Published : 30 Jun 2022 02:14 IST

వరుస లాభాలకు విరామం

రికార్డు కనిష్ఠమైన 79.03కు రూపాయి
సమీక్ష

సూచీల నాలుగు రోజుల వరుస లాభాలకు బుధవారం విరామం ఏర్పడింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురవ్వడం.. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు కోల్పోయి తాజా జీవనకాల కనిష్ఠమైన 79.03 వద్ద ముగియడం.. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.31 శాతం పెరిగి 118.3 డాలర్లకు చేరడం ఇందుకు కారణాలు. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 52,623.15 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం కోలుకున్న సూచీ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చి 53,244.84 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మళ్లీ అమ్మకాలు రావడంతో 150.48 పాయింట్ల నష్టంతో 53,026.97 వద్ద ముగిసింది.నిఫ్టీ 51.10 పాయింట్లు తగ్గి 15,799.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,687.80- 15,861.60 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నష్టపోయాయి. హెచ్‌యూఎల్‌ 3.46%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.57%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.19%, టైటన్‌ 1.63%, విప్రో 1.59%, కోటక్‌ బ్యాంక్‌ 1.57%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.42%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.20%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.17%, ఇన్ఫోసిస్‌ 1.12% మేర డీలాపడ్డాయి. ఎన్‌టీపీసీ 2.42%, రిలయన్స్‌  1.98%, సన్‌ఫార్మా 1.23%, భారతీ ఎయిర్‌టెల్‌  0.95% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫైనాన్స్‌, టెక్‌, టెలికాం 1.20% వరకు పడ్డాయి. ఇంధన, యుటిలిటీస్‌, వాహన, లోహ, చమురు-గ్యాస్‌, విద్యుత్‌, స్థిరాస్తి రాణించాయి.  

ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ కమొడిటీ డెరివేటివ్స్‌లోకి ఎఫ్‌పీఐలు: ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ కమొడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) పాల్గొనేందుకు అనుమతించాలని సెబీ బుధవారం నిర్ణయించింది. మార్కెట్‌లో నగదు లభ్యత, పరిమాణం పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఎఫ్‌పీఐలు ఇకపై అన్ని వ్యవసాయేతర కమొడిటీ డెరివేటివ్స్‌, ఎంపికచేసిన వ్యవసాయేతర ప్రామాణిక సూచీల్లో ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాష్‌ సెటిల్డ్‌ కాంట్రాక్టులకే ఎఫ్‌పీఐలను అనుమతిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నియంత్రణ నిబంధనల్లో మార్పులకు సైతం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది.

* ఐపీఓ ద్వారా రూ.900 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరుతూ, ఔషధ కంపెనీ ఇన్నోవా క్యాప్టాబ్‌ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.

డార్క్‌ ఫైబర్‌ కేసులో రూ.44 కోట్ల జరిమానాలు: డార్క్‌ ఫైబర్‌ కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), సంస్థ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రవి వారణాసి, సంస్థ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు ఆనంద్‌ సుబ్రమణియన్‌, ఇతర స్టాక్‌ బ్రోకర్లు సహా 18 సంస్థలపై సెబీ మొత్తం రూ.44 కోట్ల జరిమానా విధించింది. ఎన్‌ఎస్‌ఈపై రూ.7 కోట్లు, రామకృష్ణ, వారణాసి, సుబ్రమణియన్‌లపై తలా రూ.5 కోట్ల చొప్పున జరిమానా వేసింది. వే2వెల్త్‌ బ్రోకర్స్‌పై రూ.6 కోట్లు, జీకేఎన్‌ సెక్యూరిటీస్‌పై రూ.5 కోట్లు, సంపర్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.3 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశాల్లో పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో డార్క్‌ ఫైబర్‌ రూపంలో కొన్ని బ్రోకింగ్‌ సంస్థలకు, ఇతర సభ్యుల కంటే ముందుగానే సమాచారం వెళ్లిందన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని