Published : 30 Jun 2022 05:47 IST

జీఎస్‌టీ పరిహారంపైౖ ఆగస్టులో నిర్ణయం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

చండీగఢ్‌: జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) అమలు వల్ల ఏర్పడుతున్న ఆదాయలోటును పూరించేందుకు, గత అయిదేళ్లుగా ఇస్తున్న పరిహారాన్ని మరికొన్నేళ్ల పాటు కొనసాగించాల్సిందిగా సుమారు 12 రాష్ట్రాలు అడిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దీనిపై ఆగస్టు మొదటి వారంలో మధురైలో నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన జీఎస్‌టీ మండలి 47వ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

‘జీఎస్‌టీ పరిహారం అంశంపై మాట్లాడిన 16 రాష్ట్రాల ప్రతినిధుల్లో 12 మంది పరిహారం చెల్లించడాన్ని కొనసాగించాలని కోరారు.  3-4 రాష్ట్రాలు మాత్రం సొంతంగా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాయ’ని మంత్రి తెలిపారు. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించలేదని మంత్రి వివరించారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, రాష్ట్రాలకు వాటిల్లుతున్న పరోక్ష పన్నుల ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు అయిదేళ్ల పాటు పరిహారం చెల్లించాలని అప్పట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు గురువారం (జూన్‌ 30)తో ముగియనుంది. అయితే రెండేళ్లు కరోనా పరిణామాలతోనే గడిచినందున.. పరిహార వ్యవస్థను మరికొంత కాలం పొడిగించాలని రాష్ట్రాలు కోరాయి. ఈ అంశంపై మంగళ, బుధవారాల్లో చర్చించిన జీఎస్‌టీ మండలి.. ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.

జీఎస్‌టీ మండలి సమావేశం కోసం రూపొందించిన గణాంకాల ప్రకారం.. దేశంలోని 31 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదు (అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిమ్‌) మాత్రమే 2021-22లో ప్రొటెక్టెడ్‌ రెవెన్యూ రేటు కంటే అధిక వృద్ధి నమోదు చేశాయి. పుదుచ్చేరి, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్రొటెక్టెడ్‌ రెవెన్యూ రేటు, ఆ రాష్ట్రాలకు అందించిన జీఎస్‌టీ ఆదాయం మధ్య అధిక వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్రాల ప్రొటెక్టెడ్‌ రెవెన్యూలో ఏటా 14 శాతం వృద్ధి ఉంటుండగా.. ఆ స్థాయిలో సెస్సు వసూళ్లు పెరగలేదు. కొవిడ్‌-19 పరిణామాలతో ఈ వ్యత్యాసం మరింతగా పెరిగింది. దీంతో రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం చెల్లించే నిమిత్తం ప్రభుత్వం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను రుణంగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ రుణాల చెల్లింపు కోసమే విలాస వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్సు గడువును పెంచుతూ గతవారం కేంద్రం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

క్యాసినోలు, లాటరీలపై 28 శాతం పన్ను నిర్ణయమూ వాయిదా: క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమ్‌లు, గుర్రపు పందేలు, లాటరీలపై 28 శాతం జీఎస్‌టీ విధించే ప్రతిపాదనపై నిర్ణయాన్నీ జీఎస్‌టీ మండలి వాయిదా వేసింది. ఈ అంశంపై మరికొన్ని చర్చలు జరపాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సంబంధిత వర్గాలతో మళ్లీ చర్చలు జరిపి.. జులై 15 కల్లా నివేదిక సమర్పించాల్సిందిగా మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందానికి సూచించామని ఆమె వెల్లడించారు. వాయిదా వేసిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆగస్టు మొదటి వారంలో జీఎస్‌టీ మండలి సమావేశం అవుతుందని చెప్పారు.  

పన్ను రేట్ల హేతుబద్దీకరణ ఉద్దేశం అదే..

‘ముడి సరుకు, అంత్య ఉత్పత్తులకు వేర్వేరు పన్ను రేట్లు విధించినప్పుడు పన్నుల వ్యవస్థలో అసమతౌల్యానికి దారి తీయొచ్చు. అందులో భాగంగానే పన్నుల హేతుబద్దీకరణ ప్రక్రియ చేపట్టాం. ఇందువల్ల వేటిపైన అయినా పన్ను రేట్లు పెరిగాయంటే.. ఆ అసమతౌల్యాన్ని తొలగించాలనేదే ఉద్దేశమని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆదాయ తటస్థ రేటు 14.4 శాతమైతే, ఇప్పటివరకు తగ్గించిన పన్ను రేట్ల వల్ల వసూలవుతున్న సగటు 11.6 శాతంగా ఉందని మంత్రి వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని