Published : 02 Jul 2022 02:05 IST

సంక్షిప్త వార్తలు

టయోటా అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ ఆవిష్కరణ

దిల్లీ: టయెటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలోకి అడుగు పెట్టింది. తన కొత్త మోడల్‌ అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. రాబోయే పండగల సీజన్‌లో ఈ మోడల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌లతో ఈ ఎస్‌యూవీ పోటీపడనుంది. దేశవ్యాప్తంగా ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. దీనికోసం రూ.25వేలు చెల్లించాలని పేర్కొంది. హైరడర్‌ రెండు మోడళ్లుగా రాబోతోంది. నియో డ్రైవ్‌ 1.5 లీటర్‌ పెట్రోలు ఇంజిన్‌, ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జెనరేటర్‌తో వస్తోంది. ఇది 75 కిలోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది. ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ), అయిదు గేర్ల మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, ఆరు గేర్ల ఆటో ట్రాన్స్‌మిషన్‌తో ఇది అందుబాటులో ఉండనుంది. సెల్ఫ్‌ ఛార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌లో 1.5 లీటర్‌ ఇంజిన్‌, టయోటా హైబ్రిడ్‌ సిస్టం, ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.


ఎస్‌బీఐ పసిడి రుణాలు రూ.లక్ష కోట్లు

ముంబయి: తమ బ్యాంక్‌ పసిడి ఆభరణాల తనఖా వ్యాపారం తొలిసారిగా రూ.లక్ష కోట్లను అధిగమించినట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా శుక్రవారం తెలిపారు. పసడి తనఖా వ్యాపారంలో 24 శాతం వాటా తమకు ఉందని, భవిష్యత్తులో మరింత వృద్ధి లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘గతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ విభాగంలో మెరుగైన వృద్ధి సాధించాం. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పసిడికి గిరాకీ పెరుగుతుంది. డబ్బులు అవసరమైన వారు తమ ఆభరణాలు తనఖా పెట్టుకోవడమూ అధికమవుతుంది’ అని దినేశ్‌ విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ రుణాల్లో 15 శాతం వృద్ధి లభించిందని, ఇప్పుడూ తమకు ఈ విభాగం ముఖ్యమేనని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చినవి మినహాయిస్తే, ఒత్తిడికి గురవుతున్న రుణాల వాటా మొత్తంలో 1 శాతం కంటే తక్కువే ఉన్నాయని ఎస్‌బీఐ ఛైర్మన్‌ పేర్కొన్నారు.


ఎఫ్‌ఎస్‌ఐబీగా బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో

తొలి ఛైర్‌పర్సన్‌ భాను ప్రతాప్‌ శర్మ

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టులకు అర్హులను ఎంపిక చేసే  బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోను (బీబీబీ) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ)గా ప్రభుత్వం మార్పు చేసింది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్ల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఎఫ్‌ఎస్‌ఐబీలో భాగం చేసిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘సాధారణ బీమా సంస్థలకు డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లను ఎంపిక చేసేందుకు బీబీబీ చట్టబద్ద సంస్థ కాదని’ గతేడాది దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, చట్టానికి కొన్ని సవరణలను చేయాల్సి వచ్చింది. దీని ప్రకారంగా.. సాధారణ బీమా కంపెనీలకు కొత్తగా నియమితులైన డైరెక్టర్లలో సుమారు అర డజను మంది తమ స్థానాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. బీబీబీ మాజీ ఛైర్మన్‌ భాను ప్రతాప్‌ శర్మను ఎఫ్‌ఎస్‌ఐబీకి తొలి ఛైర్‌పర్సన్‌గా నియమించేందుకు ‘నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గ కమిటీ’ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అనిమేశ్‌ చౌహాన్‌ (గతంలోని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు మాజీ ఛైర్మన్‌, ఎండీ), ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు దీపక్‌ సింఘాల్‌, శైలేంద్ర భండారి (గతంలోని ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌కు మాజీ ఎండీ) ఎఫ్‌ఎస్‌ఐబీలో సభ్యులుగా ఉండనున్నారు.


భారత వృద్ధి 7.3 శాతమే: క్రిసిల్‌

2022-23 అంచనాల్లో కోత

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ తగ్గించింది. ఇంతకు ముందు 7.8 శాతం వృద్ధి లభిస్తుందని అంచనా వేయగా.. ప్రస్తుతం 7.3 శాతానికి పరిమితం చేసింది. చమురు ధరలు పెరగడం, ఎగుమతులకు గిరాకీ తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం ఇందుకు కారణాలుగా పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా అయిన 7.2 శాతానికి ఇది దగ్గరగా ఉండటం గమనార్హం. కమొడిటీ ధరలు భగ్గుమంటున్నాయని, సరకు రవాణా భారమైందని, బలహీన అంతర్జాతీయ వృద్ధి అంచనాలతో ఎగుమతులు క్షీణించవచ్చని, ప్రైవేట్‌ వినియోగం బలహీనంగా ఉండటం మన ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశాలుగా క్రిసిల్‌ పేర్కొంది. సేవల రంగ వృద్ధి, సాధారణ వర్షపాత అంచనాలు మాత్రమే సానుకూలంగా కనిపిస్తున్నాయని తెలిపింది. 2022-23లో సగటు ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుందని అభిప్రాయపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2023 మార్చికి 78 వద్ద ఉండొచ్చని, ఇది అదనపు ఒత్తిడి తీసుకురావొచ్చని తెలిపింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 105- 110 డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 75 బేసిస్‌ పాయింట్లు మేర రేట్ల పెంపు చేపట్టొచ్చని వివరించింది.


తయారీకి ద్రవ్యోల్బణం సెగ

జూన్‌లో 9 నెలల కనిష్ఠానికి వృద్ధి

దిల్లీ: జూన్‌లో దేశీయ తయారీ రంగ వృద్ధి తొమ్మిది నెలల కనిష్ఠానికి పరిమితమైంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల విక్రయాల వృద్ధిపై ప్రభావం పడటం ఇందుకు కారణం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) మేలో 54.6 శాతంగా ఉండగా.. జూన్‌లో 53.9 శాతానికి పరిమితమైంది. పీఎంఐ పరిభాషలో సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు, 50 పాయింట్ల దిగువన ఉంటే క్షీణత ఉన్నట్లు భావిస్తారు. జూన్‌లో 50 పాయింట్ల పైనే సూచీ ఉన్నప్పటికీ.. మే నాటి 54.6 పాయింట్ల కంటే తక్కువగా ఉండటం వల్ల, వృద్ధి నెమ్మదించినట్లుగా పరిగణించాలి. 2021 సెప్టెంబరు తర్వాత తయారీ రంగానికి సంబంధించి ఇదే తక్కువ వృద్ధి కావడం గమనార్హం. అయితే కార్యకలాపాలు వరుసగా 12వ నెలా మెరుగ్గా ఉన్నాయనే విషయాన్ని పీఎంఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘ద్రవ్యోల్బణ ఒత్తిడి, వడ్డీ రేట్లు పెరగడం, రూపాయి క్షీణత, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లాంటి పరిణామాలు సవాలు విసిరినప్పటికీ.. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాన్ని భారత్‌ బలంగానే ముగించింద’ని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టరు పాలియానా డె లిమా తెలిపారు. వరుసగా 12వ నెల అయిన జూన్‌లోనూ పరిశ్రమ ఆర్డర్లు, తయారీ పెరిగాయి. అయితే వృద్ధి రేటు తొమ్మిది నెలల కనిష్ఠానికి దిగివచ్చిందని సర్వే వివరించింది.


పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

ముంబయి: జూన్‌ 24తో ముగిసిన వారానికి విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.734 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.23,000 కోట్లు) పెరిగి 593.323 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.45,70,000 కోట్లు)కు చేరాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 5.87 బిలియన్‌ డాలర్లు తగ్గి 590.588 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 2.334 బిలియన్‌ డాలర్లు పెరిగి 529.216 బిలియన్‌ డాలర్లకు చేరాయి. బంగారు నిల్వలు 342 మి.డాలర్లు అధికమై 40.926 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు(ఎస్‌డీఆర్‌) 55 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.21 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశీయ నిల్వలు 3 మిలియన్‌ డాలర్లు వృద్ధి చెంది 4.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి.


మూడు నెలలకోసారి కరెన్సీ యంత్రాలను తనిఖీ చేయాలి

బ్యాంకులకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు

ముంబయి: కరెన్సీ నోట్లను విలువ ఆధారంగా వేరు చేసే యంత్రాల పనితీరును కనీసం మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించింది. 2016లో నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చాయి. నోట్లను వర్గీకరించే సమయంలో, వాటిని పలు రకాలుగా పరీక్షించాకే తిరిగి చెలామణిలోకి అనుమతించాలని ఆర్‌బీఐ సూచించింది. నోట్లు పాడైనట్లుగా గుర్తిస్తే, వాటిని నిలిపి వేయాలని తెలిపింది. ఆ యంత్రాలకు దొంగనోట్లను గుర్తించే సామర్థ్యం ఉందా లేదా అన్నదీ పరిశీలించాలని సూచించింది. యంత్రాలు తిరస్కరించిన నోట్లను, బ్యాంకు సిబ్బంది మరోసారి నిశితంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని