బంగారం ధరల భగభగ

బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చేలా పుత్తడిపై దిగుమతి సుంకాన్ని 10.75% నుంచి ఒక్కసారిగా 15 శాతానికి కేంద్రప్రభుత్వం పెంచడమే ఇందుకు కారణం. శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల ధర రూ.1440 పెరిగి రూ.51957 వద్ద ట్రేడింగ్‌ అవుతుండగా, హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో రూ.53,690కి చేరింది.

Updated : 02 Jul 2022 06:58 IST

దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ఖాతాదారుపై పెరిగిన భారం 4.25 శాతం
వెండిపై కస్టమ్స్‌ సుంకం మారలేదు
పసిడి దిగుమతులు, కరెంటు ఖాతాలోటు తగ్గించేందుకే ప్రభుత్వ చర్యలు
ఈనాడు వాణిజ్య విభాగం

బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చేలా పుత్తడిపై దిగుమతి సుంకాన్ని 10.75% నుంచి ఒక్కసారిగా 15 శాతానికి కేంద్రప్రభుత్వం పెంచడమే ఇందుకు కారణం. శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల ధర రూ.1440 పెరిగి రూ.51957 వద్ద ట్రేడింగ్‌ అవుతుండగా, హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో రూ.53,690కి చేరింది. పండుగల సీజన్‌ కోసం పసిడిని ఈ సీజన్‌లో అధికంగా దిగుమతి చేసుకుంటుంటారు. పైగా అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1800 డాలర్ల సమీపంలోనే ఉంది. ఇందువల్ల దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. ముడిచమురు ధరల వల్ల ఇప్పటికే డాలర్‌కు గిరాకీ అధికమైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన ఫిబ్రవరి 25 నుంచి చూస్తే మన విదేశీ మారకపు నిల్వలు 4,094 కోట్ల డాలర్లు తగ్గాయి. డాలర్‌ విలువ రూ.79 సమీపానికి చేరింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మన దేశంలోకి 842.28 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది. ఈ ఏడాది మేలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగి 107 టన్నులకు చేరాయి. జూన్‌లోనూ గణనీయంగా పెరిగాయి. పసిడి దిగుమతులు పెరిగితే విదేశీ మారకపు నిల్వలు మరింతగా ఖర్చవుతాయి. కరెంటు ఖాతాలోటు గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 1.2 శాతమైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి చేరొచ్చనే అంచనాలున్నాయి. అందుకే ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. 

బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 5% పెంపు: బంగారం దిగుమతిపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 7.5 శాతంగా ఉండగా, దీన్ని 5 శాతం పెంచి 12.5 శాతానికి చేర్చారు. దీనిపై 2.5 శాతం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ వసూలు చేస్తారు. అందువల్ల మొత్తం దిగుమతి సుంకం 15% అవుతుంది. వెండిపై కస్టమ్స్‌ సుంకంలో మార్పు చేయలేదు.

దిగుమతులను నిరుత్సాహ పరచేందుకే
‘దేశీయంగా పసిడిని దాదాపుగా ఉత్పత్తి చేయడం లేదు. పూర్తిగా దిగుమతులే చేసుకుంటున్నాం. ఇందువల్ల విదేశీ మారకపు ద్రవ్యం భారీగా తరలిపోతోంది. కరెంటు ఖాతా లోటు అధికమవుతోంది. అందువల్లే బంగారం దిగుమతులను నిరుత్సాహ పరచాలని నిర్ణయించాం. అయినా కూడా దిగుమతి చేసుకోవాలనుకుంటే, అధికంగా చెల్లించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసేందుకే కస్టమ్స్‌ పెంచామ’ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

మళ్లీ స్మగ్లింగ్‌ పెరుగుతుంది: విశ్లేషకులు
అంతకుముందు ‘పసిడి, వెండిపై దిగుమతి సుంకం 10 శాతం ఉండగా, 2019 జులైలో 2.5 శాతం పెంచడంతో  12.5 శాతమైంది. విదేశాలతో పోలిస్తే, దేశీయంగా పసిడి ధర 12.5 శాతం అధికం కావడంతో, దొంగచాటుగా తెచ్చి (స్మగ్లింగ్‌) అమ్ముకునే వారికి కిలోకు రూ.5 లక్షలకు మించి మిగిలేది.

స్మగ్లింగ్‌ నిరోధంతో పాటు రత్నాభరణాల ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021 బడ్జెట్‌లో పసిడిపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. అయితే  2.5 శాతం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌తో పాటు, బేసిక్‌ కస్టమ్స్‌పై 10 శాతం సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జి వేయడం వల్ల అప్పుడూ తగ్గినభారం స్వల్పమే. ఇప్పుడు దిగుమతి సుంకం ఏకంగా 15 శాతం కావడం.. అధిక ధరల వల్ల దొంగచాటుగా తెచ్చే వారికి మరింత ఎక్కువ మొత్తం మిగులుతుందని, ఫలితంగా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు పెరగొచ్చని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ దేశీయ మండలి (జీజేసీ) ఛైర్మన్‌ ఆశిస్‌ పెథె పేర్కొన్నారు. ‘రూ.లక్ష బంగారం విలువపై పన్నుల భారమే 18.5 శాతానికి చేరింది. ఈ పెంపును తాత్కాలికంగానే అమలు చేయాలి. కొనసాగిస్తే మాత్రం బిల్లుల్లేని అనధికారిక విక్రయాలు పెరుగుతాయి. నాణ్యత రూపేణ వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉంద’ని ప్రపంచ స్వర్ణమండలి ఇండియా సీఈఓ సోమసుందరం పీఆర్‌           తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని