సంక్షిప్త వార్తలు

దేశంలో విమానయాన కార్యకలాపాలు పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. డిసెంబరు కల్లా 6-8 విమానాలను సమకూర్చుకునేందుకు.. ఎయిర్‌బస్‌-బోయింగ్‌ వంటి విమాన తయారీదార్లు, లీజింగ్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 30 Jun 2022 05:39 IST

డిసెంబరు కల్లా 6-8 విమానాలు
విమాన తయారీదార్లు, లీజ్‌ సంస్థలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ చర్చలు

ముంబయి: దేశంలో విమానయాన కార్యకలాపాలు పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌.. డిసెంబరు కల్లా 6-8 విమానాలను సమకూర్చుకునేందుకు.. ఎయిర్‌బస్‌-బోయింగ్‌ వంటి విమాన తయారీదార్లు, లీజింగ్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందు రష్యా విమానయాన సంస్థలకు డెలివరీ చేయాల్సిన విమానాలు కూడా ఇందులో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదేవిధంగా ‘అనుకూల’ సమయంతో కూడిన స్లాట్లు దక్కించుకునేందుకు విమానాశ్రయాల నిర్వాహకులతోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరుపుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు దిగ్గజ సంస్థగా దేశీయ విమానయాన రంగంలో వెలుగు వెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌, రుణ సంక్షోభంలో కూరుకుని, 2019 ఏప్రిల్‌ 17 నుంచి కార్యకలాపాలు ఆపేసిన సంగతి తెలిసిందే. జలాన్‌- కాల్‌రాక్‌ బృందం నేతృత్వంలో సంస్థ తిరిగి కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. గత నెలలో జెట్‌ ఎయిర్‌వేస్‌కు డీజీసీఏ నుంచి ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ రీవ్యాలిడేషన్‌ కూడా లభించింది. ‘విమానాల లభ్యత అనేది ఎల్లప్పుడూ సమస్యే. అయితే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా.. రష్యాకు లీజింగ్‌ ఇచ్చిన విమానాలతో పాటు ఆ దేశానికి డెలివరీ చేయాల్సిన విమానాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయ’ని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోయింగ్‌, ఎయిర్‌బస్‌తో పాటు లీజింగ్‌ సంస్థలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతోందని, త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రావొచ్చని పేర్కొన్నాయి. డిసెంబరు కల్లా 6-8 విమానాలను అద్దెకు ఇవ్వాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ భావిస్తోందని తెలిపాయి.  సంప్రదింపుల అనంతరం తుది నిర్ణయానికి వచ్చాక.. ఆ వివరాలను వెల్లడిస్తామని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ సంజీవ్‌ కపూర్‌ తెలిపారు. విమానాల ఒప్పందంపై సంతకాలు పూర్తయితే.. సెప్టెంబరు కల్లా జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే వీలుంటుందని అన్నారు.


మరో 125 తెరలు: పీవీఆర్‌  

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో సినిమా ప్రదర్శన రంగం పుంజుకుంటుందని మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పీవీఆర్‌ భావిస్తోంది. అందుకే మరో 125 తెరల వరకు జత చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత అధికంగా తెరలను నెలకొల్పడం ఇప్పుడే. ఐనాక్స్‌ లీజర్‌ విలీన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పీవీఆర్‌ అంచనా వేస్తోంది. విలీన నిబంధనల ప్రకారం.. పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీ సంయుక్త సంస్థకు ఎండీగా; జాయింట్‌ ఎండీ సంజీవ్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మారతారు. అయిదేళ్ల కాలానికి వీరి నియామకం జరుగుతుంది. ‘2021-22 మూడు, నాలుగో త్రైమాసికాల్లో సగటు టికెట్‌ ధర(ఏటీపీ); తలసరి వ్యయం(ఎస్‌పీహెచ్‌)లో వృద్ధి కనిపించింది. కరోనా ముందు స్థాయుల్లో సీట్లు నిండుతున్నాయి. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపార ప్రకటనల ఆదాయం సైతం కరోనా ముందు స్థాయులకు చేరొచ్చ’ని కంపెనీ తన తాజా వార్షిక నివేదిక(2021-2022)లో పేర్కొంది. ‘ 2021-22లో 29 తెరలే జతచేసుకున్నాం. ఈ ఆర్థికంలో ఆ సంఖ్య 125కు చేరుతోంది. తద్వారా 2019-20లో 87 తెరలతో నెలకొల్పిన మా రికార్డు మేమే బద్దలు కొడుతున్నామ’ని సంస్థ తెలిపింది.


బైజూస్‌లో 2,500 ఉద్యోగాల కోత

దిల్లీ: ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ దిగ్గజం బైజూస్‌ 2500 మంది ఉద్యోగులను తొలగించింది. తన లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం టాపర్‌, కోడింగ్‌ ప్లాట్‌ఫాం వైట్‌హాట్‌ జూనియర్‌ నుంచి 1500 మందిని, కీలక కార్యకలాపాల బృందాల నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దేశంలోని విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభం కావడంతో, ఆన్‌లైన్‌ బోధన జరిపే ఎడ్‌టెక్‌ సంస్థలకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలు విధిస్తున్నాయి. గతేడాది టాపర్‌ను 150 మిలియన్‌ డాలర్లతో బైజూస్‌ కొనుగోలు చేసింది.   300 మి. డాలర్లతో కొనుగోలు చేసిన వైట్‌హాట్‌ జూనియర్‌ నుంచి కూడా ఉద్యోగులను తొలగించింది. కార్యాలయాలకు తిరిగి రమ్మన్నందుకు ఏప్రిల్‌-మేలో 1000కిపైగా ఉద్యోగులు ఈ కంపెనీకి రాజీనామా చేశారు.  

* ఇంజినీరింగ్‌, వైద్య ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ను 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7900 కోట్ల)తో కొనుగోలు చేసే ప్రక్రియను బైజూస్‌ జూన్‌ ఆఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చెల్లింపుల గడువును ఆగస్టుకు పొడిగించింది.


డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

చెన్నై: గృహరుణ సంస్థ సుందరం హోం ఫైనాన్స్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు  జులై 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. 4, 5 ఏళ్ల కాలావధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు, ట్రస్టులకు 7.50 శాతం వడ్డీ అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మిగతా వారికి 7 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఏడాది కాలావధి డిపాజిట్లకు వడ్డీ రేటు 6 శాతంగా నిర్ణయించింది.

కర్ణాటక బ్యాంక్‌ సైతం..: కర్ణాటక బ్యాంక్‌ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై 5.35 శాతం, 2-5 ఏళ్ల డిపాజిట్లపై 5.50శాతం వడ్డీ లభిస్తుందని పేర్కొంది.


నాగర్నార్‌ ప్లాంటు  విభజనకు ఆమోదం  

ఈనాడు, హైదరాబాద్‌: నాగర్నార్‌ స్టీలు ప్లాంటును విభజించి, కొత్త కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వాటాదార్లు ఆమోదముద్ర వేశారు. చత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలో 3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ స్టీలు ప్లాంటును స్వతంత్ర సంస్థగా మార్చేందుకు ఎన్‌ఎండీసీ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ అంశంపై వాటాదార్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వాటాదార్లు నాగర్నార్‌ స్టీలు ప్లాంటు విభజనను ఆమోదించినట్లు ఎన్‌ఎండీసీ తెలియజేసింది. దాదాపు 2,000 ఎకరాల స్థలంలో రూపుదిద్దుకున్న ఈ ప్లాంటుపై రూ.23,140 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ స్టీలు ప్లాంటు ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అయినందున, ఎన్‌ఎండీసీ పూర్తిగా ఇనుప ఖనిజం ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఏర్పడింది.


యాక్సిస్‌ బ్యాంక్‌తో  ఈజీడిన్నర్‌ జట్టు

ఈనాడు, హైదరాబాద్‌: రెస్టారెంట్లలో టేబుల్‌ బుకింగ్‌, చెల్లింపుల సేవలను అందించే ఈజీడిన్నర్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డు ఖాతాదారులకు భారత్‌, దుబాయిలలోని 10,000 ప్రీమియం రెస్టారెంట్లలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఈజీడిన్నర్‌ యాప్‌ ద్వారా సులభంగా టేబుళ్లను రిజర్వు చేసుకోవడం, ప్రత్యేక ఆఫర్లను పొందేందుకు అవకాశం లభిస్తుందని యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్స్‌, పేమెంట్స్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ మోఘే తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో 50 శాతం వరకు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.


కొత్త సాంకేతికత  అభివృద్ధిపై  టాటా స్టీల్‌ రూ.1,200 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: వచ్చే 3-4 ఏళ్లలో కొత్త సాంకేతికత అభివృద్ధిపై రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు టాటా స్టీల్‌ వెల్లడించింది. ఉక్కుయేతర మెటీరియల్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త మెటీరియల్స్‌ వ్యాపారంలో భాగంగా గ్రాఫేన్‌పై దృష్టి సారించనుంది. దీన్ని ప్లాస్టిక్‌తో కలిపి బ్రాండ్‌ న్యూ ఉత్పత్తుల్ని తయారు చేయడమే కాకుండా దీనికి ఉన్న ఇతర లక్షణాలతో రీసైక్లింగ్‌ కూడా చేసే వీలుంటుందని టెక్నాలజీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దెబాశిష్‌ భట్టాఛార్జి వెల్లడించారు. టాటా స్టీల్‌ ప్రధాన వ్యాపారమైన ‘అసెట్‌ హెవీ’ స్టీల్‌తో పోలిస్తే న్యూ మెటీరియల్స్‌ ‘అసెట్‌ లైట్‌’గా ఉంటాయని తెలిపారు. ఉక్కు కాకుండా ఇతర మెటీరియల్స్‌లోకి ప్రవేశించేందుకు ఎక్కువగా వీటిపై పరిశోధనలు జరుగుతున్న విశ్వవిద్యాలయాలు, సంస్థలతో మాట్లాడామని భట్టాఛార్జి తెలిపారు. కంపెనీ నిర్వహించే గ్రాఫైన్‌ వ్యాపారం సుమారు రూ.500 కోట్లు ఉంటుందని, గ్రాఫైన్‌ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు విస్తరణపైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.


1 నుంచి  ఉక్కు ధరలు  పెరగొచ్చు
జేఎస్‌పీఎల్‌ ఎండీ వీఆర్‌ శర్మ

దిల్లీ: ఉక్కు ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినా, జులై 1 నుంచి మళ్లీ పెరిగే అవకాశం ఉందని జేఎస్‌పీఎల్‌ ఎండీ వీఆర్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఉక్కు ఉత్పత్తిలో వినియోగించే ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ‘టన్ను బొగ్గుకు రూ.17,000 చెల్లించాల్సి వస్తోంది. ఒడిశా మినరల్‌ కార్పొరేషన్‌ వెలికి తీస్తున్న ఇనుప ఖనిజం ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి. ఒడిశాలోని ఉక్కు ప్లాంట్లకు ప్రధాన సరఫరాదారు ఈ కార్పొరేషనే. ఇప్పటికే గరిష్ఠ స్థాయుల నుంచి ఉక్కు ధరలు బాగా తగ్గాయి. దిద్దుబాటు దాదాపు పూర్తయింది. ఇక ధరలు తగ్గకపోగా శుక్రవారం నుంచి మళ్లీ పెరుగుతాయ’ని శర్మ వెల్లడించారు. స్టీల్‌మింట్‌ ప్రకారం, గత మేలో హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ) టన్ను ధర రూ.76,000 ఉండగా, ప్రస్తుతం రూ.59,000-60,000 మధ్య ఉంది.


బీమా నైపుణ్యాల శిక్షణకు ఐఐఆర్‌ఎంతో  స్విస్‌ రీ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సేవలకు సంబంధించిన కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం)తో రీ ఇన్సూరెన్స్‌ సంస్థ స్విస్‌ రీ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐఐఆర్‌ఎంలో మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ విద్యార్థులకు రీ ఇన్సూరెన్స్‌ అంశాలపై పాఠాలు బోధించడంతో పాటు, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలను కల్పించే బాధ్యతను స్విస్‌ రీ తీసుకోనుంది. దేశంలో బీమా రంగ అభివృద్ధికి నిపుణుల అవసరం ఎంతో ఉందని, వారిని తీర్చిదిద్దేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని స్విస్‌ రీ గ్లోబల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ కల్రా అన్నారు. ఐఐఆర్‌ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ మాథుర్‌ మాట్లాడుతూ.. రెండు సంస్థలు కలిసి బీమా, అనుబంధ రంగాలకు నిపుణులను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.


జపాన్‌ కంపెనీతో  టాటాల జట్టు

దిల్లీ: టాటా గ్రూప్‌ కంపెనీలు టాటా మోటార్స్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జపాన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ సెమీకండక్టర్‌ సొల్యూషన్ల సంస్థ రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ‘ఈ భాగస్వామ్యం కింద రెనెసాస్‌కు చెందిన సెమీకండక్లర్‌ సొల్యూషన్ల డిజైన్‌, అభివృద్ధి, తయారీ జరుగుతుంది. వీటిని భారత, వర్థమాన దేశాలకు ఉపయోగిస్తార’ని కంపెనీ   పేర్కొంది. ‘ఇటీవల టాటా ఎలెక్సీతో కలిసి ప్రకటించిన ఈవీ ఇన్నోవేషన్‌ సెంటర్‌(ఎన్‌వీఐసీ)తో పాటు దీర్ఘకాలంగా సాంకేతికత, వ్యాపార భాగస్వాములుగా ఉన్న మా బంధం ఇపుడు మరింత బలోపేతం కాగలద’ని కంపెనీ అందులో వెల్లడించింది. ‘అధునాతన ఎలక్ట్రానిక్స్‌లో మరింత వృద్ధికి రెనెసాస్‌, టాటాలు మద్దతు ఇస్తాయ’ని రెనెసాస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ హిడెతోషి షిబాటా పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ‘రెనెసాస్‌తో భాగస్వామ్యం వల్ల ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌, భవిష్యత్‌ టెలికాం నెట్‌వర్క్‌ రంగాల్లో గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. అంతర్జాతీయంగా, భారత్‌లో ఈ రంగాల్లో మేం మరింత విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంద’ని టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు.


మరిన్ని రేట్ల పెంపులుండొచ్చు
వృద్ధిపై ప్రభావం కనిపించొచ్చు
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబయి: ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశాలున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మరిన్ని రేట్ల పెంపులు చేపట్టవచ్చని దిగ్గజ బ్యాంకరు దీపక్‌ పరేఖ్‌ అంటున్నారు. అయితే కఠిన ఆర్థిక పరిస్థితుల వల్ల వృద్ధిపై ప్రభావం పడవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఛైర్మన్‌ కూడా అయిన పరేఖ్‌ అంచనా వేస్తున్నారు. ‘వృద్ధి విషయంలో ఆశావహంగా ఉండడానికి సాధారణ వర్షపాతం, ప్రజల వ్యయాలు, మంచి ఎగుమతులు, కార్పొరేట్లు - బ్యాంకుల ఆర్థిక బలం పుంజుకోవడం, ప్రైవేటు మూలధన వ్యయాలు రాణిస్తుండడం వంటి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారితే అవి జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపొచ్చ’ని అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితులు ఎక్కువ కాలం పాటు కనిపిస్తుండడం; కమొడిటీ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులూ కొనసాగడం వంటివి వృద్ధికి అడ్డంకులుగా మారొచ్చని అన్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ రెండు దఫాలుగా కలిపి 0.9 శాతం మేర రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. ‘అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గదు. 2022-23లో మరిన్ని వడ్డీ రేట్ల పెంపునకు ఇది కారణం అవుతుంద’ని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన అన్నారు.


అర్జూ  రూ.550 కోట్ల  సమీకరణ

దిల్లీ: ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రైఫెక్టా లీడర్స్‌ ఫండ్స్‌ల మద్దతుతో రిటైల్‌ టెక్నాలజీ సంస్థ అర్జూ తాజా విడతలో 70 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.550 కోట్లు) నిధుల్ని సమీకరించింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ కంపెనీ డోర్‌డ్యాష్‌ వ్యవస్థాపకుడు టోనీ షు కూడా సిరీస్‌ బి విడతలో ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. తాజాగా వచ్చిన పెట్టుబడి భారత్‌ నుంచి వచ్చిన తొలి పెట్టుబడి అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే పెట్టుబడులు కొనసాగిస్తున్న సెలెస్టా క్యాపిటల్‌, 3 లైన్స్‌ వీసీలు కూడా తాజా విడతలో పెట్టుబడులు పెట్టాయి. అర్జూ భారత్‌లోని ఆఫ్‌లైన్‌ స్టోర్ల కోసం టెక్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. 30,000కు పైగా రిటైలర్లకు సేవలు అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా తమ ఉనికిని చాటాలనుకుంటున్నట్లు అర్జూ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని