వాహన అమ్మకాలు భళా

దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ జూన్‌ టోకు అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. సెమీ కండక్టర్ల కొరత క్రమక్రమంగా తగ్గుతున్నందున, డీలర్లకు సరఫరాలు పెంచగలిగినట్లు సంస్థలు వివరించాయి.

Published : 02 Jul 2022 02:12 IST

జూన్‌లో రాణించిన మారుతీ, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌
చిప్‌ ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం

దిల్లీ: దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ జూన్‌ టోకు అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. సెమీ కండక్టర్ల కొరత క్రమక్రమంగా తగ్గుతున్నందున, డీలర్లకు సరఫరాలు పెంచగలిగినట్లు సంస్థలు వివరించాయి. కియా ఇండియా, ఎంజీ మోటార్‌ ఇండియా, స్కోడా ఆటోలు కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. కిందటి నెలలో మారుతీ సుజుకీ టోకు అమ్మకాలు 1,55,857 వాహనాలుగా నమోదయ్యాయి. 2021లో ఇదే నెలలో 1,47,368 వాహనాలను డీలర్లకు కంపెనీ సరఫరా చేసింది. ఆల్టో, ఎస్‌ ప్రెస్సో లాంటి చిన్న కార్ల అమ్మకాలు 1.28 శాతం పెరిగి 1,32,024 వాహనాలకు చేరాయి. కాంపాక్ట్‌ మోడళ్లు స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ మోడళ్ల అమ్మకాలు 77,746కు పెరిగాయి. 2021 జూన్‌లో ఈ వాహనాల అమ్మకాలు 68,849 గా నమోదయ్యాయి. విటారా బ్రెజా, ఎస్‌ క్రాస్‌, ఎర్టిగా లాంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు మాత్రం28,172  నుంచి 18,860 వాహనాలకు తగ్గాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మొత్తం అమ్మకాలు 54,474 వాహనాల నుంచి 14.5 శాతం పెరిగి 62,351 కు చేరాయి. టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల దేశీయ విక్రయాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా కార్ల విక్రయాలు 16,913 నుంచి 59 శాతం వృద్ధితో 26,880కు చేరాయి. మొత్తం విక్రయాలు (కార్లు, వాణిజ్య వాహనాలు) 54,096 వాహనాలుగా నమోదయ్యాయి.


హీరో మోటోకార్ప్‌ ఈవీలకూ‘హీరో’ ట్రేడ్‌ మార్కే

మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ నుంచి అనుకూల తీర్పు

దిల్లీ: త్వరలో అందుబాటులోకి తేనున్న విద్యుత్‌ వాహనాలకు ‘హీరో’ ట్రేడ్‌ మార్క్‌ ఉపయోగించుకునేలా మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ న్యాయస్థానం నుంచి తమకు అనుకూల తీర్పు వచ్చినట్లు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. హీరో ట్రేడ్‌ మార్క్‌ను ఉపయోగించే విషయంలో హీరో మోటోకార్ప్‌ సంస్థకు వ్యతిరేకంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ పిటిషన్‌ దాఖలు వేసింది. ‘ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారంపై హీరో మోటోకార్ప్‌ రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టడం, గత పదేళ్లలో హీరో బ్రాండు అభివృద్ధికి సుమారు రూ.7,000 కోట్లు వెచ్చించడం లాంటి విషయాలను ట్రైబ్యునల్‌ పరిగణనలోకి తీసుకుంద’ని కంపెనీ పేర్కొంది. మరోవైపు హీరో మోటోకార్ప్‌ తన మొదటి విద్యుత్‌ వాహనాన్ని జులైలో తీసుకు రావాలని తొలుత భావించినప్పటికీ.. ఈ ఏడాది పండగ సీజను వరకు విడుదలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయించింది.

ఆయా కంపెనీల వాహన విక్రయాలు పట్టికలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని