విస్తరణకు సిమెంటు వేస్తున్నారు

ఒక పక్క వ్యయాలు పెరిగి, అమ్మకాలు తగ్గి... లాభదాయకతపై ఒత్తిడి అధికమైనప్పటికీ దేశీయ సిమెంటు కంపెనీలు విస్తరణ బాటలో పయనిస్తున్నాయి. సాధ్యమైనంత మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి కసరత్తు చేస్తున్నాయి. అగ్రశ్రేణి సిమెంటు కంపెనీల నుంచి మధ్యస్థాయి

Updated : 03 Jul 2022 06:26 IST

వచ్చే అయిదేళ్లలో 150- 160 మి. టన్నుల అదనపు సామర్థ్యం

పరిశ్రమలోకి భారీగా పెట్టుబడులు

ఈనాడు - హైదరాబాద్‌

క పక్క వ్యయాలు పెరిగి, అమ్మకాలు తగ్గి... లాభదాయకతపై ఒత్తిడి అధికమైనప్పటికీ దేశీయ సిమెంటు కంపెనీలు విస్తరణ బాటలో పయనిస్తున్నాయి. సాధ్యమైనంత మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి కసరత్తు చేస్తున్నాయి. అగ్రశ్రేణి సిమెంటు కంపెనీల నుంచి మధ్యస్థాయి కంపెనీల వరకూ... కొత్త యూనిట్లు స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న యూనిట్లలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో మనదేశంలో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. మనదేశంలో ప్రస్తుతం 545 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంటు పరిశ్రమ దాదాపు 355 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంటు డిమాండు 382 మిలియన్‌ టన్నుల మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, పట్టణ-నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల వల్ల 2027 నాటికి సిమెంటు గిరాకీ 420 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. మరో పక్క మన దేశంలో సిమెంటు తలసరి వినియోగం 242 కిలోలు మాత్రమే. అదే సమయంలో ప్రపంచ సగటు 525 కిలోలు ఉండటం గమనార్హం. మన ఆర్థిక వ్యవస్థ వచ్చే కొన్నేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందనే అంచనా కూడా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పలు సిమెంటు కంపెనీలు విస్తరణ బాట పట్టినట్లు తెలుస్తోంది.

ఇవీ ప్రణాళికలు...

సిమెంటు కంపెనీల విస్తరణ వల్ల వచ్చే అయిదేళ్లలో 150-160 మిలియన్‌ టన్నుల అదనపు సామర్థ్యం సమకూరబోతోంది. అల్ట్రాటెక్‌, అదానీ గ్రూపు, శ్రీ సిమెంట్‌, దాల్మియా భారత్‌, సాగర్‌, రాంకో సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌, శ్రీ దిగ్విజయ్‌ సిమెంట్‌, నొవకో విస్టాస్‌ గ్రూపు... తదితర సంస్థలు విస్తరణ బాటలో ఉన్నాయి.

* అగ్రగామి సిమెంటు సంస్థగా ఉన్న అల్ట్రాటెక్‌, అదనంగా దాదాపు 39 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోనుంది. దీనికోసం రూ.12,800 కోట్లు వెచ్చిస్తోంది. ఈ విస్తరణ పూర్తయితే, అల్ట్రాటెక్‌కు ఉన్న సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 154 మి.టన్నులకు చేరుకుంటుంది.

* అదానీ గ్రూపు దేశీయ సిమెంటు రంగంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించటానికి సిద్ధపడుతోంది. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీల్లో విదేశీ సంస్థ హోల్సిమ్‌కు ఉన్న వాటా అదానీ చేతికి రానున్న విషయం విదితమే. ఈ రెండు సిమెంటు కంపెనీలకు దాదాపు 68 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉంది. ఇంతటితో సరిపెట్టుకోకుండా సామర్థ్యాన్ని ఇంకా విస్తరించే ప్రణాళికలను అదానీ గ్రూపు సిద్ధం చేస్తోంది. వచ్చే అయిదేళ్లలో 140 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి చేరుకోవాలనేది అదానీ గ్రూపు ఆలోచన.

* ఉత్తరాదికి చెందిన సిమెంటు కంపెనీ శ్రీ సిమెంట్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 3 మిలియన్‌ టన్నుల సిమెంటు యూనిట్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతం దీనికి 47 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 2030 నాటికి ఇది 80 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది.

* దాల్మియా భారత్‌కు 36 మిలియన్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 2024 చివరి నాటికి దీన్ని 48 మిలియన్‌ టన్నులకు పెంచుకోనుంది. దీనిపై రూ.9,000 కోట్లు పెట్టుబడిగా పెడుతోంది.

* హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్‌ సిమెంట్స్‌ వచ్చే రెండు-మూడేళ్లల  10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కల సంస్థగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 8 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. ఇతర సంస్థలకు చెందిన యూనిట్లను కొనుగోలు చేయటం ద్వారా త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై ఈ సంస్థ దృష్టి కేంద్రీకరిస్తోంది.

* కేశోరాం ఇండస్ట్రీస్‌ తన సిమెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇప్పుడున్న 11 మిలియన్‌ టన్నుల నుంచి 15 మిలియన్‌ టన్నులకు పెంచుకోనుంది.

స్వల్పకాలం... కష్టకాలం?

‘కొవిడ్‌’ ఆంక్షలు తగ్గుముఖం పట్టిన తర్వాత సిమెంటు వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సిమెంటు కంపెనీలు అధిక అమ్మకాలు, లాభాలు నమోదు చేశాయి. కానీ ఇప్పుడు ఆ సానుకూలత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ డిమాండు పరిమితంగానే ఉంది. ద్వితీయార్థంలో పరిస్థితులు కొంత మెరుగుపడతాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. అధిక వ్యయాలు, ధర తగ్గిపోవటం, తగినంతగా గిరాకీ లేకపోవటం... ఇప్పుడు సిమెంటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. ఇదే సమయంలో కొన్ని కంపెనీల నుంచి అదనపు సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ కారణాల వల్ల స్వల్పకాలంలో సిమెంటు కంపెనీల ఆదాయాలపై ఒత్తిడి తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని