పెట్రోల్‌, డీజిల్‌పై ఎగుమతి సుంకం

పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది. దేశీయ సరఫరా ధరకే విదేశాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి చేయడం ద్వారా కొన్ని రిఫైనరీ కంపెనీలు అసాధారణ లాభాలు ఆర్జిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 02 Jul 2022 02:12 IST

విమాన ఇంధనంపైనా విధింపు ముడిచమురుపై విండ్‌ఫాల్‌ పన్ను
ప్రభుత్వానికి రూ.66,000 కోట్ల వార్షికాదాయం అంచనా
దేశీయంగా ఇంధన లభ్యత పెరుగుతుంది
దిల్లీ

పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది. దేశీయ సరఫరా ధరకే విదేశాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి చేయడం ద్వారా కొన్ని రిఫైనరీ కంపెనీలు అసాధారణ లాభాలు ఆర్జిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎగుమతి చేసే పెట్రోల్‌, ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.13 ఎగుమతి సుంకం విధించామని, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై టన్నుకు రూ.23,250 చొప్పున విండ్‌ఫాల్‌ పన్ను వసూలు చేయనుంది. గత ఏడాది దేశీయంగా 29 మిలియన్‌ టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేశారు. ఈ లెక్కన చూస్తే, కొత్తగా విధించిన పన్ను వల్ల ప్రభుత్వానికి రూ.66,000 కోట్ల వార్షిక ఆదాయం జమకానుంది.

ఎగుమతిపై పన్ను ఎందుకంటే

ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం కోత విధించడం వల్ల, ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని అంచనా. రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ముడిచమురుతో, దేశీయంగా పెట్రో ధరలు అదుపులో ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో  5.7 మిలియన్‌ టన్నుల డీజిల్‌, 2.5 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ను కంపెనీలు ఎగుమతి చేశాయి. ఇందువల్ల కంపెనీలు భారీగా లాభపడుతున్నాయి. అందుకే ఎగుమతి సుంకాలను ప్రభుత్వం విధించింది. దీనితోపాటు విండ్‌ఫాల్‌ సుంకం ఆదాయం కలిస్తే, ఎక్సైజ్‌ సుంకం వల్ల ఖజానాకు కలిగే నష్టాన్ని భర్తీ చేయొచ్చు. ముడిచమురుపై 25 శాతం విండ్‌ఫాల్‌ సుంకాన్ని ఇప్పటికే బ్రిటన్‌ విధించింది. ‘కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టకుండా, వినూత్న చర్యలు పాటించకున్నా, అనుకూల మార్కెట్‌ పరిస్థితుల కారణంగా గడించే లాభాలపై విధించే పన్ను’ను ‘విండ్‌ ఫాల్‌’గా పరిగణిస్తారు.

రిలయన్స్‌, నయారా ఎనర్జీకి ప్రతికూలం: పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతిపై సుంకం విధింపు నిర్ణయం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. దేశీయ సరఫరాల కంటే విదేశీ విపణుల్లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలకు ఈ కంపెనీలు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. రష్యా నుంచి చౌక ధరకు ముడిచమురు తీసుకువచ్చి, ఇక్కడ శుద్ధి చేసి, పెట్రోల్‌-డీజిల్‌గా మార్చి ఐరోపా, అమెరికా వంటి దేశాలకు ఈ సంస్థలు ఎగుమతి చేసి, భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి.
* గత కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పరుగులు తీయడంతో ప్రభుత్వ చమురు సంస్థలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా కూడా మార్చి త్రైమాసికంలో వరుసగా రూ.40,306 కోట్లు, రూ.3,887.31 కోట్ల లాభాలను ఆర్జించాయి. వేదాంతాకు చెందిన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ భారీ లాభాలు ప్రకటించింది.

దేశీయ విక్రయాలు తప్పనిసరి
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌ పరిమాణంలో 50 శాతం, డీజిల్‌ అయితే 30 శాతం తప్పనిసరిగా దేశీయంగా కంపెనీలు విక్రయించాలనే కొత్త నిబంధనను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 2021 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.

అసాధారణ లాభాలే కారణం: సీతారామన్‌
దేశీయంగా సరఫరా చేయకుండా, విదేశాలకు చమురు ఎగుమతుల ద్వారా కంపెనీలు అసాధారణ లాభాలను గడించడమే కొత్త పన్నులు విధించడానికి కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.  
నీ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆయిల్‌ ఇండియా షేరు 15.07%, ఓఎన్‌జీసీ 13.40%, ఎంఆర్‌పీఎల్‌ 9.99%, రిలయన్స్‌ 7.14%, చెన్నై పెట్రో 5.23%, హిందుస్థాన్‌ ఆయిల్‌ 3.18%, గెయిల్‌ షేరు 1.92% చొప్పున శుక్రవారం నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని