూప్‌ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ఆధీనంలో బోయింగ్‌ 737 విమానాలు 24 ఉన్నాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ భారత్‌లో 11, విదేశాల్లో 13 విమానాశ్రయాలకు 100కు పైగా రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది.


సాంకేతికత తోడుగా అందరికీ వైద్యం

మెడ్‌టెక్‌ అంకుర ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: అధునాతన సాంకేతికత సాయంతో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలవుతుందని మెడ్‌టెక్‌ అంకురాల ప్రతినిధులు తెలిపారు. మంగళవారం టి-హబ్‌ 2.0 ప్రారంభం సందర్భంగా ‘భవిష్యత్తు ఆరోగ్య రంగంలో మెడ్‌టెక్‌ పాత్ర’ అంశంపై నిర్వహించిన సదస్సులో నెఫ్రోప్లస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్‌ వుప్పాల మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణ రంగంలో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. డయాలసిస్‌ సేవలను అందిస్తున్న తమ సంస్థ, మొత్తం ప్రక్రియను యాంత్రీకరణ చేసేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. దీనివల్ల చికిత్స ఖర్చును మరింత తగ్గించేందుకు వీలవుతుందన్నారు. మెడ్‌ప్లస్‌ సీఈఓ మధుకర్‌ మాట్లాడుతూ.. విక్రయ కేంద్రాల్లో ఔషధాల నిల్వ ఆధారంగా.. ఎంత సరకు కావాలనేది ఆర్డర్‌ ఇచ్చేలా సాంకేతికతను తీసుకొస్తున్నట్లు వివరించారు. పలు రకాల వైద్య పరిష్కారాలకు కృత్రిమ మేధను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రిస్టిన్‌ సహ వ్యవస్థాపకుడు హర్సిమార్బిర్‌ సింగ్‌ అన్నారు. దీనికోసం 200 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని వివరించారు. టి-హబ్‌ 2.0 ప్రారంభం సందర్భంగా పలు అంశాలపై సదస్సులు జరిగాయి. ప్రధానంగా రాబోయే సాంకేతికతలు, అంకురాలకు ఉన్న అవకాశాలపై పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. చిన్న స్థాయిలో ప్రారంభమై.. ఇప్పుడు యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల సంస్థ)లుగా ఎదిగిన సంస్థల పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు, దేశంలోని ఇతర నగరాల నుంచి వచ్చిన అంకురాల నిర్వాహకులు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు.


మేలో క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు రూ.1.13 లక్షల కోట్లు

ముంబయి: ఈ ఏడాది మే నెలలో క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు రూ.1.13 లక్షల కోట్లను అధిగమించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ఏప్రిల్‌లో ఇవి రూ.1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెల వారీగా కార్డ్‌ వ్యయాలు పెరగడం గమనిస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

* 7.68 కోట్ల మంది క్రెడిట్‌ కార్డ్‌ దారులు రూ.71,429 కోట్ల మేర ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరిపారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల వద్ద స్వైపింగ్‌ ద్వారా రూ.42,266 కోట్లు వెచ్చించారు.

* సంప్రదాయ దుకాణాల్లో, పీఓఎస్‌ల ద్వారా 12.2 కోట్లు, ఆన్‌లైన్‌లో 11.5 కోట్ల లావాదేవీలు జరిగాయి.కార్డ్‌ హోల్డర్లు అధిక విలువ కలిగిన లావాదేవీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది.

* ఏప్రిల్‌లో చూస్తే ఆన్‌లైన్‌ కొనుగోళ్లు రూ.65,652 కోట్ల మేర, పీఓఎస్‌ యంత్రాల ద్వారా రూ.39,806 కోట్ల లావాదేవీలు జరిగాయి.

* డెబిట్‌ కార్డ్‌లు వినియోగించి పీఓఎస్‌, ఆన్‌లైన్‌ కలిపి రూ.65,957 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. పీఓఎస్‌ ద్వారా రూ.44,305 కోట్లు, ఇ-కామర్స్‌ వ్యయాలు రూ.21,104 కోట్లుగా నమోదయ్యాయి.

* మే నెలలో కొత్తగా 20 లక్షల క్రెడిట్‌ కార్డ్‌లు జతయ్యాయి. ఏప్రిల్‌కు ఇవి 7.51 కోట్లు ఉండేవి.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు అత్యధికంగా 1.72 కోట్ల క్రెడిట్‌ కార్డ్‌లున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.33 కోట్ల క్రెడిట్‌ కార్డ్‌లు కలిగి ఉన్నాయి.


రిజిస్ట్రార్‌ దగ్గరకెళ్లండి

అదానీ పోర్ట్‌కు సుప్రీం సూచన

ఆదేశాలిచ్చినా విచారణకు పెట్టలేదు

దిల్లీ: ధర్మాసనాల నుంచి ఆదేశాలు వెలువడినా కేసులను విచారణ జాబితాలో కోర్టు రిజిస్ట్రీ చేర్చకపోవడంపై సుప్రీం కోర్టు నిస్పృహ వ్యక్తం చేసింది. ఇక ప్రక్రియ ప్రకారమే కేసులు లిస్టవుతాయని స్పష్టం చేసింది. ఒక కేసును మంగళవారానికి లిస్ట్‌ చేయమని సోమవారం ఆదేశాలు ఇచ్చినా, అలా జరగలేదని న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలాలతో కూడిన వెకేషన్‌ ధర్మాసనం మండిపడింది. ‘కోర్టులో ఇలా బహిరంగంగా చెప్పాలని అనుకోవడం లేదు. అయితే ఇది నిజం. నిన్న మేము ఒక ఆదేశం జారీ చేశాం. ఇవాళ్టికి ఒక కేసును విచారణ చేపట్టడానికి లిస్ట్‌ చేయాలని చెప్పాం. అయితే రిజిస్ట్రీ ఆ పనిచేయలేదు. ఇంత కంటే మేం ఎక్కువ చెప్పదలుచుకోలేద’ని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వికి ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ దాఖలు చేసిన విజ్ఞప్తికి సంబంధించిన కేసును అత్యవసర లిస్టింగ్‌ చేయాలని ఆయన అంతక్రితం కోరారు. ‘సెలవుల్లో కేసుల లిస్టింగ్‌కు ఒక ప్రక్రియ అంటూ ఉంది. సంబంధిత రిజిస్ట్రార్‌ను కలిసి అత్యవసర లిస్టింగ్‌ చేయాలని అడగండి. ఒక వేళ తిరస్కరిస్తే అపుడు మేం పరిశీలిస్తామ’ని ధర్మాసనం పేర్కొంది. ఇంకో కేసు విషయంలోనూ ఇలానే జరిగింది.


తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఏఐ ఆధారిత పర్యవేక్షణ

భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి

దిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి (ఆస్కి) వెల్లడించింది. 2021-22లో ప్రింట్‌, డిజిటల్‌, టీవీ ప్రకటనలకు సంబంధించి 7,631 ఫిర్యాదులు అందాయని, అందులో 5,532 పరిష్కరించినట్లు ఆస్కి తెలిపింది. ఆస్కి నిబంధనల్ని అతిక్రమిస్తున్న ప్రకటనలు విద్యా రంగంలో అధికంగా ఉన్నట్లు గుర్తించామని, వీటి తర్వాత ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ రంగాల ప్రకటనలు వస్తున్నాయని వివరించింది. డిజిటల్‌ మీడియాలో 48 శాతం అభ్యంతరకర ప్రకటనలు వస్తుండగా, ప్రింట్‌లో 47 శాతం, టీవీలో 3 శాతం, ఇతర వేదికల్లో 2 శాతం చొప్పున ఉన్నాయని పేర్కొంది. డిజిటల్‌కు వస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో 43 శాతం, యూట్యూబ్‌లో 28 శాతం, వెబ్‌సైట్లలో 18 శాతం, ట్విటర్‌లో 6 శాతం, ఫేస్‌బుక్‌లో 3 శాతం చొప్పున తప్పుదోవ పట్టించే ప్రకటనలు వస్తున్నట్లు గుర్తించామని వివరించింది.

* 5,532 ఫిర్యాదుల్లో 94 శాతం ప్రకటనల్లో మార్పులు సూచించామని ఆస్కి వెల్లడించింది. ఇందులో విద్యా రంగంలో అత్యధికంగా 33 శాతం ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో 16 శాతం ఉన్నట్లు పేర్కొంది.


సహకార బ్యాంకులకూ త్వరలో అనుమతులు

జామ్‌ ద్వారా ప్రభుత్వ పథకాల అమలుకు

అహ్మదాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల బదిలీ (డీబీటీ) కోసం జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ (జామ్‌)ను వినియోగించడానికి సహకార రంగ బ్యాంకులకు త్వరలోనే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. కేంద్ర సబ్సిడీల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జన్‌ధన్‌ ఖాతాలను మొబైల్‌ నంబర్లు, ఆధార్‌ కార్డులకు జత చేసేదే జామ్‌ పథకం. 300 ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు సహాయం చేయడం కోసం ప్రస్తుతం 52 మంత్రిత్వ శాఖలు జామ్‌ను వినియోగిస్తున్నాయని గుజరాత్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 70వ వార్షిక సాధారణ సమావేశంలో అమిత్‌ షా పేర్కొన్నారు. ‘త్వరలో సహకార రంగం ఈ ప్రభుత్వ పథకాల్లోకి అడుగుపెడుతుంది. సామాన్యులతో మా నేరు సంబంధాలను పెంచుతుంది. ఇప్పటిదాకా జామ్‌ డీబీటీకి వాటిని దూరంగా ఉంచాం. ఇపుడు ఈ ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింద’ని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని